ఏయూక్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ‘మేకపాటి గౌతంరెడ్డి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మెడిటేషన్ అండ్ దమ్మ’ నిర్మాణానికి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి భూమి పూజ చేశారు. శనివారం ఉదయం ఏయూలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అసెంబ్లీ మందిరం వెనుక భాగంలో నూతనంగా మహాబోధి సొసైటీ నిర్వహించే ఈ కేంద్రం నిర్మాణాన్ని భూమి పూజతో ప్రారంభించారు. భవనం నిర్మాణానికి అవసరమైన రూ.1.4 కోట్లను రాజమోహన్‌రెడ్డి అందించనున్నారు.
భూమి పూజ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏయూలో ఏర్పాటవుతున్న ఇలాంటి మంచి కార్యక్రమంలో తాను భాగం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. నగరం మధ్యలో విశాఖ ప్రజలకు ఉపయుక్తంగా ఇంతటి సువిశాల ప్రాంగణంలో మెడిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన గొప్పదన్నారు. దీనికి తన కుమారుడు మేకపాటి గౌతంరెడ్డి పేరు పెట్టడం సంతోషకరమన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, ధమ్మ చార్య విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖను రాజధానిగా చేస్తే అంతర్జాతీయ ఖ్యాతి
విశాఖ మన రాజధాని అయ్యేలా అందరూ చూడాలని మాజీ ఎంపీ మేకపాటి కోరారు. మద్రాసు నుంచి విడిపోయినప్పుడే విశాఖ రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేసి అక్కడ హైకోర్టు ఏర్పాటు చేసి ఉంటే ప్రజలంతా సంతోషించేవారని చెప్పారు. అలా జరిగి ఉన్నట్లయితే అంతర్జాతీయ నగరంగా విశాఖ ఈ పాటికే రూపుదిద్దుకునేదని, ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఎంపిక చేయడం మంచి పరిణామమన్నారు. బహుశా న్యాయ వ్యవస్థ సైతం దీనికి సహకరిస్తుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment