సాక్షి, అమరావతి: ఆర్బీకే స్థాయిలో వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన ఆర్థిక చేయూతనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని నాబార్డు చైర్మన్ చింతల గోవిందరాజులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో దాదాపు రెండు వేల సహకార సొసైటీల పరిధిలో గోదాములు, కోల్డ్ స్టోరేజ్‌లు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున రుణాలు అందిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ తీసుకురావడం చాలా ముఖ్యమని, ఆ దిశగా ఆర్బీకే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కస్టమ్ హైరింగ్ సెంటర్స్‌ను తీసుకు రావడం శుభపరిణామం అని చెప్పారు. సహకార రుణ పరపతి పునర్ వ్యవస్థీకరణపై ఆప్కాబ్, డీసీసీబీ చైర్‌పర్సన్లతో విజయవాడలో బుధవారం జరిగిన సమీక్షలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సహకార బ్యాంకుల బలోపేతానికి షేర్ క్యాపిటల్ కావాలంటే ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. ఎంత కావాలంటే అంత సర్దుబాటు చేసేందుకు నాబార్డు సిద్ధంగా ఉందన్నారు. సిబ్బందిలో నైపుణ్యాభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర కో ఆపరేటివ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సంస్థ ద్వారా నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా పదోన్నతులు కల్పిస్తే సహకార బ్యాంకులు ప్రొఫెషనల్‌గా తయారవుతాయని సూచించారు. పెసలు, మినుములు పండించే రైతుకు కిలో రూ.60 వస్తుంటే, ప్రాసెస్ చేసి మార్కెట్‌లో రూ.200కు పైగా అమ్ముతున్నారని చెప్పారు.
ఆ వ్యత్యాసం రైతులకు చేరాలంటే వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి వాల్యూఎడిషన్ చేయడం అవసరమన్నారు. ఇటీవల జరిగిన అధ్యయనం ప్రకారం వాల్యూ చైన్ ఫైనాన్స్ దేశ వ్యాప్తంగా రూ.లక్ష కోట్లు జరుగుతుంటే, మనమిచ్చేది రూ.వెయ్యి కోట్లు మాత్రమేనన్నారు. డ్వాక్రా సంఘాలకు రూ.58 వేల కోట్లు ఇవ్వగా, దాంట్లో రూ.22 వేల కోట్లు ఏపీ, తెలంగాణాలోనే ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సున్నా వడ్డీ పథకం 100% రీ పేమెంట్ జరుగుతోందన్నారు. అదే రీతిలో కౌలు రైతులను జాయింట్ లయబులిటి గ్రూప్స్ (జేఎల్‌జీ)గా ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వొచ్చన్నారు.
డీసీసీబీల వర్గీకరణపై అధ్యయనం
గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన రూ.1000 కోట్ల పావలా వడ్డీ బకాయిల్లో రూ.600 కోట్లు విడుదల చేసి, సహకార బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచిందని మంత్రి కన్నబాబు తెలిపారు. ఆప్కాబ్‌కు రూ.100 కోట్లు, డీసీసీబీలకు రూ.190 కోట్లు షేర్ క్యాపిటల్ రూపంలో ఇచ్చేందుకు సీఎం జగన్ అంగీకరించారన్నారు. 3–5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ప్రతి ఉద్యోగిని బదిలీ చేసే విధంగా రూపొందించిన హెచ్‌ఆర్ పాలసీని త్వరలో అమలు చేయబోతున్నామని స్పష్టం చేశారు. ఆర్బీకే–పీఏసీఎస్‌లను అనుసంధానించే విషయంలో అధ్యయనం చేసేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు.
కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో డీసీసీబీలను ఇప్పటికిప్పుడు వర్గీకరించాలా.. లేదా అనే అంశం పై అధ్యయనం జరుగుతోందన్నారు. వయబిలిటీ లేకుండా వర్గీకరిస్తే లేనిపోని ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. గ్రామాల్లో పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు త్వరలో ఓ పాలసీని తీసుకొస్తున్నామని తెలిపారు. మండలానికో బ్రాంచ్ ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంన్నారు. ఈ సమావేశంలో సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వై.మధుసూదనరెడ్డి, కో ఆపరేటివ్ రిజిస్ట్రార్ అహ్మద్ బాబు, ఆప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు.
ఆర్బీకేలకు నాబార్డు చేయూత
Published Thu, Mar 3 2022 4:23 AM | Last Updated on Thu, Mar 3 2022 9:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment