భూ కుంభకోణంపై సాక్షిలో వచ్చిన కథనం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రభుత్వ భూములను చెరబట్టిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భూ దందాలు, ఆక్రమణలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ హయాంలో ఏకంగా 56 ఎకరాల ప్రభుత్వ స్థలాలను పల్లా అండ్ కో కబ్జా చేసినట్లు రెవెన్యూ అధికారుల విచారణలో నిగ్గు తేలింది. వ్యవసాయ, వ్యవసాయేతర, పారిశ్రామిక భూములు, రోడ్లు, చెరువులు.. ఇలా కబ్జాకు కాదేదీ అనర్హం అన్నట్లుగా గాజువాక పరిసర ప్రాంతాల్లో కనిపించి న భూములన్నింటినీ పల్లా మింగేశారు.
సాక్షి వరుస కథనాలతో..
పల్లా కుటుంబం భూ దందాలు, అక్రమాలను ‘సాక్షి’ వరుస కథనాలతో ఏప్రిల్‌లోనే వెలుగులోకి తేవడంతో స్పందించిన జిల్లా అధికార యంత్రాం గం విచారణ చేపట్టింది. జాయింట్ కలెక్టర్ (ఆర్‌బీ అండ్ ఆర్) ఆదేశాల మేరకు గాజువాక తహసీల్దార్ ఎం.వి.ఎస్.లోకేశ్వరరావు సమగ్ర విచారణ జరిపా రు. రెవెన్యూ అధికారులు దాదాపు నెలన్నర పాటు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కుటుంబం భూ కబ్జాలపై క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు. ఖాళీ స్థలాలతో పాటు రోడ్లు, చెరువులను సైతం ఆక్రమించినట్లు విచారణలో స్పష్టమైంది. గాజువాక మండలం తుంగ్లాంలో వివిధ సర్వే నంబర్లలో 56.07 ఎకరాలు కబ్జా చేసినట్లు గుర్తించారు.
కబ్జా భూములను లీజుకిచ్చి..
పల్లా కుటుంబ సభ్యులు రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జా చేయడంతో పాటు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు లీజులకు ఇచ్చి నట్లు అధికారుల విచారణలో నిర్ధారణ అయింది. హెచ్‌పీసీఎల్, ఎల్ అండ్ టీ లాంటి బడా సంస్థలతో పాటు చిన్న ప్రైవేట్ కంపెనీలు వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు.
ఉన్నతాధికారులకు విచారణ నివేదిక
పల్లా కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలపై గాజువాక తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది స్పష్టమైన నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించా రు. సర్వే నెంబర్ల ప్రకారం ఆ స్థలం ఏ విభాగం కిందకు వస్తుంది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి, ఎవరి ఆధీనంలో ఉంది? అనే విషయాలతో సమగ్ర నివేదిక రూపొందించారు.
పల్లా భూ కబ్జాల బాగోతం..
► తుంగ్లాం సర్వే నంబర్ 9/6లో ఉన్న 56 సెంట్ల పోరంబోకు స్థలం పల్లా శ్రీనివాసరావు సోదరుడు పల్లా శంకరరావు ఆక్రమణలోనే ఉందని అధికారులు నిర్ధారించారు.
► సర్వే నంబర్ 10/2లో 36 సెంట్ల పోరంబోకు భూమిని పల్లా శంకరరావు కబ్జా చేశారు. ఈ స్థలంలో ఏసీసీ షెడ్లు వేసినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు.
► సర్వే నంబర్ 14/1లో 14.5 ఎకరాల భూమిని పల్లా శంకరరావు ఆక్రమించినట్లు నిర్ధారించారు. ఇందులో 1.75 ఎకరాలను హెచ్‌పీసీఎల్‌కు లీజుకు ఇవ్వడంతో గోడౌన్ నిర్మించినట్లు గుర్తించారు. మరో 10 సెంట్ల స్థలంలో జూబ్లీ ఇంజనీరింగ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన షెడ్డు ఉంది.
► సర్వే నంబర్ 14/2లో 28 సెంట్ల రైత్వారీ భూమి పల్లా కబ్జాలో ఉన్నట్లు తేల్చారు.
► సర్వే నంబర్ 28లో ఉన్న 40 ఎకరాల చెరువు పల్లా శంకరరావు ఆధీనంలో ఉన్నట్లు తేల్చారు. ఇందులో 92 సెంట్లలో కాంపౌండ్ వాల్‌తో షెడ్డు ఉన్నట్లు గుర్తించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ స్థలాన్ని ఏపీఐఐసీ నుంచి సేకరించగా రైల్వే శాఖకు అప్పగించినట్లు ఉంది.
► సర్వే నంబర్ 33/4లో 13 సెంట్ల పోరంబోకు స్థలాన్ని పల్లా కబ్జా చేశారు. ఆ స్థలంలో హెచ్‌పీసీఎల్ గోడౌన్ ఉంది.
► సర్వే నంబర్ 34/2లో ఉన్న 24 సెంట్ల పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి హెచ్‌పీసీఎల్‌కు లీజుకు ఇచ్చారు. సదరు సంస్థ ఈ స్థలంలో షెడ్డు నిర్మించింది.
Comments
Please login to add a commentAdd a comment