పెద్దాపురం: ఈ రోజుల్లో రూపాయి పెట్టి ఏం కొనుక్కోవచ్చో ఠక్కుమని చెప్పండి.. కాస్త ఆలోచించారు కదూ.. రూపాయి పెడితే ఓ చిన్న చాక్లెట్టో, ఓ బిస్కెట్టో కొనుకోవచ్చు అని అనుకుంటున్నారా? నిజమే.. కానీ ఆ హోటల్‌లో రూపాయికి 3 చట్నీలతో ఇడ్లీ వస్తుంది. ఏంటి రూపాయికి ఇడ్లీయా అని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే. రాజమహేంద్రవరం–కాకినాడ ఏడీబీ రోడ్డులో కొత్తూరు జంక్షన్ నుంచి 3 కిలోమీటర్ల దూరం వెళితే ఆర్‌బీ కొత్తూరు గ్రామం వస్తుంది.
పెద్దాపురం మండల పరిధిలోని ఈ గ్రామానికి చెందిన చిన్ని రామకృష్ణ (రాంబాబు), రాణి దంపతులు ఇంటి బయట పూరి గుడిసెలో 16 ఏళ్లుగా హోటల్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఒక్క రూపాయికే 3 చట్నీలతో ఇడ్లీ అమ్ముతున్నారు. ఇక్కడ మైసూరు బజ్జీ కూడా ఒక్క రూపాయే. ఊళ్లోని ఇతర హోటళ్లు అన్నింట్లో తొలుత రూపాయికే ఇడ్లీ ఇచ్చేవారు.
క్రమేపీ సరుకుల ధరలు పెరగడంతో మిగిలిన హోటళ్లలో ఇడ్లీ ధరలను పెంచేశారు. రాంబాబు మాత్రం ఇప్పటికీ రూపాయికే ఇడ్లీ అందిస్తున్నారు. రాంబాబు హోటల్‌లో రుచికే కాదు శుచికి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక్కడ పరిశుభ్రత పాటిస్తూ టిఫిన్ అందిస్తారు. దీనికి నాణ్యత కూడా తోడవడంతో గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల వారు కూడా వచ్చి ఇక్కడ క్యూలో నిలుచుని మరీ టిఫిన్ చేస్తుంటారు. ఇంట్లోనే హోటల్ నిర్వహిస్తుండటంతో అద్దె కట్టే పని లేదని, తక్కువ ధరకు ఎక్కువ మొత్తంలో విక్రయిస్తుండటంతో పెద్దగా లాభాలు లేకపోయినా హోటల్‌ను నడిపిస్తున్నామని రాంబాబు చెబుతున్నాడు. రోజుకు సుమారు 500 మంది తన హోటల్‌కు వస్తారని తెలిపాడు.
వేడివేడిగా బజ్జీలు వేస్తున్న అత్త రత్నావతి
నాకు సంతృప్తిగా ఉంది
రూపాయి అనే పదానికున్న ప్రత్యేకత వేరు. రూపాయికే వైద్యం అంటారు. రూపాయికే కిలో బియ్యం అంటారు. ఇవన్నీ జనం నోట్లో విపరీతంగా నానుతాయి. అందుకే నేను కూడా నష్టం రానంతవరకూ రూపాయికే ఇడ్లీ అమ్మాలనుకుంటున్నాను. చాలా మంది నన్ను ఇబ్బంది పెట్టారు. ధర పెంచాలన్నారు. కానీ నాకు నచ్చలేదు. 16 ఏళ్ల కిందట అర్ధ రూపాయితో ఇడ్లీ వ్యాపారం మొదలుపెట్టా. నా భార్య రాణి, అత్త రత్నావతి సహకారంతో ఇప్పటికీ అదే రేటుతో వ్యాపారం కొనసాగిస్తున్నాను. నష్టం లేకుండా ఇప్పటికీ వ్యాపారం చేస్తున్నా. తక్కువ ధర కావడంతో ఒత్తిడి ఉంటుంది. కానీ ఇది నాకు చాలా సంతృప్తి కలిగిస్తుంది.
– చిన్ని రాంబాబు, హోటల్ వ్యాపారి, ఆర్‌బీ కొత్తూరు, పెద్దాపురం మండలం
ఇవీ చదవండి:
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఎస్సీ, ఎస్టీలకు వయోపరిమితి సడలింపు
ఏపీ: ప్రతి 100 మందిలో 30 మందికి అప్పుడే పెళ్లిళ్లు
Comments
Please login to add a commentAdd a comment