సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న స్వచ్ఛతా కార్యక్రమాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంతృప్తి వ్యక్తం చేసింది. ఘన, ద్రవ వ్యర్థాలు, మురుగు నీటి నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎన్జీటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నట్టు పేర్కొంది. రెండు రోజులుగా రాష్ట్రంలోని స్వచ్ఛతా పనులపై విచారణ చేపట్టిన ఎన్జీటీ న్యాయమూర్తులు శుక్రవారం సాయంత్రం తీర్పునిచ్చారు.
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలోని పలు పట్టణాల్లో అమలు చేస్తున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రణాళిక, అమలు తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. స్వచ్ఛతా పనుల ప్రణాళికను ఇలాగే అమలు చేయాలని, ఈ పనులకు కేటాయించిన నిధులను సమర్థంగా వినియోగించుకోవాలని జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ నాయకత్వంలోని ఎన్జీటీ సూచించింది. పర్యావరణానికి హానికరంగా పరిణమించిన వ్యర్థాలను సమర్థంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం 2016లో వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఆ తర్వాత ఫిర్యాదులు అందిన రాష్ట్రాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ తీరుతెన్నులు తమ ముందుంచాలని ఆయా రాష్ట్రాలకు ఎన్జీటీ నోటీసులు ఇచ్చింది.
అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ద్రవ వ్యర్థాల నిర్వహణలో రోజుకు మిలియన్ లీటర్లకు రూ.2 కోట్ల చొప్పున, మెట్రిక్ టన్నుకు రూ.300 వంతున జరిమానా విధించింది. ఈ మేరకు రాజస్థాన్‌కు రూ.3,000 కోట్లు, మహారాష్ట్రకు రూ.12,000 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.3,000 కోట్లు, తెలంగాణకు రూ.3,800 కోట్లు, కర్ణాటకకు రూ.2,900 కోట్ల మేర జరిమానా విధించింది. రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో ఎన్జీటీ నోటీసులు జారీ చేసినప్పటికీ.. ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ.. నిర్ణీత వ్యవధిలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశిస్తూ నోటీసులను ఉపసంహరించుకుంది.
రాష్ట్రంలో సమర్థంగా స్వచ్ఛతా పనులు..
- ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం– క్లీన్ ఆంధ్రప్రదేశ్’ (క్లాప్)ని అమలు చేస్తోంది.
- రాష్ట్రంలోని అన్ని గ్రామాలను, నగరాలను పరిశుభ్రంగా మార్చేందుకు బిన్ ఫ్రీ, లిట్టర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీగా మార్చేందుకు ప్రణాళికా బద్ధంగా ప్రభుత్వం పని చేస్తోంది. తడి, పొడి, ప్రమాదకరమైన వ్యర్థాలను వేరు చేసి, ఇంటి వద్దనే సేకరించేందుకు వీలుగా ప్రతి ఇంటికి మూడు చొప్పున 1.21 కోట్ల చెత్త డబ్బాలను పంపిణీ చేసింది.
- పొడి చెత్తను ప్రాసెస్ చేసి, దాన్నుంచి తిరిగి ఉపయోగించదగిన వస్తువులను వినియోగంలోకి తీసుకువచ్చే ప్రక్రియలను కూడా చేపట్టింది. చెత్త తరలింపునకు వీలుగా జీపీఎస్ ట్రాకింగ్‌తో కూడిన 2,737 గార్బేజ్ ఆటో టిప్పర్లు, 287 ఈ–ఆటోలు, 880 ట్రక్కులు, 480 కంపాక్టర్లను యూఎల్బీల్లో వినియోగిస్తున్నారు.
- సేకరించిన చెత్తను ప్రాసెసింగ్ ప్లాంట్లకు చేర్చే ప్రక్రియలో భాగంగా 123 మున్సిపాలిటీల్లో 138 గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల (జీటీఎస్)ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీల్లో రోజుకు 6,890 టన్నుల ఘన వ్యర్థాలను, 86 లక్షల మెట్రిక్ టన్నుల ప్రమాదకర వ్యర్థాలు, 1503 మిలియన్ లీటర్ల ద్రవ వ్యర్థాలను శుద్ధి చేస్తున్నారు.
- లక్ష కంటే తక్కువ జనాభా గల పట్టణాల్లో 91 స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ)ను ఏర్పాటు చేస్తున్నారు. మరో 71 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి. లక్ష మించి జనాభా ఉన్న పురపాలక సంఘాల్లో రూ.1,436 కోట్లతో, లక్ష లోపు జనాభా గల వాటిలో రూ.1,445 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment