సాక్షి, అమరావతి: కౌలు రైతులకు రుణాల మంజూరుపై బ్యాంకర్లు మరింత దృష్టి సారించాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరారు. శుక్రవారం సచివాలయంలో ఆయన ఆధ్వర్యంలో 218వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. బ్యాంకుల సహకారం ప్రభుత్వానికి బాగా లభిస్తోందని, ఇదే తోడ్పాటును ఇక ముందూ అందించాలని కోరారు. వార్షిక రుణ ప్రణాళికలో బ్యాంకులు ఇప్పటివరకు మంచి ప్రగతిని సాధించాయని అభినందించారు. అలాగే సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగం తమ ప్రభుత్వానికి చాలా ముఖ్యమని.. దీనికి ఇతోధికంగా సహకారం అందించాలని కోరారు. జగనన్న కాలనీలు, వైఎస్సార్ చేయూత పథకాలకు బ్యాంకులు సహాయ సహకారాలు అందించాలన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక సాయాన్ని పెంచాలని.. వారికి అందించే పథకాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
ప్రైవేటు బ్యాంకులూ భాగస్వాములు కావాలి..
ప్రభుత్వ బ్యాంకులతోపాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా పథకాల్లో భాగస్వాములు కావాలని.. తద్వారా రాష్ట్ర ప్రగతికి తోడ్పాటు అందించాలని మంత్రి బుగ్గన సూచించారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. ఆర్బీకేల ద్వారా బ్యాంకు రుణం పొందేలా ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకురానుందని తెలిపారు. దీనికి బ్యాంకులు సహకారం అందించాలని కోరారు. సహకార బ్యాంకుల పురోభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వాటికి కావాల్సిన షేర్ క్యాపిటల్ రూ.270 కోట్లకు కూడా సహకారం అందించామన్నారు.
ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ వి.బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ.. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన సాగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పాలన వికేంద్రీకరణకు దోహదం చేస్తుందన్నారు. అంతేకాకుండా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందడానికి ఊతం ఇస్తుందని తెలిపారు. ప్రయోగాత్మకంగా 13 ప్రాంతాల్లోని ఆర్బీకేల వద్ద ఏటీఎంలను ఏర్పాటు చేసేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టిందన్నారు. ఇవి రైతులు గ్రామాల్లో బ్యాంకు సేవలు పొందడానికి దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్ ఎస్‌ఎస్ రావత్, ఆర్‌బీఐ జీఎం యశోద బాయి, నాబార్డు జీఎం రమేష్ బాబు, ఇతర బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కౌలు రైతులకు రుణాలపై మరింత దృష్టి
Published Sat, Mar 26 2022 3:47 AM | Last Updated on Sat, Mar 26 2022 2:28 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment