సాక్షి, నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను కారణంగా జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కోట, వాకాడు, చిట్టుమూడు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్ష ప్రభావంతో రహదారులపై చెట్లు విరిగిపడటంతో పలుచోట్ల విద్యుత్ సరాఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో చెరువులన్ని నిండుకుండను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నివర్ తుఫాన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. చదవండి: తీవ్రరూపం దాల్చిన నివర్ తుఫాన్
అతి తీవ్ర తుఫానుగా మారనున్న నివర్
నైరుతి బంగాళాఖాతంలో నివర్ తుపాను ప్రభావం కొనసాగుతుంది. కడలూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 180 కిలోమీటర్లు దూరంలో పుదుచ్చేరికి 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తీవ్ర తుపానుగా కొనసాగుతున్న నివర్ మరికొన్ని గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం కనిపిస్తోంది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న తుపాను కరైకల్- మహాబలిపురం మధ్య ఈ అర్థరాత్రి లేదా రేపు ఉదయం తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాన్ ఈ అర్ధ రాత్రి లేదా రేపు తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉంది. చదవండి:నివర్ తుపాను.. అప్రమత్తంగా ఉందాం
సాక్షి, వైఎస్సార్ కడప : నివర్ తుపాను వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ఎస్పీ కార్యాలయ ఆవరణంలో ట్రయిల్ రన్ ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ఆదేశాల మేరకు 'నివర్' తుపానును ఎదుర్కొనేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో సంసిద్ధంగా మూడు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు. ప్రతి పోలీస్ సబ్ డివిజన్‌లో ఒక రెస్క్యూ బృందం ఏర్పాటు చేసినట్లు, బృందాలకు అవసరమైన అత్యవసర లైటింగ్ సామాగ్రి, లైఫ్ జాకెట్లు, టార్చ్ లైట్లు, తాళ్లను ఏఆర్ పోలీసు అధికారులు అందజేశారు. (చదవండి: తిరుమలపై ‘నివర్’ ప్రభావం)
సాక్షి, చిత్తూరు : నివర్ తుపాను ప్రభావం జిల్లాపై కూడా ఉండటంతో జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రెండు రోజులు సెలవులు ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈదురు గాలులతోపాటు బారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. దాదాపు 68 చెరువుల వద్ద అధికారులను అలెర్ట్ చేశామన్నారు. 16 సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించినట్లు, నిరాశ్రయులకు పాఠశాల భవనాలలో అసరా కల్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. అధిక వర్షపాతమున్న ప్రాంతాలలో ప్రజలు బయటకు రావద్దని సూచించారు.
నివర్ తుపాను ప్రభావం నేపథ్యంలో వరదయ్యపాలెం మండలంలో 100 మంది నిరాశ్రయులైన గిరిజనులను ముందస్తుగా గుర్తించి పునరావాస కేంద్రంలకు తరలించినట్లు తెలిపారు. నివర్ తుపానుతో రేణిగుంటలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మల్లెమడుగు రిజర్వాయర్ నిండు కుండలా తలపిస్తోంది. దీంతో మూడు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment