
హ్యాపీ న్యూ ఇయర్
గతంలో ప్రపంచమంతా మార్చి 1న కొత్త ఏడాది ప్రారంభం
పది నెలల క్యాలెండర్‌కు జనవరి, ఫిబ్రవరి చేరడంతో 12 మాసాలు
జనవరి 1న ఆంగ్ల సంవత్సరం
వేడుకలు చేసుకున్నా.. స్థానికంగా కొత్త సంవత్సరాలు జరుపుకునే ఆనవాయితీ
తెలుగు ప్రజలకు ‘ఉగాది’కే నూతన సంవత్సరం
జనవరిలో సంక్రాంతి నుంచి తమిళుల కొత్త ఏడాది సంబరం
సాక్షి, అమరావతి: ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ ప్రపంచం నినదించింది. అంబరాన్ని అంటే సంబరాన్ని తెచ్చింది. పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 2024 డిసెంబర్ 31 రాత్రి నుంచి 2025 జనవరి 1వ తేదీ ఉదయం వరకు ప్రపంచంలోని అనేక దేశాల్లో వేడుకల హోరెత్తింది. బాణసంచా వెలుగులు.. కేక్ కటింగ్‌లు.. స్వీట్స్ తినిపించుకోవడం.. పరస్పర శుభాకాంక్షలు తెలపడం వంటి నచ్చిన రీతిలో ప్రజానీకం కోటి ఆశలతో మరో ఏడాదికి ఘన స్వాగతం పలికింది.
తొలి స్వాగతం న్యూజిలాండ్‌లో..
భారత కాలమానం ప్రకారం 2024 డిసెంబర్ 31 సాయంత్రం 4.30గంటలకే న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరం నూతన సంవత్సరానికి (2025 జనవరి 1కి) ప్రపంచంలోనే ముందుగా స్వాగతం పలికింది. భారతదేశం తర్వాత ప్రపంచంలో 43 దేశాలు కొత్త ఏడాదికి ఆలస్యంగా స్వాగతం పలికితే ఆఖరున అమెరికా పరిధిలోని బేకర్, హోవార్డ్ దీవులను నూతన సంవత్సరం పలకరిస్తుంది. రష్యాలో జనవరి 1న, జనవరి 14న రెండుసార్లు నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తారు.
అదే వియత్నాం, ఇజ్రాయెల్, చైనా, సౌదీ అరేబియాలో జనవరి 1న కాకుండా స్థానిక క్యాలెండర్ ప్రకారం వేడుకలను నిర్వహిస్తారు. జనవరి 1న దాదాపు అన్ని దేశాలతోపాటు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కొత్త సంవత్సర వేడుకలు జరుపుతున్నప్పటికీ మతాలు, ప్రాంతాల వారీగా ప్రత్యేక రోజుల్లో కొత్త సంవత్సరానికి నాంది పలుకుతున్నారు.
క్రైస్తవులు జనవరి 1, 14 తేదీల్లో ప్రాంతాల వారీగా వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. చైనీస్, వియత్నామీస్, టిబెటన్స్ జనవరి నుంచి మార్చిలోపు నిర్వహిస్తున్నారు. గురునానక్ జన్మదినోత్సవమైన మార్చి 14న సిక్కులు కొత్త సంవత్సర వేడుకలు నిర్వహిస్తారు.
తెలుగునాట ఉగాది
తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ దేశాలతో పోటీపడి మరీ ఆంగ్ల సంవత్సరాన్ని ఘనంగా నిర్వహిస్తున్నప్పటికీ తెలుగు సంవత్సరాదికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వచ్చే ఉగాది రోజున తెలుగు ప్రజలు తెలుగు సంవత్సరాది వేడుకలను సంప్రదాయబద్ధంగా ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఏప్రిల్ మధ్యలో చైత్ర మాసం తొలిరోజున తమిళ సంవత్సరాది ఘనంగా జరుపుకునేవారు.
దీనికి బదులుగా రైతుల దినోత్సవమైన సంక్రాంతి(జనవరి 14)న తమిళుల సంవత్సరాదిగా పాటించాలని తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసింది. ఏప్రిల్ 14న పంజాబ్, బెంగాల్, నవంబర్, అక్టోబర్ మాసాల్లో వచ్చే పర్వదినంలో గుజరాత్ నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తుంది. దీంతోపాటు పలు రాష్ట్రాల్లోను స్థానిక పర్వదినాల్లో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకొంటున్నారు.

పూర్వం నుంచి వేడుకలు
పూర్వం నుంచీ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం పరిపాటిగా మారిందని చరిత్ర చెబుతోంది. రోమన్ ప్రజలు యుద్ధ దేవతగా భావించే ‘మార్స్’ గ్రహం పేరును మార్చి నెలకు పెట్టారు. మొదట 10 నెలలతో మాత్రమే క్యాలెండర్ సృష్టించారు. అప్పట్లో సంవత్సరంలో 310 రోజులు ఉండగా, 8 రోజులు ఒక వారంగా పరిగణించేవారు. మొదట్లో క్యాలెండర్ పది నెలలకు మాత్రమే ఉండటంతో మార్చి 1న కొత్త ఏడాది ప్రారంభంగా భావించారు.
కొన్ని దేశాల్లో మార్చి 1, మరికొన్ని దేశాల్లో మార్చి 25న, మరికొన్ని దేశాలు డిసెంబర్ 25న నూతన సంవత్సర వేడుకలు జరిపేవారు. రోమన్ పాలకుడు జూలియస్ సీజర్ ఖగోళ శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించి క్యాలెండర్‌లో మార్పులు చేశాడని చెబుతారు.
భూమి సూర్యుని చుట్టూ తిరిగేందుకు 365 రోజుల 5 గంటల 46 సెకన్ల కాలం పడుతుందని, దాన్ని ఒక ఏడాదిగా పేర్కొంటూ ఆ కాలపు ప్రముఖ మత గురువు సెయింట్ బీద్ నిర్ధారించారు. దీంతో జూలియన్ క్యాలెండర్‌లో సంవత్సరాన్ని 365 రోజులకు సవరించి జనవరి, ఫిబ్రవరి నెలలు చేర్చి 12 నెలలుగా నిర్ధారించారు. దీంతో జనవరి 1 కొత్త ఏడాదికి ప్రపంచం నాంది పలికింది.
Comments
Please login to add a commentAdd a comment