ప్రపంచంలో అత్యంత ధనికదేశం అమెరికాలోని గ్రామీణ ప్రాంతాల్లో (వాటిని కౌంటీలు అని పిలుస్తారు) దేశ జనాభాలో కేవలం 20 శాతం జనమే నివసిస్తున్నారు. పట్టణాలు, నగరాలకు దూరంగా ఉండే ఈ ప్రాంతాల్లో 80 శాతం ప్రజలకు అవసరమైనన్ని వైద్య సౌకర్యాలు లేవని అమెరికా కేంద్ర (ఫెడరల్ ) ప్రభుత్వం భావిస్తోంది. ఈ కౌంటీల్లో దేశ ప్రజల్లో 20% నివసిస్తున్నాగాని మొత్తం డాక్టర్లలో కేవలం పది శాతం మందే అక్కడ ప్రాక్టీసు చేస్తున్నారు. వైద్యసేవలు అరకొరగా అందిస్తున్నారు. అంటే డాక్టర్లు ప్రపంచంలో ఎక్కడైనా పట్టణ, నగర ప్రాంతాల్లోనే నివసిస్తూ వైద్య, ఆరోగ్య సేవలు అందించడానికి ఇష్టపడతారనేది జగమెరిగిన సత్యం.
2010–2017 సంవత్సరాల మధ్య కాలంలో గ్రామీణ కౌంటీలలో ప్రాథమిక వైద్య సేవలందించే డాక్టర్ల సంఖ్య అక్కడి జనాభాతో పోల్చితే బాగా తగ్గిపోయిందని అమెరికాలోని ప్రసిద్ధ హార్వర్డ్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఇకనామిక్స్ స్కాలర్లు గత ఏడాది చేసిన అధ్యయనంలో తేలింది. ఈ సర్వేకు సంబంధించిన ఏడేళ్ల కాలంలో గ్రామీణ కౌంటీల్లో ప్రాథమిక వైద్యుల సంఖ్య తగ్గిపోగా, నగర (మెట్రోపాలిటన్ ఏరియాలు) ప్రాంతాల్లో డాక్టర్ల సంఖ్య పెరిగింది. మొత్తంమీద అమెరికాలో డాక్లర్ల సంఖ్య అవసరమైన స్థాయిలో లేకపోవడం ఒకటైతే, కొన్ని ప్రాంతాల్లో వైద్యులు మరీ తక్కువగా ఉండడం పెద్ద లోపంగా ప్రభుత్వాధికారులు గుర్తించారు. నగర, పట్టణ ప్రాంతాల ప్రజలతో పోల్చితే గ్రామీణ కౌంటీల్లోని జనానికి గుండె జబ్బులు, కేన్సర్, దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు, అన్ని రకాల స్ట్రోకులు ఎక్కువ పీడిస్తున్నాయని అనేక సర్వేలు చెబుతున్నాయి. అగ్రరాజ్యానికి సంబంధించిన ఈ సమస్య గురించి ఇక్కడ వివరించడానికి కారణాలు లేకపోలేదు.
ఇండియాలో పల్లె ప్రాంతాల్లో వైద్యుల సంఖ్య బాగా తక్కువే, ఏపీలో కొత్త పరిష్కారం
వైద్య కళాశాలల సంఖ్య, డాక్టర్ల సంఖ్య ఈమధ్యనే పెరుగున్న భారతదేశంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ గ్రామీణ ప్రాంతాల ప్రజలు తగినంత మంది వైద్యులు అందుబాటులో లేక కొన్ని దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్నారనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రజారోగ్యానికి మున్నెన్నడూ కనీవినీ ఎరగని రీతిలో ప్రాధాన్యం ఇచ్చారు దివంగత జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు. 2004 నుంచి 2009 వరకూ ఐదేళ్లకు పైగా సాగిన ఆయన పాలనా కాలంలో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరికీ వైద్య సౌకర్యాల కోసం విశేష కృషి చేశారు వైఎస్ గారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్ల పోస్టులు పెద్ద సంఖ్యలో ఆయన ప్రభుత్వం భర్తీ చేసింది.
108 వంటి అత్యవసర వైద్య సేవలతో పాటు పేదలు, బడుగు వర్గాల కోసం ఉచిత వైద్యానికి ఆరోగ్య శ్రీ పథకం రూపొందించి పకడ్బందీగా అమలు చేశారు. నవ్యాంధ్రలో నాలుగేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజన్న మార్గంలో పయనిస్తూ గ్రామీణ ప్రాంతాల వైద్య, ఆరోగ్య అవసరాలకు ఎక్కువ నిధులు కేటాయిస్తోంది. అనేక వ్యాధులను ఆరోగ్య శ్రీ పథకం పరిధిలోకి తీసుకొచ్చింది. వీటన్నింటికీ తోడు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యులు తగినంత సంఖ్యలో అందుబాటులో ఉండేలా చేయడానికి కొత్తగా ‘ఫ్యామిలీ డాక్టర్’ పథకం ప్రవేశపెట్టింది.
ఈ వినూత్న వైద్య–ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమం పూర్తి స్థాయిలో అమలయ్యే నాటికి పల్లెల్లో ప్రజలందరికీ డాక్టర్లు పిలిస్తే పలికే మంచి రోజులొస్తాయి. 10,032 డాక్టర్ వైఎస్సార్ హెల్త్ క్లినిక్కుల ద్వారా పనిచేసే వైద్యుల సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రజారోగ్య సంరక్షణలో దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆంధ్ర రాష్ట్రం ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. వైద్యులే స్వయంగా పల్లె ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి జనం ఆరోగ్యం గురించి వాకబు చేసి వైద్య సహాయం అందిస్తే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తెలుగునాట సాకారమౌతుంది. అప్పుడు అమెరికా విశ్వవిద్యాలయాలు సైతం ఏపీ వచ్చి ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలను అధ్యయనం చేయాల్సిన పరిస్థితులు వస్తాయి.
-విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment