ఎన్‌ఈపీ సారథులు ఏపీ విద్యార్థులు | NEP captains are AP students | Sakshi
Sakshi News home page

ఎన్‌ఈపీ సారథులు ఏపీ విద్యార్థులు

Published Fri, Sep 29 2023 3:09 AM | Last Updated on Fri, Sep 29 2023 3:09 AM

NEP captains are AP students - Sakshi

సాక్షి, అమరావతి: నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ (ఎన్‌ఈపీ)–2020 అమలులో విద్యార్థులను భాగస్వామ్యం చేసే లక్ష్యంతో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఇటీవల ‘ఎన్‌ఈపీ సారథి’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం అమలు కోసం ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులను ఎంపిక చేసింది. తాజాగా వారి జాబితాను ప్రకటించింది. ఎన్‌ఈపీ సారథులుగా ఎంపికైన వీరిని ఎన్‌ఈపీ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, యూనివర్సిటీలు, వివిధ ఉన్నత విద్యాసంస్థలకు చెందిన వైస్‌చాన్స్‌లర్‌లు, డైరెక్టర్లు ప్రిన్సిపాళ్లు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు.

ఇప్పుడు ఆయా విద్యాసంస్థల్లో విద్యార్థులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం ద్వారా ఎన్‌ఈపీ లక్ష్యాలను మరింత సులభంగా సాధించగలుగుతామని యూజీసీ భావిస్తోంది. మన రాష్ట్రం నుంచి 8 కాలేజీలకు చెందిన 23 మంది విద్యార్థులకు ఈ అవకాశం దక్కింది. సర్టిఫికెట్, డిప్లొమో, యూజీ, పీజీ విద్యార్థులను ఈ కార్యక్రమానికి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఎన్‌ఈపీ లక్ష్యాల సాధనలో విద్యార్థులను నిమగ్నం చేయడం, ఉన్నత విద్యారంగంలో సంస్కరణలపై విద్యార్థుల్లో అవగాహన పెంచడం లక్ష్యంగా యూజీసీ దీనికి శ్రీకారం చుట్టింది.

విద్యా సంస్కరణలు విజయవంతంగా అమలు కావడానికి విద్యార్థుల ప్రమేయం, వారిలో నిబద్ధత చాలా ముఖ్యమైనవని, అప్పుడే ఇది విజయ వంతం అవుతుందని యూజీసీ అభిప్రాయ పడుతోంది. ఈవెంట్లు, డిబేట్లు, పోటీలు, క్విజ్‌లు వంటి కార్యక్రమాలను కాలేజీల్లో  నిర్వహించేలా కార్యక్రమాలు రూపొందించింది. అలాగే సోషల్‌ మీడియా ద్వారా ఎన్‌ఈపీపై ప్రచారం చేయడం, కాలేజీల్లో ఎన్‌ఈపీ  హెల్ప్‌ డెసు్కల ఏర్పాటు తదితర కార్యక్రమాలు చేపట్టనున్నారు.  

ప్రతిభగల విద్యార్థుల ఎంపిక 
ఎన్‌ఈపీ అంబాసిడర్‌గా యూనివర్సిటీలు, విద్యాసంస్థలు తమ సంస్థల్లో అత్యుత్తమ వ్యక్తిత్వ లక్షణాలు, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, సామర్థ్యాలు, సృజనాత్మకత, బాధ్యతాయుత ప్రవర్తన, నాయకత్వ పటిమ ఉన్న ముగ్గురు విద్యార్థులను నామినేట్‌ చేశాయి. వారి నుంచి యూజీసీ అర్హులైన వారిని ఎంపిక చేసి ఎన్‌ఈపీ అంబాసిడర్లుగా ప్రకటించింది. వీరి విధుల్లో ఎన్‌ఈపీ– 2020 కార్యక్రమాలపై ఇతర విద్యార్థులకు అవగాహన పెంచడం, క్రియాశీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం ప్రధానమైనవి.

అంతేగాక ఈ కార్యక్రమం అమలుపై యూజీసీకి ఫీడ్‌బ్యాక్‌ను అందించాలి. అంబాసిడర్‌గా ఎంపికైన వారికి యూజీసీ గుర్తింపు సర్టిఫికెట్‌ ఇస్తుంది. ఈ సర్టిఫికెట్‌తో వారికి ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. సర్టిఫికెట్‌తో పాటు యూజీసీ ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌లు, ఇతర అవకాశాలను కూడా వారు పొందుతారు. అలాగే ఈ అనుభవం వారికి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విద్యాకోర్సుల అభ్యాసానికి సహకరిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement