ముర్రా.. మేడిన్‌ ఆంధ్రా | Murrah Buffalo Made in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ముర్రా జాతి గేదెల అభివృద్ధిలో ఫలించిన శాస్త్రవేత్తల కృషి

Published Sun, Aug 7 2022 9:08 AM | Last Updated on Sun, Aug 7 2022 9:18 AM

Murrah Buffalo Made in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: అత్యధిక పాల దిగుబడినిచ్చే గేదెలు ఏవంటే.. హర్యానా ముర్రా గేదెలని పాడి రైతులు చెప్పేమాట. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. ఆ జాబితాలో ‘ఆంధ్రా ముర్రా’ గేదెలు కూడా చేరిపోయాయి. హర్యానా ముర్రా గేదెలు దక్షిణాది రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక ఆశించిన స్థాయిలో పాల దిగుబడి ఇచ్చేవి కాదు. దీనివల్ల వాటిని పెంచే రైతులకు తగిన ఫలితం దక్కేది కాదు. ఈ పరిస్థితుల్లో ఇక్కడి వాతావరణాన్ని తట్టుకునేలా ముర్రా జాతి గేదెలను అభివృద్ధి చేయడంలో మన శాస్త్రవేత్తల కృషి ఫలించింది.

ఇప్పుడు ‘ఆంధ్రా ముర్రా’ గేదెల కోసం పొరుగు రాష్ట్రాల రైతులు కూడా ఆసక్తి చూపించే పరిస్థితి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్న గూడెంలోని గేదెల పరిశోధనా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో స్థానిక వాతావరణ పరిస్థితులను తట్టుకునే ముర్రా జాతి గేదెల పునరుత్పత్తికి బాటలు వేసింది. హర్యానాలోని కేంద్రీయ గేదెల పరిశోధనా కేంద్రం నుంచి వెయ్యి డోసుల ముర్రా జాతి గేదెల ఘనీకృత వీర్యాన్ని తీసుకొచ్చి ఇక్కడి రైతులకు సరఫరా చేయడం ద్వారా.. ముర్రా జాతిని మన ప్రాంత వాతావరణాన్ని తట్టుకునేలా తీర్చిదిద్దారు. మన రాష్ట్రంలోని నాటు గేదెలకు ముర్రా జాతి వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేసి గ్రేడెడ్‌ ముర్రా గేదెల పేరిట ఆంధ్రా ముర్రా జాతిని అభివృద్ధి చేశారు. 

మారుమూల గ్రామాల్లోనూ..
పరిశోధన స్థానం అభివృద్ధి చేసిన ఆంధ్రా ముర్రా జాతి గేదెలను మారుమూల పల్లెలకూ విస్తరించేలా వెంకట్రామన్నగూడెం పరిశోధనా స్థానం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటి వరకు లక్ష డోసుల ఘనీకృత వీర్యాన్ని కృత్రిమ గర్భోత్పత్తి కోసం పాడి రైతులకు అందించారు. 350 దున్న దూడలను సైతం పంపిణీ చేసి కృత్రిమ గర్భోత్పత్తికి అవకాశం లేని గ్రామాల్లో గ్రేడెడ్‌ ముర్రా జాతిని మరింతగా విస్తరింపచేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో 62.19 లక్షల పాడి గేదెల సంతతి ఉంటే.. వాటిలో 30 లక్షలకు పైగా ముర్రా జాతి గేదెలున్నాయి. వాటిలో 25–30 శాతం గేదెలు వెంకట్రామన్నగూడెం పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసిన గ్రేడెడ్‌ ముర్రా జాతికి చెందినవే కావడం గమనార్హం. వీటికి ఆంధ్రాలోనే కాకుండా తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ డిమాండ్‌ పెరుగుతోంది.

కావాల్సిన సమయానికి ఎదకు రప్పించేలా..
గ్రేడెడ్‌ ముర్రా జాతిని మరింత అభివృద్ధి చేసేలా చేపట్టిన పరిశోధనలు సత్ఫలితాలిస్తున్నాయి. ఇన్‌ బ్రీడింగ్‌కు అడ్డుకట్ట వేస్తూ.. ఓపెన్‌ న్యూక్లియస్‌ బ్రీడింగ్‌ సిస్టం ద్వారా మేలుజాతి గేదెలను అభివృద్ధి చేస్తున్నారు. గేదెలను కావాల్సిన సమయంలో ఎదకు రప్పించేలా ఈస్ట్రస్‌ సింక్రొనైజేషన్‌ పద్ధతితో పాటు గర్భవాతం నివారించేందుకు రోగ నిరోధక శక్తిని పెంచే పద్ధతులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈనిన 45–65 రోజుల్లోనే తిరిగి ఎదకు వచ్చేలా ఈ గేదెలను అభివృద్ధి చేశారు. చూడి శాతాన్ని 42 నుంచి 65 శాతానికి పెంచగలిగారు. గేదెల్లో గొడ్డుమోతు తనం నివారణకువివిధ హార్మోన్‌ చికిత్సా విధానాలను అందుబాటులోకి తెచ్చారు.

మన వాతావరణ ప్రభావాన్ని తట్టుకునేలా తీర్చిదిద్దడంతో ఏడాది పొడవునా గేదెల ఉత్పత్తి, పునరుత్పత్తి సామర్థ్యాలను పెంచగలిగారు. అత్యధిక పోషక విలువలు కలిగిన 15 రకాల బహువార్షిక గడ్డి రకాలను అభివృద్ధి చేశారు. ఇక్కడ అభివృద్ధి చేసిన సూపర్‌ నేపియర్‌ పశు గ్రాసానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. వీటిని తెలుగు రాష్ట్రాలతో పాటు అండమాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల రైతులు తీసుకెళ్లి సాగుచేస్తూ అధిక పాల దిగుబడులను సాధిస్తున్నారు.

చదవండి: పారిశ్రామికవేత్తలుగా పొదుపు మహిళలు 

‘దున్న యువరాజ్‌’ జాతి అభివృద్ధిపైనా దృష్టి
దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన యువరాజ్‌ జాతికి చెందిన దున్నల పునరుత్పత్తిపై పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ప్రత్యేక దృష్టి సారించారు. యువరాజ్‌ దున్నలకు చెందిన ఘనీభవించిన వెయ్యి డోసుల వీర్యాన్ని తీసుకొచ్చి గోదావరి జిల్లాల పాడి రైతులకు అందించారు. అభ్యుదయ పాడి రైతుల వద్ద గల గేదెలకు యువరాజ్‌ దున్న వీర్యంతో కృత్రిమ గర్భోత్పత్తి చేస్తున్నారు. మరోవైపు దాణా ధరలు విపరీతంగా పెరగటంతో కొత్తగా అభివృద్ధి చేసిన షియా మీల్‌ (షియా కేక్‌)ను తవుడుకు ప్రత్యామ్నాయంగా అందుబాటులోకితెచ్చారు. దీన్ని దాణాలో 20% వరకూ కలుపుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గ్రేడెడ్‌  దూడలతో జీవనోపాధి
నేను దేశవాళీ గేదెల్ని పెంచేవాణ్ణి. వెంకట్రామన్నగూడెం పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసిన ముర్రా జాతి వీర్యాన్ని తీసుకొచ్చి మా గేదెలకు కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా చూలు కట్టించి గ్రేడెడ్‌ ముర్రాజాతి దూడలను అభివృద్ధి చేసి అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నాను. ప్రస్తుతం నా ఆర్థిక పరిస్థితి బాగుంది. నా ఫారంలో ఉన్న గేదెలకు ఏ అనారోగ్య సమస్యలు ఎదురు కావడం లేదు. సకాలంలో ఎదకు వస్తున్నాయి.
– నూనె శ్రీను, వెంకట్రామన్నగూడెం 

త్వరలో నానో టెక్నాలజీ ద్వారా పరిశోధనలు
మేలు జాతి పాడి పశువుల సంతతి అభివృద్ధి కోసం చేస్తున్న పరిశోధనలు సత్ఫలితాలిస్తున్నాయి. రాష్ట్రంలోని ముర్రా జాతి పశువుల్లో 25–30 శాతం మన కేంద్రం అభివృద్ధి చేసినవే. ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేథ), నానో టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మేలు జాతి గేదెల ఉత్పత్తి, పునరుత్పత్తి సామర్థ్యం పెంపుపై త్వరలో పరిశోధనలు చేయబోతున్నాం. ఈ మేరకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపించాం.
– ప్రొఫెసర్‌ కె.సర్జన్‌రెడ్డి, రీసెర్చ్‌ డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement