ఇళ్లన్నీ భద్రం.. విద్వేషాలను రగిల్చేందుకు పవన్‌ పథకం | Not a single house has been demolished at Ippatam village | Sakshi
Sakshi News home page

ఇళ్లన్నీ భద్రం.. విద్వేషాలను రగిల్చేందుకు పవన్‌ పథకం

Published Mon, Nov 7 2022 3:03 AM | Last Updated on Thu, Nov 10 2022 8:06 AM

Not a single house has been demolished at Ippatam village - Sakshi

ఇప్పటంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన కారణంగా ఇళ్ల ప్రహరీ గోడలను తొలగించిన దృశ్యం

ఇప్పటం నుంచి సాక్షి ప్రతినిధులు మేడికొండ కోటిరెడ్డి, నానాజీ అంకంరెడ్డి:  ఆక్రమణల తొలగింపు సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటంలో స్థానిక వైఎస్సార్‌ సీపీ నేత ఇంటి ప్రహరీని సైతం అధికారులు తొలగించారు. పార్టీలు, కుల మతాలనే వివక్ష లేకుండా మానవత్వంతో విధులు నిర్వర్తించారు. విపక్షాలు బురద చల్లుతున్నట్లుగా ఏ ఒక్క ఇంటినీ కూల్చలేదు. సాధారణ పాలన ప్రక్రియలో భాగంగా ఆక్రమణలను గుర్తించి కేవలం ప్రహరీలను మాత్రమే తొలగించారు.

వాస్తవాలు ఇలా ఉండగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ మాత్రం శనివారం నానా హంగామా చేస్తూ ఇప్పటం వెళ్లి విద్వేషాలను రేకెత్తించారు. రోడ్డు విస్తరణ పేరుతో ప్రభుత్వం ఇళ్లను కూల్చి వేస్తోందంటూ అడ్డగోలు విమర్శలకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా వైషమ్యాలను రగిల్చేందుకు పథకం వేశారు. ఈ నేపథ్యంలో నిజానిజాలను పరిశీలించేందుకు ‘సాక్షి’ ప్రతినిధి బృందం ఆదివారం ఇప్పటం గ్రామాన్ని సందర్శించి స్థానికులతో మాట్లాడింది. ఇంటి ముందు ఉండే ప్రహరీ గోడలు మాత్రమే తొలగించారని, ఏ ఒక్క నివాసాన్నీ కూల్చి వేయలేదని స్పష్టంగా వెల్లడైంది.  

రాజకీయ చిచ్చే.. 
గౌడులు, నాయుళ్లు, రెడ్లు నివసించే ఇప్పటంలో ఎన్నికలప్పుడు ఎవరి రాజకీయాలు వారు చేసుకున్నా గ్రామస్తులంతా సామరస్యంగా జీవిస్తుంటారు. ఈ ఏడాది మార్చిలో జనసేన ఆవిర్భావ సభను అక్కడ నిర్వహించాలని భావించినప్పుడు ఇప్పటంలో మూడు ప్రధాన కులాల పెద్దల సమావేశం నిర్వహించి చర్చించారు. జనసేన సభ జరిగిన వేదిక ఆ పార్టీ సానుభూతిపరుల పొలం ఉండే ప్రాంతంలోనే ఉన్నా ఆ చుట్టు పక్కల పొలాల యజమానుల్లో అన్ని పార్టీల వారున్నారు.

ఇప్పటం అభివృద్దికి రూ.50 లక్షల విరాళం ఇస్తామని జనసేన ప్రకటించడంతో ఆ డబ్బుతో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై గ్రామంలోని మూడు సామాజిక వర్గాలు మరోసారి సమావేశమై చర్చించాయి. ఈ ఏడాది జూన్‌లో కూడా మూడు సామాజిక వర్గాలు కలసి రూ.2.50 లక్షల చందాలు సేకరించి ఉమ్మడిగా పోతురాజు ఆలయాన్ని అభివృద్ధి చేసుకున్నాయి. అలాంటి ప్రశాంత ఇప్పటంలో జనసేనాని రగిల్చిన చిచ్చుతో విద్వేష వాతావరణం నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
31నే గ్రామానికి వచ్చి వెళ్లిన నాదెండ్ల.. 
ఇప్పటంలో రోడ్డుకు ఇరువైపులా ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఇంటి ప్రహరీలు, షెడ్లు నిర్మించుకున్న వారికి మంగళగిరి– తాడేపల్లి నగర కార్పొరేషన్‌ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో రెండు విడతలు నోటీసులు జారీ చేశారు. అంతకు ముందు ఫిబ్రవరిలోనే ఆక్రమణలకు సంబంధించి మార్కింగ్‌ చేశారు. తొలగింపుపై జూన్‌లో మైక్‌ ద్వారా ప్రచారం చేశారు. రూ.25 లక్షలతో సైడు కాలువల నిర్మాణం సమయంలోనే ఆక్రమణల పరిధిలోకి వచ్చిన 8 ఇళ్ల ప్రహరీ గోడలను ఆగస్టులోనే తొలగించి పనులు పూర్తి చేశారు. తాజాగా రూ.1.65 కోట్లతో రోడ్ల విస్తరణ పనులకు సంబంధించి అక్టోబరులో టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు.

ఈ నెల 2వతేదీతో టెండర్ల గడువు ముగియగా పనులను సంబంధిత కాంట్రాక్టరుకు అప్పగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఇళ్లకు సంబంధించిన ప్రహరీ గోడల అక్రమణలను నాలుగో తేదీన తొలగించనున్నట్లు గత నెల 31, ఈ నెల 1వతేదీన ఇప్పటంలో పంచాయతీ మైక్‌ ద్వారా ప్రచారం కూడా చేశారు. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్‌ గత నెల 31న  గ్రామంలో పర్యటించారు. ఆ సమయంలో కరెంట్‌ పోవడంతో కావాలనే ప్రభుత్వం విద్యుత్తు నిలిపి వేసిందంటూ చిందులు తొక్కారని గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు.

అనంతరం నాలుగో తేదీన ఆక్రమణల తొలగింపు సమయంలో అత్యధికులు ఎలాంటి అభ్యంతరం చెప్పకున్నా జనసేన మద్దతుదారులు కొందరు అడ్డుకునే యత్నం చేయడం, ఆ మరుసటి రోజే పవన్‌కళ్యాణ్‌ పర్యటించడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటంలో ఇన్నాళ్లూ టీడీపీ మద్దతుదారులే కాంట్రాక్టు పనుల్లో పెత్తనం చలాయించారు. వీరంతా ఇప్పుడు జనసేన ముసుగు కప్పుకున్నారు. ఇప్పటంలో గత మూడేళ్లలో రూ.2.85 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ఇప్పటికే పూర్తి చేయగా మరో రూ.6 కోట్ల పనులు మంజూరై టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది.  
 
పచ్చని పల్లెలో పవన్‌ చిచ్చు  

ప్రశాంతంగా ఉన్న ఇప్పటంలో బయటి నుంచి వచ్చిన కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం చిచ్చు రేపారు. సుమారు 2 వేల మంది జనాభా, 1,350 ఓటర్లున్న ఈ గ్రామం మంగళగిరి – తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉంది. రెండేళ్ల క్రితమే కార్పొరేషన్‌లో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభించారు. అందులో భాగంగా ఇప్పటంలోనూ రోడ్ల విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు.

53 నివాసాలు, ఒక పంచాయతీ భవనం (మొత్తం 54) ఆర్‌ అండ్‌ బీ రోడ్డు స్థలాన్ని ఆక్రమించినట్లు గుర్తించి మార్కింగ్‌ చేశారు. ప్రతి ఇంటికీవెళ్లి తొలగింపుపై అవగాహన కల్పించారు. చట్ట ప్రకారం ప్రభుత్వ స్థలాన్ని తీసుకోవాలని స్థానికులు సైతం కోరారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ రాకతో గ్రామంలో ప్రశాంతత భగ్నమైంది.  
 
సగం దూరం తగ్గుతుంది.. 
దుగ్గిరాల మండలంలోని ఐదు ఊర్లను వడ్డేశ్వరం వద్దనున్న హైవేతో ఇప్పటం కలుపుతుంది. దుగ్గిరాల ప్రాంతం నుంచి విజయవాడ రావాలంటే ప్రధాన మార్గంలో వెళ్తే 14 కి.మీ ప్రయాణించాలి. అదే ఇప్పటం మీదుగా ప్రయాణిస్తే 7 కి.మీ దూరం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటంలో ఆర్‌ అండ్‌ బీ రోడ్డు విస్తరణకు సంబంధిత శాఖ అధికారులు పనులు చేపట్టారు.   
 
మురుగు అంతా రోడ్డుపైకి.. 
ఇప్పటం మీదుగా వెళ్లే ఆర్‌ అండ్‌ బీ రోడ్డు ఆక్రమణలతో ఇరుకుగా మారిపోవడం, సరైన డ్రైనేజీ లేకపోవడంతో మురుగు అంతా రోడ్డుపైనే చేరుతోంది. దీంతో రోడ్డు విస్తరణ, డ్రైనేజీ నిర్మాణానికి అధికారులు అనివార్యంగా చర్యలు చేపట్టారు. టెండర్లు పిలిచి 350 మీటర్ల పరిధిలో రోడ్డు నిర్మించేందుకు రూ.1.65 కోట్లతో పనులు చేపట్టారు.  
 
ఇళ్లకు నష్టం లేకుండా.. 
ఇప్పటంలో ప్రధాన రోడ్డు అంతా ఒకే వెడల్పుతో లేదు. ఒకచోట 60 అడుగులు, మరో చోట 75 అడుగులు.. ఇంకోచోట 118 అడుగులు చొప్పున ఉంది. దీంతో అధికారులు మార్కింగ్‌ చేసిన ప్రాంతాల్లో ఒకచోట ఎక్కువ ఆక్రమణలు, మరోచోట తక్కువ తొలగించే పరిస్థితి తలెత్తింది. అందరికీ ఒకేలా తొలగింపు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరడంతో బ్రిటిష్‌ హయాంలో వేసిన సర్వే రాళ్ల ఆధారంగా ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు.

సరిహద్దు రాళ్ల ఆధారంగా తొలగింపు చేపట్టగా కొన్ని నివాసాలు దెబ్బతినే ప్రమాదం ఉండడంతో అధికారులు ఇళ్లకు నష్టం జరగకుండా కేవలం ప్రహరీలు, అదనంగా నిర్మించిన షెడ్లను మాత్రమే తొలగించారు. రెండు నెలల క్రితం ఇలా ఆక్రమణలను తొలగించిన చోట డ్రైనేజీ నిర్మాణం చేయడంతో నివాసితులు తమ ఇళ్లకు మార్పులు సైతం చేసుకున్నారు.  
 
30 ఏళ్ల క్రితమే.. 
ఇప్పటంలో ఆక్రమణల గుర్తింపు మార్కింగ్‌ ఫిబ్రవరిలో చేపట్టడమే తొలిసారి కాదని స్థానికులు వెల్లడించారు. 30 ఏళ్ల క్రితం ఒకసారి, 15 ఏళ్ల క్రితం మరోసారి మార్కింగ్‌ చేశారని చెప్పారు. తాము ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టిన మాట వాస్తవమేనని, అందువల్ల సహకరించామని తెలిపారు.

ఆక్రమణల తొలగింపు ప్రక్రియ రెండు నెలలుగా సాగుతున్నా ఈనెల 2వ తేదీన కొందరు అలజడికి తెర తీశారని గ్రామస్తులు పేర్కొన్నారు. అన్ని సామాజిక వర్గాలు కలసి మెలసి జీవించే తమ గ్రామానికి ఇప్పటిదాకా పోలీసులు వచ్చిందే లేదని పేర్కొంటున్నారు. 
 
వైఎస్సార్‌ కల్యాణ మండపం.. 

ఇప్పటంలో ప్రజల చందాలతో ప్రభుత్వ స్థలంలో కల్యాణ మండపాన్ని నిర్మించారు. గతంలో ఈ ప్రాంత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇద్దరు రూ.11 లక్షలు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరో రూ.30 లక్షలు ఇవ్వగా ఇప్పుడు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. స్థలం సరిపోకపోవడంతో మరో కొంత ప్రభుత్వ స్థలాన్ని అదనంగా తీసుకున్నారు. స్థానిక పెద్దలు ఈ భవనానికి ‘డాక్టర్‌ వైఎస్సార్‌ కల్యాణ మండపం’ అని నామకరణం చేయాలని తీర్మానించగా జనసేన వర్గం కోర్టుకు వెళ్లగా వారి పిటిషన్‌ను కొట్టివేసింది.  
  
రికార్డుల ప్రకారం తీసుకున్నారు..  
2014లో ఇల్లు కట్టా. ఆక్రమణల తొలగింపులో మొదట తొలగించింది మా ఇంటి ప్రహరీనే. రోడ్డు పక్క ఖాళీగా ఉండడంతో గోడ కట్టా. గతంలో రెండుసార్లు మార్కింగ్‌ చేసినా చర్యలు తీసుకోలేదు. ఫిబ్రవరిలోనూ మార్కింగ్‌ చేసినా తొలగించరనుకున్నాం. అధికారులు రెండుసార్లు నోటీసులిచ్చి ప్రతి ఇంటికీ వచ్చి పరిస్థితిని వివరించారు. రికార్డుల్లో ఉన్నట్లుగానే తొలగించాలని వారిని కోరాం. దీంతో మా ఇంటి ప్రహరీ తొలగించారు. ఇదంతా రెండు నెలల క్రితమే జరిగింది. అందరివీ ప్రహరీలు, చిన్నచిన్న షెడ్లు మాత్రమే తొలగించారు. ఒక్క ఇల్లు కూడా కూలగొట్టలేదు. 
– పొన్నంగి శివారెడ్డి, ఇప్పటం 

ఎవరి ఇల్లూ కూల్చలేదు  
రోడ్డు విస్తరణకు ఆక్రమణల తొలగింపు కోసం పూర్వం వేసిన సర్వే హద్దు రాళ్లను ప్రామాణికంగా తీసుకున్నారు. హద్దు దాటి కట్టిన నిర్మాణాలను మాత్రమే తొలగించారు. ఇళ్లు ఎవరికి వారు తమ సొంత స్థలంలోనే కట్టుకుని అవకాశం ఉన్నవారు గోడలు, షెడ్లు రోడ్డు ఆనుకుని నిర్మించారు. రెండు నెలల క్రితం తొలగించినప్పుడు ఎలాంటి వివాదం లేదు. ఎవరి ఆస్తులూ పోకపోయినా ఇప్పుడు గొడవలు సృష్టించారు. మా ఇంటి గోడ కూడా ప్రభుత్వ స్థలంలో కట్టిందే. దాన్ని తొలగించి డ్రైనేజీ కట్టారు.  
– మున్నంగి సాంబిరెడ్డి, బాలకోటిరెడ్డి, ఇప్పటం 

ప్రభుత్వానిది కాబట్టి ఇచ్చేశాం  
రోడ్డు ఆనుకుని చిల్లర కొట్టు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నాం. ఆ స్థలం ప్రభుత్వానిది అని తెలుసు. ఖాళీగా ఉందని షెడ్డు వేసుకున్నాం. సర్వే చేసి దాన్ని  
తొలగిస్తామని అధికారులు ముందుగానే చెప్పి నోటీసులిచ్చారు. ఇంటికి వచ్చి కూడా చెప్పారు. ఇంటిని మాత్రం ముట్టుకోలేదు. ఆ స్థలం ఏదో రోజు తప్పకుండా తీసుకుంటారని తెలుసు. అందుకే అడ్డు చెప్పలేదు.  
– వీరంకి సుమలత, ఇప్పటం 

రెండు నెలల క్రితమే 8 ప్రహరీల తొలగింపు  
ఆది నుంచి టీడీపీ మద్దతుదారులైన యామినేని వెంకట కృష్ణారావు, మల్లిఖార్జునరావు నివాసాలు ఇవి. ఇప్పటంలో కొత్తగా రూ.1.65 కోట్లతో నిర్మించ తలపెట్టిన రహదారి అవసరాల మేరకు అక్రమణలను తొలగించాల్సి వస్తే ఈ ఇద్దరు అన్నదమ్ముల ఇంటి గుమ్మం కూడా కూల్చివేతల పరిధిలోకే వస్తుంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం వీరిద్దరి ఇళ్లలో ముందువైపు గదుల్లో సగం దాకా ఆక్రమణలు తొలగించాలి.

కానీ మానవత్వంతో వ్యవహరించిన ప్రభుత్వం శ్లాబ్‌ భాగం ఉండే ఇంటిని కూల్చకుండా గుమ్మం ముందు దాదాపు రెండు అడుగుల స్థలం కూడా వదిలేసి మిగిలిన ప్రహరీ గోడను మాత్రమే తొలగించింది. మొత్తం 54 భవనాలు ఆక్రమణల తొలగింపు పరిధిలోకి రాగా అందులో ఎనిమిది ఇళ్ల ప్రహరీలను రెండు నెలల కిత్రమే ఆగస్టు 28వ తేదీన తొలగించారు.   

ఇళ్లను తాకలేదు
మా నాన్న సమయం నుంచి మేం టీడీపీ అభిమానులం. ఆక్రమణల  తొలగింపు సమయంలో అధికారులు మా ఇంటికి ఏమాత్రం నష్టం వాటిల్లకుండా ప్రహరీ మాత్రమే తొలగించారు. చాలా మంది ఇళ్లు ప్రభుత్వ స్థలంలోకి వచ్చినా అధికారులు వాటిని తాకలేదు. కేవలం ప్రహరీలే తీసేశారు.  
– యామినేని వెంకట కృష్ణారావు, ఇప్పటం  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement