నిర్మలాసీతారామన్‌కు వినతిపత్రమిస్తున్న బుగ్గన
సాక్షి, న్యూఢిల్లీ: రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరీతో విడివిడిగా భేటీ అయ్యారు. నార్త్ బ్లాక్‌లోని కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో నిర్మలా సీతారామన్‌ను సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌తో కలిసి సుమారు 50 నిమిషాలపాటు బుగ్గన సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ లోటును భర్తీ చేయాలని, వివిధ అంశాల కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విడుదల చేయాలని కోరామని బుగ్గన తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి న్యాయపరంగా రావాల్సిన నిధులపై ఇప్పటికే ఆయా మంత్రులను కలిసి చర్చించామన్నారు.
భూసేకరణ, పునరావాసానికి సంబంధించి 1985లో సేకరించిన అంచనాల వివరాలనే గత ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిందని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఎంత ఖర్చవుతుందో అంత చెల్లించాల్సి ఉంటుందనే విషయాన్ని కేంద్రం దృష్టికి రాష్ట్రం తీసుకెళ్లిందని వివరించారు. పోలవరం విషయంలో గత ప్రభుత్వానికి వాస్తవాలు అర్థం కాలేదని తాము భావిస్తున్నామని, అందుకే వివిధ నివేదికలు, ప్రాజెక్టు రిపోర్టులు, స్పెషల్ ప్యాకేజీల విషయంలో కొన్ని ఆశ్చర్యకరమైన పరిస్థితుల్లో కేంద్రానికి వివరాలను సమర్పించారన్నారు.
ఓర్వకల్లు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తయిన దృష్ట్యా అక్కడి నుంచి ఇండిగో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరీని కోరినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు అందించామని, ఆ స్థలాల్లో పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మించాలని కోరామన్నారు. కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పూరీ సానుకూలంగా స్పందించారని వివరించారు. కాగా, స్థానిక ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పు కరోనా వారియర్స్ విజయంగా, ప్రజా విజయంగా మంత్రి బుగ్గన అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment