‘గుంటూరు’లో ఐదు ఆస్పత్రులకు నోటీసులు
గర్భిణులకు అవసరంలేకపోయినా ఆపరేషన్లు చేయడంపై ప్రభుత్వం కన్నెర్ర
మరో 20 ఆసుపత్రులకు మెమోలు ఇచ్చేందుకు రంగం సిద్ధం
గుంటూరు మెడికల్: రాష్ట్రవ్యాప్తంగా అవసరానికి మించి గర్భిణులకు సిజేరియన్లు చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో.. గుంటూరు జిల్లాలోని ఐదు ఆసుపత్రులకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు నోటీసులు జారీచేశారు. దీంతో.. కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, నందనా హాస్పిటల్, డీవీసీ హాస్పిటల్, వీ కార్డియాలజీ కేర్ హాస్పిటల్, శ్రీవెంకటేశ్వర హాస్పిటళ్లకు చెందిన వైద్యులు వివరణ ఇవ్వాలంటూ జిల్లా వైద్య అధికారులు ఆదేశాలు జారీచేశారు. మరో 20 ఆస్పత్రులకు సైతం నోటీసులు సిద్ధంచేసినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు.
కాన్పుకు రూ.70 వేల నుంచి రూ.1.50 లక్షలు వసూలు
సాధారణ కాన్పు అయ్యేవారికి సైతం సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీస్తున్నారనే ఫిర్యాదులు ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులపై తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ సాధారణ కాన్పుకు రూ.50 వేల వరకు వసూలుచేస్తున్నారు. సిజేరియన్‌కు రూ.70వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలుచేస్తున్నారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులు 10,320 జరుగగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో 15,555 కాన్పులు జరిగాయి.
ప్రభుత్వాసుపత్రుల్లో సిజేరియన్ డెలివరీలు 4,128 జరగ్గా, ప్రైవేటు ఆసుపత్రుల్లో 9,333 జరిగాయి. ఇక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న వారిని సిజేరియన్ల పేరుతో అధిక సంఖ్యలో ఫీజులు వసూలుచేస్తూ ఆరి్థకంగా, ఆరోగ్యపరంగా వారిని ఇబ్బందిపడేలా చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే.. అది కూడా శిశువు లేదా తల్లి ప్రాణాలకు అపాయం వాటిల్లుతుందనుకున్న సమయాల్లో మాత్రమే చేయాల్సిన సిజేరియన్లు ఎడాపెడా చేసేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొరఢా ఝుళిపించింది.
అనవసరంగా ఆపరేషన్లు చేస్తే చర్యలు తప్పవు
నిబంధనల ప్రకారం చేయాల్సిన దానికంటే ఎక్కువ సిజేరియన్లు చేసిన ఆస్పత్రులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. నూరు శాతం సిజేరియన్లు చేసిన ఐదు ఆస్పత్రులకు నోటీసులు జారీచేశాం. మరో 20 ఆస్పత్రులకు సైతం నోటీసులిచ్చేందుకు రంగం సిద్ధంచేశాం. సాధ్యమైనంత మేరకు సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రతి ఒక్కరూ చూడాలి. సాధారణ ప్రసవాలతో బాలింతలు త్వరితగతిన కోలుకుంటారు. – డాక్టర్ కొర్రా విజయలక్షి్మ, డీఎంహెచ్‌ఓ, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment