నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌కు సభ్యత్వంపై విమర్శల వెల్లువ
అతనిపై ఎనిమిది క్రిమినల్ కేసులు.. పైగా పోలీసులపై దాడి కేసు కూడా..
సీఎం చంద్రబాబు తీరును తప్పుపడుతున్న హిందూ ధార్మిక సంఘాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ నియామకంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వివాదాస్పద వ్యక్తులు, రౌడీషీటర్లను బోర్డులో నియమించారని హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌పై ఓర్వకల్లు పోలీసుస్టేషన్లోనే ఎనిమిది క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
ఎస్సీ, ఎస్టీలపై దాడులు, పవిత్ర పుణ్యక్షేత్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో అశ్లీలమైన రికార్డింగ్ డ్యాన్స్‌లు నిర్వహించడం, మైనార్టీలపై దాడులకు తెగబడటం.. ఇలా నిత్యం వివాదాలు, అరాచకాలతో ఎదిగిన మల్లెల రాజశేఖర్‌ను అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గంలో సభ్యునిగా నియమిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం దౌర్భాగ్యమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాలోని టీడీపీ నేతలు, కార్యకర్తలూ తప్పుబడుతున్నారు. వాస్తవానికి.. రాజశేఖర్ వరుసగా నేరాలకు పాల్పడుతున్నారని, అతని వైఖరిలో మార్పులేనందున అతనిపై రౌడీషీటు తెరవాలని ఓర్వకల్లు ఎస్‌ఐ డీఎస్పీకి సిఫార్సు చేశారు. దీంతో గత ప్రభుత్వంలో రౌడీషీట్ ఓపెన్ చేశారు.
మల్లెల రాజశేఖర్‌పై ఉన్న ముఖ్యమైన కేసులు..
1 హుస్సేనాపురంలో ప్రత్యర్థి పార్టీ నేతలపై కర్రలు, రాళ్లతో పాటు మారణాయుధాలతో దాడిచేశారు. దీంతో ఓర్వకల్లు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
2 హుస్సేనాపురంలోనే గడివేముల బస్టాండ్ సమీపంలో 15–3–2014న రాళ్లు, కట్టెలతో కొందరిపై దాడిచేసి చంపేందుకు తెగబడ్డారు.
3 2019 మార్చి 4వ తేది మహాశివరాత్రి అర్థరాత్రి సమయంలో అశ్లీల రికార్డింగ్ డ్యాన్సుల విషయంలో పోలీసులపై దాడికి పాల్పడ్డారు.
4 2019 సార్వత్రిక ఎన్నికల వేళ మల్లెల రాజశేఖర్, అతని అనుచరులు స్థానిక సమస్యలను లేవనెత్తిన దళితుల ముఖంపై దాడిచేసి,
కులం పేరుతో దూషించారు. దీంతో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది.
5 గత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో మల్లెల రాజశేఖర్, ఆయన అనుచరులు ఓ వర్గానికి చెందిన వ్యక్తులపై దాడిచేసి కాళ్లు, చేతులు విరిగేలా కొట్టారు. దీంతో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
బ్రాహ్మణులకు చోటులేకపోవడం అన్యాయం
మల్లెల రాజశేఖర్‌పై మాత్రమే కాదు.. టీటీడీ బోర్డులోని సభ్యులలో చాలామందికి నేరచరిత్ర ఉంది. ప్రతీ ఆలయంలో ఇద్దరు బ్రాహ్మణులను బోర్డులో నియమిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, టీటీడీ బోర్డులో ఒక్క బ్రాహ్మణుడు లేకపోవడం అన్యాయం. ఇది బ్రాహ్మణులను కించపరచడమే. నేరస్తులను బోర్డులో నియమించడం హిందువులను అవమానించడమే. – మనోహర్‌రావు, బ్రాహ్మణ సంఘం నాయకులు
Comments
Please login to add a commentAdd a comment