సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిని అభివృద్ధి చెందిన దేశాల ప్రజల స్థాయికి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ భారీ కార్యాచరణను సిద్ధం చేసింది. ఐక్యరాజ్య సమితి (ఐరాస) నిర్దేశించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నవరత్న కార్యక్రమాలతో పాటు ఇతర మేనిఫెస్టో అంశాలను రూపొందించి అమలు చేస్తోంది.
ఈ 17 లక్ష్యాలు, వాటికి అనుగుణంగా 487 రకాల ప్రజల జీవన ప్రమాణాల అంచనా అంశాలపై గ్రామ స్థాయి వరకు ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు, తద్వారా ప్రభుత్వ పథకాలను అట్టడుగు స్థాయికి తీసుకువెళ్లి, పేదల జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రస్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఏపీఎస్‌ఐఆర్‌డీ) ద్వారా ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే ఏడాది సెప్టెంబరు 16 వరకు మొత్తం 81 అంశాలపై ఈ శిక్షణ ఇస్తారు.
సుస్థిర అభివృద్ధి్ద లక్ష్యాలకు నవరత్నాల అనుసంధానం
ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో పేర్కొన్న విధంగా ప్రతి వ్యక్తి రోజుకు కనీసం 1.25 యూఎస్ డాలర్లు ఖర్చు చేసే స్థాయిలో ఉంచడం, పురుషులతో సమానంగా మహిళలూ ఆర్థిక స్వాతంత్య్రం కలిగి ఉండడం, అందరికీ విద్య వంటి లక్ష్యాల సాధనకు ఒక్కొక్క లక్ష్యానికి వాటితో లింకు ఉన్న నవరత్న కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం చేస్తోంది.
బడి వయసు పిల్లలందరూ పాఠశాలకు వచ్చేలా అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టింది. పురుషులతో సమానంగా మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడంతో పాటు ఆయా కుటుంబాలను పేదరికానికి దూరం చేసేందుకు వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత వంటి పథకాలను అమలుచేస్తోంది. ఇలా మొత్తం నవరత్నాల కార్యక్రమాలు ఒక్కొక్క సుస్థిర అభివృద్ధి్ద లక్ష్యాల సాధనలో భాగంగా చేసింది. నవరత్న కార్యక్రమాల ద్వారా గత 34 నెలల్లో రూ. 1.34 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) రూపంలోనే పేదలకు అందించింది.
పనితీరే కొలమానం..
ఐక్యరాజ్యసమితి ప్రమాణాలకు అనుగుణంగా శాఖలవారీగా ఐఏఎస్ అధికారుల పనితీరుకు సైతం ప్రభుత్వం గ్రేడ్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. శాఖల్లో చేపట్టిన కార్యక్రమాల ఆధారంగా వారి పనితీరు అంచనా వేస్తోంది. సీఎం, సీఎస్‌లు వీరి పనితీరును సమీక్షిస్తారని అధికారులు తెలిపారు.
ప్రతి దాంట్లో ఓ మార్పునకు సంకేతంగా సీఎం నిర్ణయాలు
రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక అంశాల్లో ప్రతి దాంట్లో ఓ బలమైన మార్పు తెచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. నవరత్న కార్యక్రమాలు అందులో భాగమే. చదువుకునేందుకు ఎక్కువ మంది పిల్లలను పాఠశాలకు రప్పించడం కోసం లమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలుచేస్తోంది. అది కూడా సుస్థిర అభివృద్ది లక్ష్యాల్లో ఒకటి. నాడు– నేడుతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై అవగాహన పెంచడానికి ప్రభుత్వం ఆన్‌లైన్ శిక్షణ ఇస్తోంది.
– జె.మురళి, ఏపీఎస్‌ఐఆర్‌డీ, డైరెక్టర్
17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు
- పేదరిక నిర్మూలన ప్రధాన అంశం. ప్రతి వ్యక్తి రోజుకు 1.25 డాలర్లు అంటే మన కరెన్సీలో కనీసం రూ. 95 తన కోసం ఖర్చు పెట్టుకోవడం. ఆ స్థాయిలో కూడా ఖర్చు పెట్టలేని వ్యక్తుల కుటుంబాన్ని బీపీఎల్ కుటుంబంగా పేర్కొంటారు. అందరికీ ఆహారం మరో ప్రధాన అంశం. ఐదేళ్ల లోపు పిల్లలు ఉండే బరువు వంటివి దీనికి కొలమానం.
- మంచి ఆరోగ్యం, సంతోషకరమైన మానసిక స్థితి
- నాణ్యమైన విద్య
- పురుషులు,
- మహిళల సమానత్వం
- తాగడానికి పరిశుభ్రమైన నీరు,
- పరిశుభ్ర వాతావరణం
- విద్యుత్ సౌకర్యం
- మౌలిక వసతుల కల్పన
- ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక పురోగతి
- అసమానతలు తొలగింపు
- పట్టణీకరణ
- ప్రజలలో కొనుగోలు శక్తి,
- ఉత్పత్తి అవకాశాలు
- పర్యావరణ పరిరక్షణ
- మత్స్య సంపద
- పర్యావరణ పరిరక్షణ
- భూ పరిరక్షణ
- శాంతి. న్యాయం, బలమైన వ్యవస్థలు
- లక్ష్యాల సాధనకు
- వివిధ సంస్థలతో ఒప్పందాలు
Comments
Please login to add a commentAdd a comment