
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మార్చి 10న జరగనున్న పురపాలక ఎన్నికల్లో 90,61,806 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో 2,794 డివిజన్లు, వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 12 నగరపాలక సంస్థల్లో 671 డివిజన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 2,123 వార్డులు ఉన్నాయి. పురపాలక ఎన్నికల ఓటర్ల జాబితాలను పురపాలకశాఖ ఖరారు చేసింది. ఓటర్లలో పురుషులు కంటే మహిళలే అధికంగా ఉన్నారు. నగరపాలక సంస్థల్లో విశాఖపట్నంలోను, పురపాలకసంఘాల్లో నంద్యాలలోను ఎక్కువమంది ఓటర్లున్నారు.
► మొత్తం ఓటర్లు 90,61,806 మంది. వీరిలో పురుషులు 44,59,064 మంది, మహిళలు 46,01269 మంది. ఇతరులు 1,473 మంది.
► 12 నగరపాలికల్లో ఓటర్ల సంఖ్య 52,52,355. వీరిలో పురుషులు 25,97,852 మంది, మహిళలు 26,53,762 మంది, ఇతరులు 741 మంది.
► 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఓటర్ల సంఖ్య 38,09,451. వీరిలో పురుషులు 18,61,212 మంది, మహిళలు 19,47,507 మంది, ఇతరులు 732 మంది.
► నగరపాలక సంస్థల్లో మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) విస్తీర్ణంలోను, ఓటర్ల సంఖ్యలోను మొదటి స్థానంలో ఉంది. 98 డివిజన్లున్న జీవీఎంసీలో ఓటర్ల సంఖ్య 17,52,927. వీరిలో పురుషులు 8,80,481 మంది, మహిళలు 8,72,320 మంది, ఇతరులు 126 మంది.
► మచిలీపట్నం నగరపాలక సంస్థలో తక్కువ మంది ఓటర్లున్నారు. 50 డివిజన్లు ఉన్న ఈ నగరపాలక సంస్థలో ఓటర్ల సంఖ్య 1,31,829. వీరిలో పురుషులు 63,883 మంది, మహిళలు 67,936 మంది, ఇతరులు 10 మంది.
► ఓటర్ల సంఖ్యలో కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం మొదటి స్థానంలో ఉంది. 42 వార్డులున్న నంద్యాలలో ఓటర్ల సంఖ్య 1,86,310. వీరిలో పురుషులు 90,597 మంది, మహిళలు 95,640 మంది, ఇతరులు 73 మంది.
► గూడూరు నగర పంచాయతీ చివర్లో ఉంది. 20 వార్డులున్న ఈ నగర పంచాయతీలో ఓటర్ల సంఖ్య 15,789 మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment