టెన్త్‌ తర్వాత ఎలా? | New issues are emerging on admissions for further studies after Tenth Class | Sakshi
Sakshi News home page

టెన్త్‌ తర్వాత ఎలా?

Published Mon, Sep 7 2020 3:25 AM | Last Updated on Mon, Sep 7 2020 5:48 AM

New issues are emerging on admissions for further studies after Tenth Class - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా కారణంగా పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో విద్యార్థులంతా ఉత్తీర్ణులు (ఆల్‌పాస్‌) అయినట్లు విద్యాశాఖ ప్రకటించగా తదుపరి చదువులకు సంబంధించి ప్రవేశాలపై కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. పబ్లిక్‌ పరీక్షలు జరగనందున విద్యార్థులంతా ఉత్తీర్ణులైనట్లు పరిగణించి గ్రేడ్లు లేకుండా ధ్రువపత్రాలు జారీ చేశారు. దీంతో వీరికి  పై కోర్సుల్లో మెరిట్‌ ప్రాతిపదికన సీట్లు కేటాయించడం పెద్ద సమస్యగా మారింది. గ్రేడ్లు లేనందున మెరిట్‌  నిర్ణయించడం సాధ్యం కావడం లేదు. ముఖ్యంగా  రాజీవ్‌గాంధీ యూని వర్సిటీ ఆఫ్‌ నాలెడ్జి టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఐఐ ఐటీలతో పాటు ఇంటర్మీడియెట్‌ జూనియర్‌ కాలేజీలలో  ఏ ప్రాతిపదికన సీట్లు కేటాయిం చాలనే అంశంపై తర్జనభర్జన జరుగుతోంది.

 ప్రవేశ పరీక్షలు సాధ్యమేనా..?..
► టెన్త్‌ తరువాత  ఇంటర్, పాలిటెక్నిక్, ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్‌ ఐటీల్లో, సాంఘిక సంక్షేమ శాఖల పరిధిలోని జూనియర్‌ కాలేజీల్లో విద్యార్థులు చేరుతుంటారు. ఈసారి గ్రేడ్లు లేకుండా ఆల్‌పాస్‌గా ప్రకటిస్తూ జీవో జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ ట్రిపుల్‌ ఐటీలు, ఇతర కోర్సుల్లో  చేర్చుకునేందుకు ప్రవేశ పరీక్షలు లాంటివి నిర్వహించుకోవచ్చని సూచించినా ఇది ఎంతవరకు సాధ్యమన్నది ప్రశ్నార్థకంగా మారింది. 

అరకొర సిబ్బందితో పరీక్షలు ఎలా?
► టెన్త్‌లో 6 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తుంటారు. పెద్ద ఎత్తున సిబ్బంది ఉన్న పాఠశాల విద్యాశాఖకే పబ్లిక్‌ పరీక్షల నిర్వహణ సాధ్యం కానప్పుడు కేవలం నాలుగే విభాగాలున్న ( ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రీపుల్‌ ఐటీలు)  తాము అంతమందికి     ప్రవేశ పరీక్షలు ఎలా నిర్వహించగలుగుతామని ట్రిపుల్‌ ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. పైగా  ఆర్జీయూకేటీ చట్టం ప్రకారం ప్రవేశ పరీక్షలు నిర్వహించే అవకాశం లేదు. 
► గ్రామీణ పేద విద్యార్థులను దష్టిలో పెట్టుకొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆర్జీయూకేటీని ఏర్పాటు చేశారు. ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలను మెరిట్‌ ఆధారంగా రిజర్వేషన్లను అనుసరించి మండలాల వారీగా గ్రామీణ పేద విద్యార్థులకు సీట్లు కేటాయించేలా చట్టాన్ని రూపొందించారు. ఇప్పుడు ప్రవేశ పరీక్షలు నిర్వహించాలంటే ప్రత్యేకంగా ఆర్డినెన్స్‌ అవసరం.

అంతర్గత మార్కులతో మరో సమస్య..
► 8, 9, 10వ తరగతుల్లో అంతర్గత పరీక్షలు, ప్రాజెక్టువర్కుల ఆధారంగా టెన్త్‌ విద్యార్థులు సాధించిన మార్కులను బట్టి మెరిట్‌ను పరిశీలించి ప్రవేశాలు కల్పించాలని ఆర్జీయూకేటీ భావించింది. అయితే అంతర్గత మార్కుల విషయంలో ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది. దీంతో ఆర్జీయూకేటీ ప్రవేశాల విషయంలో ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు పంపింది. విద్యార్థుల మెరిట్‌ను నిర్ణయించేలా ప్రవేశ పరీక్ష నిర్వహించడం ఇందులో ప్రధానమైనది.

ఇంటర్‌కు మెరిట్‌ సమస్య...
► ఇంటర్మీడియెట్‌ కాలేజీలు, ఇతర రెసిడెన్సియల్‌ కాలేజీల్లోనూ విద్యార్థులకు మెరిట్‌ ప్రాతిపదికన సీట్ల కేటాయింపు సమస్యగా మారింది. అన్ని కాలేజీలలో సీట్ల కేటాయింపును పూర్తిగా మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఆన్‌లైన్‌లో కేటాయించేలా బోర్డు చర్యలు చేపట్టింది. అయితే టెన్త్‌ విద్యార్థులకు గ్రేడ్లు లేకపోవడంతో మెరిట్‌ నిర్ధారణ సమస్యగా మారింది. ఈ ¯నేపథ్యంలో కాలేజీల వారీగా విద్యార్థులు ఆప్షన్లు ఇస్తే కంప్యూటర్‌ ద్వారా ర్యాండమ్‌గా  సీట్లు కేటాయింపు చేయాలన్న యోచనలో ఉన్నట్లు బోర్డువర్గాలు వివరించాయి. 
► కొన్ని రెసిడెన్షియల్‌ కాలేజీలు లాటరీ విధానంలో సీట్ల కేటాయింపు చేయాలన్న అభిప్రాయంతో ఉన్నాయి. అయితే ర్యాండమ్‌గా కానీ, లాటరీ విధానంలో కానీ సీట్లు కేటాయింపు చేయడం వల్ల మెరిట్‌ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్న అభిప్రాయం తల్లిదండ్రులు, విద్యావేత్తలనుంచి వ్యక్తమవుతోంది.

’మా అబ్బాయి ప్రభుత్వ స్కూళ్లో చదివి పదో తరగతి పాస్‌ సర్టిఫికెట్‌ పొందాడు. టెన్త్‌ మార్కులు, గ్రేడ్లు లేకపోవడం వల్ల నవోదయ విద్యా సంస్థలో ఆన్‌లైన్‌లో చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.చివరకు హాల్‌టిక్కెట్‌ నెంబర్‌తో దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. ట్రిపుల్‌ ఐటీకి కూడా ప్రయత్నిస్తున్నాం. కానీ మెరిట్లో ఉండే మా అబ్బాయికి సీటు వస్తుందో రాదో అని ఆందోళన చెందుతున్నాం’
– గంటా మోహన్, మదనపల్లె, చిత్తూరు జిల్లా

’మాది అనంతపురం జిల్లాలోని ఓడీ చెరువు మండలం ఈ. గొల్లపల్లి గ్రామం. ప్రభుత్వ పాఠశాలలో బాగా చదివి ముందు వరుసలో ఉండే మా అబ్బాయిని ఇడుపులపాయలోని ఐఐఐటీలో చేర్చాలని కోరుకుంటున్నాం. గతంలో మార్కుల ఆధారంగా సీట్లు దక్కేవి. ఇప్పుడు ప్రవేశాలు ఎలా కల్పిస్తారో తెలియడం లేదు. కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లోప్రవేశ పరీక్ష నిర్వహిస్తే ఎలా పంపగలం?’
– రమీజా, ఈ. గొల్లపల్లి, ఓడీసీ మండలం, అనంతపురం జిల్లా.

‘ట్రిపుల్‌ ఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా పదో తరగతి చదివా. కష్టపడి చదివినా ఇతరులతో సమానంగా ప్రకటించారు. గ్రేడింగ్‌ ఇవ్వకపోవడం వల్ల సీట్లను ఎలా భర్తీ చేస్తారో అని ఆందోళనగా ఉంది. గత ఏడాదిలో జరిగిన పరీక్షల మార్కుల ఆధారంగా భర్తీచేయాలి’
– బెహరా గుణకర్‌పాత్రో, పదోతరగతి, వైఎస్‌ఆర్‌నగర్, విజయనగరం.

‘గ్రేడింగ్, మార్కులు లేకుండా పదో తరగతి ఉత్తీర్ణులైనట్లు ప్రకటించడం వల్ల మంచి కళాశాలల్లో ఉన్నత విద్య అభ్యసించే అవకాశం కోల్పోతున్నా. జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో గ్రేడింగ్‌ ప్రమాణాలకు అర్హత సాధించలేకపోతున్నాం. ట్రిబుల్‌ ఐటీ కళాశాలల సీట్లకు ప్రవేశ పరీక్ష నిర్వహించకుండా పదో తరగతి మార్కుల ఆధారంగానే భర్తీ చేయాలి’
– పిల్లా పృథ్వీరాజ్,  పదో తరగతి, బీసీకాలనీ, విజయనగరం.
  
  కేంద్ర విద్యాసంస్థల్లో ప్రవేశాలపైనా ఆందోళన...

కేంద్ర విద్యా సంస్థలైన నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలతో పాటు సీబీఎస్‌ఈ పరిధిలో 10+2 అమలు చేస్తున్న విద్యాసంస్థల్లో ఇంటర్‌ ప్రవేశాల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మార్కులు, గ్రేడ్‌లు అప్‌లోడ్‌ చేయాలని తొలుత సూచించిన నవోదయ ఆ తరువాత ఉన్నతాధికారుల జోక్యంతో చివరకు టెన్త్‌ హాల్‌టిక్కెట్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాలన్న ఆప్షన్‌ ఇచ్చింది. వెబ్‌సైట్లో మెరిట్‌ ప్రాతిపదికన కేటాయింపు అని పేర్కొని దరఖాస్తు ప్రింటవుట్‌లో మాత్రం ఎంట్రన్స్‌ టెస్టు ద్వారా కేటాయింపు అని ఉండటంతో అయోమయం నెలకొంది. 

గ్రామీణ విద్యార్థులకు నష్టం జరగకుండా ప్రవేశాలు..
’ఆర్జీయూకేటీ చట్టం ప్రకారం మెరిట్‌ ప్రాతిపదికన గ్రామీణ విద్యార్థులకు రిజర్వేషన్ల ఆధారంగా మండలాల వారీగా సీట్ల కేటాయింపు చేయాలి. లేదంటే గ్రామీణ విద్యార్థులకు నష్టం జరుగుతుంది. పాఠశాలల్లో విద్యార్థుల అంతర్గత మార్కులను పరిశీలించాం. అవి సరిగా లేనందున వాటి ఆధారంగా కేటాయిస్తే ట్రిపుల్‌ ఐటీల ఏర్పాటు లక్ష్యం దెబ్బతింటుంది. విద్యార్థులకు ఓఎమ్మార్‌ షీట్లతో ప్రవేశ పరీక్ష నిర్వహించడం తదితర సూచనలతో ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక ట్రిపుల్‌ ఐటీల్లోప్రవేశాలపై ముందుకు వెళతాం’
– ప్రొఫెసర్‌ కేసీ రెడ్డి, ఆర్జీయూకేటీ చాన్సలర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement