AP New Districts: ముహూర్తం 4న | Moment has come for formation of new districts in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

AP New Districts: ముహూర్తం 4న

Published Thu, Mar 31 2022 2:55 AM | Last Updated on Thu, Mar 31 2022 8:37 AM

Moment has come for formation of new districts in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నూతన జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్‌ 4వ తేదీన ఉదయం 9:05 నుంచి 9:45 గంటల మధ్య 13 కొత్త జిల్లాల అవతరణ ముహూర్తానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు కొత్త జిల్లాల కార్యకలాపాలను సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సేవలందిస్తున్న వలంటీర్లకు సత్కారాన్ని ఏప్రిల్‌ 6వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. ఏప్రిల్‌ 8వ తేదీన వసతి దీవెన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నూతన జిల్లాల అవతరణ, మౌలిక సదుపాయాల కల్పన, పరిపాలనా సముదాయాల నిర్మాణం తదితర అంశాలపై ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.



సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను కొత్త జిల్లాలతో అనుసంధానం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పరిపాలనా సముదాయాల నిర్మాణాల కోసం అనువైన స్థలాల ఎంపిక త్వరగా పూర్తి చేయాలని, కనీసం 15 ఎకరాల స్థలం ఉండేలా చూడాలని సూచించారు. కలెక్టర్‌తోపాటు జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలన్నీ కూడా ఒకే సముదాయంలో ఏర్పాటు చేయాలని, క్యాంపు కార్యాలయాలు కూడా అదే ప్రాంగణంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భవనాల కోసం మంచి డిజైన్లను ఎంపిక చేసుకోవాలని,  పది కాలాలు గుర్తుండేలా భవనాల నిర్మాణం ఉండాలని స్పష్టం చేశారు. అద్దె ప్రాతిపదికన భవనాలు తీసుకున్న జిల్లాల్లో నూతన భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

ప్రజాభిప్రాయానికి అనుగుణంగా..
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన వివరాలను సమావేశంలో సీఎస్,  ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజల నుంచి 16,600 సలహాలు, అభ్యంతరాలు వచ్చాయని, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసినట్లు తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాతే కలెక్టర్లు సిఫార్సులు చేశారని చెప్పారు. సిబ్బంది విభజన, పోస్టింగుల్లో ఆరు సూత్రాల ఫార్ములా తదితరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకునే కొత్త జిల్లాల పాలనా యంత్రాంగం నిర్మాణం, పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనలు తయారు చేశామని వెల్లడించారు. కొత్త జిల్లాలకు సిబ్బంది వెళ్లేలోగా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సరి చూసుకునేందుకు చెక్‌లిస్టు కూడా రూపొందించినట్లు చెప్పారు. 

సాఫ్ట్‌వేర్‌లో మార్పుచేర్పులు..
నూతన వెబ్‌సైట్లు,  యంత్రాంగానికి అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేర్పులు పూర్తయినట్లు వివరించారు. కొత్త జిల్లాల సమాచారంతో హ్యాండ్‌ బుక్స్‌ కూడా సిద్ధం చేశామన్నారు. కలెక్టర్లు, జిల్లా పోలీసు అధికారుల కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలను ఖరారు చేశామని,  ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేనిచోట్ల ప్రైవేట్‌ భవనాలను అద్దె ప్రాతిపదికన తీసుకున్నట్లు తెలిపారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ జి. సాయిప్రసాద్, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ప్రణాళిక శాఖ కార్యదర్శి వి.విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

కొత్త జిల్లాలు, డివిజన్ల ఖరారు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 13 కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. కొత్త జిల్లాలతో కలిపి మొత్తం 26 జిల్లాలు, కొత్త డివిజన్లతో కలిపి మొత్తం 73 రెవెన్యూ డివిజన్లకు సంబంధించిన ఫైలును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పర్చువల్‌ విధానంలో కేబినెట్‌ ఆమోదానికి బుధవారం పంపించారు. ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞాపనలను పరిగణనలోకి తీసుకుని కొన్ని మార్పులు, చేర్పులతో కూడిన కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు కేబినెట్‌ ఆమోదం లభించిన తరువాత ఏప్రిల్‌ 3వ తేదీన తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అదే రోజు కొత్త జిల్లాలకు కలెక్టర్లను, జేసీలను, ఎస్పీలను, ఉద్యోగులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. 

ఈ నెల 4 నుంచి విధుల్లోకి..
కొత్తగా ఏర్పాటయ్యే 13 జిల్లాలకు ఒక్కో కలెక్టర్, ఒక్కో జాయింట్‌ కలెక్టర్, ఒక్కో ఎస్పీని నియమించనున్నారు. ఇప్పటికే 13 జిల్లాల్లో ఆసరా, సంక్షేమ జాయింట్‌ కలెక్టర్లుగా పనిచేస్తున్న వారిని కొత్త జిల్లాలకు జిల్లా రెవెన్యూ అధికారులుగా నియమిస్తారు. ఈ నెల 4న ఉదయం 9.05–9.45 గంటల మధ్య కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, జిల్లా రెవెన్యూ అధికారులతో పాటు ఆ జిల్లాల్లోని రెవెన్యూ డివిజన్ల కార్యాలయాల్లో ఉద్యోగులు బాధ్యతలు చేపట్టి పరిపాలన కార్యకలాపాలు ప్రారంభిస్తారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో పనిచేయాల్సిన ఉద్యోగులు, అధికారుల పంపిణీ కసరత్తును ఇప్పటికే సంబంధిత శాఖలతోపాటు ఆర్థిక శాఖ కూడా పూర్తి చేసింది. ప్రస్తుత జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులనే జనాభా ప్రాతిపదికన కొత్త జిల్లాల్లో పనిచేయడానికి తాత్కాలిక ప్రాతిపదికన బదిలీ చేయనున్నారు. ఆరు సూత్రాలు, జోన్‌లకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చేవరకు కొత్త జిల్లాల్లో పనిచేసే ఉద్యోగులు పదోన్నతులు, సీనియారిటీ, స్థానికతలో ఎటువంటి మార్పు ఉండదు. ప్రస్తుతం ఉన్న సీనియారిటీ, స్థానికత యథాతథంగా ఉంటుంది. మొత్తంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు బదిలీ అయ్యే ఉద్యోగుల సంఖ్య 10వేల నుంచి 12వేల లోపు ఉంటుందని అధికారులు అంచనా.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement