సాక్షి, తాడిపత్రి : వ్యక్తిగత స్వార్థంతో పచ్చటి గ్రామాల్లో చిచ్చు రగిల్చే విధానాలను మానుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హితవు పలికారు. రైతులు ఒక్కప్పుడు అమ్మిన భూములను తిరిగి ఇప్పిస్తానంటూ మోసపూరిత రాజకీయాలకు తెరతీయడం సమంజసం కాదని అన్నారు. ఇది గ్రామాల్లో వర్గ కక్షలను ప్రేరేపించేలా ఉందని అన్నారు. మంగళవారం తాడిపత్రిలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఎకరానికి రూ.20 వేలు ఎక్కువ ఇప్పిస్తా
కేవలం తన చుట్టూ జనం తిరిగేలా చేసుకునేందుకే భూముల వ్యవహారంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి తలదూర్చారని అన్నారు. ఒకసారి ఇతరులకు విక్రయించిన భూములను తిరిగి ఇప్పించడం ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. జేసీ సోదరులు వారి స్వగ్రామమైన జూటూరులో రైతుల పొలాల గట్లను డోజర్లతో చదును చేయించి ఎకరాకు రూ.30 వేలు ఇచ్చి దౌర్జన్యంగా భూములను లాక్కొన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆ భూములకు ఎకరాకు రూ.20 వేలు ఎక్కువగా తానిప్పిస్తానని, వాటిని అదే రైతులకు ఇచ్చే త్యాగబుద్ధి ఉందా అంటూ సవాల్ విసిరారు. (మూడు అంశాలే ప్రామాణికం!)
స్వచ్ఛందంగా అమ్ముకున్నారు
గతంలో వంగనూరు, బొందెలదిన్నె గ్రామాల సమీపంలోని భూములను రైతులు స్వచ్ఛందంగా అమ్ముకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం కడప జిల్లా ఆర్‌ఎస్ కొండాపురం మండలం గండికోట ముంపు గ్రామాల ప్రజలు తాడిపత్రిలో గృహాలు నిర్మించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని, ఫలితంగా తాడిపత్రి ప్రాంతంలో భూములకు డిమాండ్ పెరిగిందన్నారు. ఈ డిమాండ్‌ను ఆసరాగా చేసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి రైతులను మభ్య పెడుతూ గతంలో అమ్ముకున్న భూములను తిరిగి ఇప్పిస్తానంటూ గ్రామాల్లో చిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. డబ్బు ఉంటే ఎవరైనా భూములను కొనుగోలు చేయవచ్చునని, అయితే ముందు అమ్మిన ధర కంటే ఎకరానికి రూ.20 వేలు, రూ.30 వేలు ఎక్కువ ఇస్తామనడం సరైన సంస్కృతి కాదని అన్నారు. మాయమాటలతో గ్రామాల్లో గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే సహించబోమని మాజీ ఎమ్మెల్యేని హెచ్చరించారు.
ఆరోగ్యం కాపాడుకో..
చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా పనులు చేసి ఉంటే వారిపై మాత్రమే కేసులు నమోదవుతాయని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబం«ధించి కర్ణాటకలోని అధికారులు లేఖలు రాయడం జరిగిందని, వారు స్పందించకపోవడంతో లోకాయుక్తలో ఫిర్యా దు చేసినట్లు గుర్తు చేశారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించి దివాకర్ ట్రావెల్స్, జఠాధర ఇండస్ట్రీస్ యజమానులుగా ఎవరైతే ఉంటారో వారిపైన మాత్రమే కేసులు నమోదు అవుతాయన్నారు. ఈ విషయంగా ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని జేసీ ప్రభాకర్‌రెడ్డికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment