సాక్షి, న్యూఢిల్లీ: మూలధన వ్యయం పెంచాలని పలు రాష్ట్రాలు కోరిన మేరకు ఒక ముందస్తు వాయిదాతో కలుపుకుని మొత్తం రూ.95,082 కోట్లను ఈ నెలలో రాష్ట్రాలకు విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశంలో కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక పునరుద్ధరణపై మేధోమథనం చేసేందుకు సోమవారం నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రుల సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశానికి 15 రాష్ట్రాల సీఎంలు, మూడు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, ఇతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. ఇందులో మూలధన వ్యయాన్ని పెంచాలని రాష్ట్రాలు కోరాయి.
ఈ సమావేశానంతరం నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ.. సాధారణంగా రాష్ట్రాలకు విడుదల చేసే రూ.47,541 కోట్లకు బదులు నవంబర్ 22న రాష్ట్రాలకు మరో విడత అదనంగా ఇవ్వాలని ఆర్థిక కార్యదర్శికి సూచించినట్లు తెలిపారు. దీంతో ఈనెల 22న మొత్తం రూ.95,082 కోట్లు ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. దీంతో రాష్ట్రాల వద్ద ఉండే మూలధనం పెరుగుతున్న కారణంగా, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఖర్చుచేయడాన్ని పరిగణించవచ్చని ఆమె వెల్లడించారు. ఇక ప్రస్తుతం వసూలుచేస్తున్న పన్నులో 41 శాతం 14 వాయిదాల్లో రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నట్లు ఆర్థిక కార్యదర్శి సోమనాథన్ తెలిపారు. అంతేగాక.. ఎక్సైజ్ డ్యూటీని లీటర్ పెట్రోల్ ధరలో రూ.5, డీజిల్ ధరలో లీటరుకు రూ.10 నాన్–షేరబుల్ పోర్షన్ నుంచి తగ్గించామన్నారు.
రూ. 20వేల కోట్ల వీజీఎఫ్ కార్పస్‌ను రూపొందించాలి: బుగ్గన
ఆరు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. బుగ్గన మాట్లాడుతూ.. ఒక కీలక ప్రతిపాదనను ఉంచారు. జాతీయ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల తరహాలో రూ. 20,000 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కార్పస్‌ను రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రతిపాదించారు. ఈ నిధుల ద్వారా సుమారు రూ.5 లక్షల కోట్ల ఏకీకృత పెట్టుబడి సామర్థ్యంతో 10 వ్యూహాత్మక ప్రాజెక్టులను బలోపేతం చేయడం ద్వారా గొప్ప ప్రభావాన్ని సృష్టించవచ్చని వివరించారు.
ఇది అనేక ఉపాధి అవకాశాలను సృష్టించడమే కాకుండా దేశంలోని అన్ని రంగాలలో స్పిన్–ఆఫ్ అభివృద్ధి కార్యకలాపాలను ప్రేరేపిస్తుందని.. అంతేగాక, ఇది ఐదు ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు దారి తీస్తుందన్నారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, మల్టీ–లేటరల్ ఫైనాన్సింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల వంటి వినూత్న ప్రాజెక్టు ఫైనాన్సింగ్ ఎంపికల ద్వారా సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నించినప్పటికీ, అవి ఆశించిన ఫలితాలివ్వలేదని బుగ్గన రాజేంద్రనాథ్ సమస్యను ఎత్తిచూపారు.
కాకినాడలో రూ.39,200 కోట్లతో ప్రతిపాదించిన హెచ్‌పీసీఎల్–గెయిల్ పెట్రో కాంప్లెక్స్ ప్రాజెక్ట్ కేసును ఉటంకిస్తూ, గత మూడేళ్లుగా రూ.5,700 కోట్ల వీజీఎఫ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చిక్కుకుపోయిందని తెలిపారు. ఈ భారీ పెట్రో ప్రాజెక్టు సాకారమైతే ఆంధ్రప్రదేశ్‌లోకి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment