
సాక్షి, విజయవాడ: కృష్ణా జలాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇది చాలా సున్నితమైన అంశం..పరస్పరం సహకరించుకోవాలని తెలిపారు. మంగళవారం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతారు.
‘నాగార్జుసాగర్ ప్రాజెక్ట్ రెండు రాష్ట్రాలకి సగం సగంగా ఉంది. ప్రాజెక్టులు అప్పగించమని అసెంబ్లీలో తీర్మానం చేయడం ఎంతవరకు ధర్మం. విభజన చట్టాన్ని అంగీకరించి.. ఒక సెక్షన్ మాత్రం అంగీకరించం అంటే ఎలా?. ఏపీ కూడా విభజన చట్టాన్ని అంగీకరించం అంటే కుదురుతుందా. విభజన సమయంలో నదీజలాల పంపిణీపై చట్టంలో పొందుపరిచారు. విభజన చట్టం అంగీకరించమని చెప్పడం మొండివాదన. తెలంగాణ వాటాలో ఒక్క నీటి బొట్డు కూడా మాకు అవసరం లేదు.
...ఆంధ్రా, రాయలసీమకి కేటాయించిన నీటి జలాలపైనే మా సీఎం వైఎస్ జగన్ చట్టబద్దంగా తీసుకెళ్లడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. కేఆర్‌ఎంబీని విభజన చట్టంలో పొందుపరిచారు. టీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు వివాదాలు ఉండవచ్చు. కృష్ణా జలాల పంపకాలు ఇప్పటివి కాదు. బచావత్ ట్రిబ్యునల్ ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించింది. ఒకసారి అవార్డు అయిన అంశాలని వివాదం ఎలా చేస్తారు.. చట్టాన్ని గౌరవించాలి. హైదరాబాద్‌ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న వాదనలపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి’ అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.