కడప ఎడ్యుకేషన్: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చేందుకు మన బడి నాడు– నేడు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాడు– నేడు కింద దశల వారీగా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నారు. తొలివిడతలో రూ. 270 కోట్లు వెచ్చించి 1000 పాఠశాలలను అభివృద్ధి చేశారు. అలాగే రెండవ విడత మరో అడుగు ముందుకేసి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలతోపాటు అంగన్‌వాడీ, జూనియర్ కళాశాలలను కలుపుకుని మొత్తం 1008 సంస్థల్లో నాడు– నేడుతో పాటు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను చేపట్టారు. ఇందుకు ప్రభుత్వం రూ. 301.81 కోట్ల నిధులను కేటాయించింది. ఇప్పటి వరకు పలు రకాల అభివృద్ధి పనుల కోసం రూ. 37.73 కోట్లు ఖర్చు చేశారు. నాడు– నేడు పనుల నిర్వహణలో రాష్ట్రంలో వైఎస్సార్ జిల్లా రెండవ స్థానంలో ఉంది. ఈ పనులను మార్చి చివరి నాటికి పూర్తి చేసే విధంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు.
అంగన్‌వాడీ, జూనియర్ కళాశాలల్లోనూ..
మొన్నటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేపట్టిన నాడు నేడు పనులను రెండవ విడతలో మరో అడుగు ముందుకేసి అంగన్‌వాడీ కేంద్రాలు, జూనియర్ కళాశాలల్లో కూడా చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీకేంద్రాలు, జూనియర్ కళాశాలలకు సంబంధింది రూ.301.81 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో 87 అంగన్‌వాడీ కేంద్రాలలో అధనపు తరగతి గదులతోపాటు నాడు నేడు పనుల కోసం రూ. 1392 లక్షలను మంజూరు చేశారు. ఇప్పటి వరకు రూ.71.78 లక్షలు ఖర్చు చేశారు.
అలాగే 635 ప్రాథమిక పాఠశాలల్లో నాడు– నేడు పనులతోపాటు 135 అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం రూ.9187 లక్షలు కేటాయించారు. ఇప్పటి వరకు రూ.1384.51 లక్షలు ఖర్చు చేశారు. అలాగే 82 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 44 అదనపు తరగతి గదులతోపాటు నాడు నేడు పనులకు రూ.1480 లక్షలు కేటాయించగా ఇప్పటి వరకు రూ.243 లక్షలు ఖర్చు చేశారు. అలాగే 195 హైస్కూల్స్‌కు 794 అదనపు తరగతి గదులతోపాటు నాడు నేడు పనులకు సంబంధించి రూ.17410 లక్షలు మంజూరు చేయగా ఇప్పటి వరకు రూ. 2030.68 లక్షల ఖర్చుచేశారు. 9 జూనియర్ కళాశాలలకు నాడు నేడు పనులకు రూ.712.50 లక్షలు కేటాయించగా రూ.43.56 లక్షలు ఖర్చు చేశారు.
15 మందితో మానిటరింగ్ కమిటీ: ప్రభుత్వ పాఠశాలలతోపాటు అంగన్‌వాడీ, జూనియర్ కళాశాలల్లో చేపట్టిన నాడు– నేడు రెండవ విడత అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా 15 మంది సిబ్బందితో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి మానిటరింగ్ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఈ కమిటీ ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించడంతోపాటు ఎక్కడైనా సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నాయా అనే విషయాలను తెలుసుకుంటుంది. అలా ఏవైనా సమస్యలుంటే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారు. నాడు– నేడు పనుల్లో మన జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు.
పనులు పారదర్శకంగా చేపట్టాలి
జిల్లా వ్యాప్తంగా రెండవ విడత ఎంపిక చేసిన పాఠశాలలతోపాటు అంగన్‌వాడీ, జూనియర్ కళాశాలల్లో నాడు– నేడు రెండవ విడత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ పనులను పారదర్శకంగా చేపట్టేలా అన్ని చర్యలు తీసుకున్నాం. ఎక్కడా ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా తల్లిదండ్రుల కమిటీలు, ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షిస్తారు. నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేయాలి.
– అంబవరం ప్రభాకర్‌రెడ్డి, సమగ్రశిక్ష జిల్లా పథక అధికారి
Comments
Please login to add a commentAdd a comment