పులి జాడ విశాఖ వనాల్లో కనిపించలేదు. పులుల మనుగడని కనిపెట్టేందుకు నిర్వహించిన వన్యప్రాణుల గణనలో ఈ విషయం స్పష్టమైంది. అయితే పలు అటవీ ప్రాంతాల్లో చిరుతపులులు సంచరించినట్లు కెమెరాల్లో నిక్షిప్తమైంది. ఉమ్మడి విశాఖ అభయారణ్యాల్లో ఏఏ జంతువులు ఎంత మేర ఉన్నాయనే లెక్క తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తం ఫుటేజీని శ్రీశైలంలోని బయోలాజికల్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు పంపించారు. అక్కడి నుంచి వచ్చే తుది నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.
సాక్షి, విశాఖపట్నం: జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ దేశవ్యాప్తంగా టైగర్ సెన్సస్ నిర్వహించింది. ఇందులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో అటవీ శాఖ అధికారులు నెల రోజులపాటు వన్యప్రాణుల గణనలో పాల్గొన్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకూ సేకరించిన సీసీ ఫుటేజీ వివరాలను శ్రీశైలంలోని బయోలాజికల్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు పంపించారు.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అడవుల్లో 40 పాయింట్లను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మొత్తం 80 అత్యా«ధునిక కెమెరాలు అమర్చారు. పులులతో పాటు చిరుతపులులు, ఇతర జంతువుల కదలికల్ని గణించేందుకు కెమెరాలు పెట్టారు. పగటిపూట, రాత్రి సమయంలోనూ స్పష్టంగా క్యాప్చర్ చేసే ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ ఉన్న కెమెరాలను వినియోగించారు. వన్యప్రాణులు సంచరించే ప్రదేశాల్లో ఎదురెదురుగా ఉన్న చెట్లకు అమర్చారు. ఇవన్నీ 24 గంటలూ వాటంతట అవే పనిచేస్తాయి. చీకట్లో అయితే ఫ్లాష్ ఉపయోగించుకుంటాయి. జంతువులు కదలికలు, ఉష్ణోగ్రతల ఆధారంగా కెమెరాలు సమాచారాన్ని నిక్షిప్తం చేసుకున్నాయి.
పలు ప్రాంతాల్లో చిరుతలున్నాయి
వన్యప్రాణులు, పులుల గణనలో కంబాలకొండతో పాటు నర్సీపట్నం, అరకు, పాడేరు అటవీ ప్రాంతాల్లో విభిన్న రకాలైన జంతుజాలాన్ని గుర్తించారు. ఎక్కడా పులుల ఆనవాళ్లు కనిపించలేదుగానీ.. పలు అటవీ ప్రాంతాల్లో చిరుతపులులు సంచరించినట్లు కెమెరాల్లో నిక్షిప్తమైంది. వీటితో పాటు కంబాలకొండ, ఇతర అటవీ ప్రాంతాల్లో చుక్కలదుప్పి, తోడేళ్లు, సాంబార్, నీల్‌గాయి, అడవిపందులు, కుందేళ్లు, కృష్ణజింకలు, కొండగొర్రెతో పాటు విభిన్న రకాల జంతువులున్నాయని ప్రాథమికంగా గుర్తించారు.
వీటితో పాటు ప్లమ్ హెడెడ్ పారాకీట్ (గుండు రామచిలుక), వైట్ బెల్లీడ్ సీ ఈగల్ (సముద్రపు గద్ద), ఆరెంజ్ బ్రెస్టెడ్ గ్రీన్ పీజియన్ (పచ్చగువ్వ), బ్రౌన్ ఫిష్ ఔల్ (జీలుగు, గోధుమ చేప గుడ్లగూబలు), పెయింటెడ్ స్పర్ఫ్ ఔల్స్ (తొగరుకోళ్లు)తోపాటు నైట్ జార్‌లు, పిచ్చుకలు తదితర జీవజాలం ఉన్నట్లు సర్వేలో స్పష్టమైంది.
Comments
Please login to add a commentAdd a comment