
సాక్షి, అమరావతి: పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రాంతాల వారీగా పర్యాటక పండుగలు (టూరిజం ఫెస్టివల్స్) నిర్వహించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సూచించారు. ఆయన మంగళవారం సచివాలయంలో పర్యాటకశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరిత హోటళ్లలో నూరుశాతం ఆక్యుపెన్సీ సాధించేలా అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. నిత్యం హరిత హోటళ్లు, రిసార్ట్‌లను పర్యవేక్షిస్తూ నెలరోజుల్లో మెరుగైన సౌకర్యాలతో తీర్చిదిద్దాలని ఆదేశించారు. కొత్త సంవత్సరంలో టూరిజం యాప్‌ను అందుబాటులోకి తేవాలన్నారు. ప్రైవేట్ ఆపరేటర్లతో చర్చించి బోటింగ్ సేవలను ప్రారంభించాలని చెప్పారు.
సీఎం కప్ టోర్నీకి అపూర్వ స్పందన
అనంతరం క్రీడాశాఖాధికారుల సమీక్షలో మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ సీఎం కప్ టోర్నీకి అపూర్వ స్పందన వస్తోందని చెప్పారు. వచ్చేనెల 6వ తేదీన విజయనగరం, అనంతరం పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా టోర్నీ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తెనాలి, బాపట్లలోని క్రీడా వికాసకేంద్రాలను నవంబర్ 1వ తేదీన ప్రారంభించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ, ఆంధ్రప్రదేశ్ పర్యాటకసంస్థ సీఈవో సత్యనారాయణ, సాంస్కృతికశాఖ సీఈవో మల్లిఖార్జున, క్రీడాప్రాధికార సంస్థ ఎండీ ఎన్.ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment