సచివాలయాల్లో పాస్‌పోర్టు సేవలు | Passport services in Village secretariats at Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సచివాలయాల్లో పాస్‌పోర్టు సేవలు

Published Sun, May 1 2022 4:33 AM | Last Updated on Sun, May 1 2022 11:02 AM

Passport services in Village secretariats at Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: మూరుమూల పల్లెటూళ్లో బాగా చదువుకున్న చాలా మంది యువతకు విదేశాల్లో ఉద్యోగం చేయాలన్నది పెద్ద కల. విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు తప్పనిసరి. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవడం వీరికి ప్రయాసతో కూడుకున్న పనే. దగ్గరలో ఉన్న పెద్ద పట్టణానికో, నగరానికో వెళ్లాలి. అక్కడ అన్‌లైన్‌లో ఎలాంటి తప్పుల్లేకుండా పాస్‌పోర్టుకు దరఖాస్తు (స్లాట్‌ బుకింగ్‌) చేయాలి. వీటి కోసం దళారులు ఒక్కో పాస్‌పోర్టుకు 2 నుంచి 3 వేల రూపాయలు వసూలు చేస్తారు. దరఖాస్తులో తప్పులు దొర్లితే మళ్లీ ప్రయత్నించాలి. గ్రామీణ ప్రజలకు ఇప్పుడా అవస్థలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన గ్రామ సచివాలయాల్లోనే పాస్‌పోర్టుతో పాటు పాన్‌కార్డు, రైల్వే టిక్కెట్‌ బుకింగ్‌ వంటి కొన్ని కేంద్ర ప్రభుత్వ సేవలు కూడా వీటిలో పొందవచ్చు. ఎల్‌ఐసీ ప్రీమియమూ ఇక్కడే చెల్లించొచ్చు. ఇప్పటివరకు 545 రకాల రాష్ట్ర ప్రభుత్వ సేవలు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇటీవల పలు కేంద్ర ప్రభుత్వ సేవలు, మరికొన్ని కమర్షియల్‌ సేవలు సైతం సచివాలయాల ద్వారా పొందే ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది.

ఇప్పటికే 98 మందికి పాస్‌పోర్టు సేవలు
రాష్ట్రంలో మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. అన్ని సచివాయాలల్లోనూ అదనపు సర్వీసులను గ్రామ, వార్డు సచివాలయ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ సేవలపై సచివాలయానికి ఒకరికి చొప్పున సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చింది. ప్రస్తుతానికి 1,600 సచివాలయాల ద్వారా అదనపు సేవలను అందిస్తోంది. వీటికి స్పందన కూడా బాగుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 98 మంది పాస్‌పోర్టు సేవలను వినియోగించుకున్నట్టు వెల్లడించారు. మరో 484 మంది పాన్‌కార్డు సేవలు వినియోగించుకున్నారు. సచివాలయాల్లో కొత్త సేవల గురించి ‘సిటీజన్‌ ఔట్‌ రీచ్‌’ పేరుతో ప్రతి నెలా రెండు రోజుల పాటు  సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్టున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు.

జూన్‌ నుంచి మరిన్ని సచివాలయాల్లో ఆధార్‌ సేవలు
దాదాపు 500 సచివాలయాల్లో ఇప్పటికే ఆధార్‌ సేవలందుతున్నాయి. కొత్తగా మరో 2,500 సచివాలయాల్లో ప్రారంభించనుంది. జూన్‌ నుంచి ప్రతి 5 సచివాలయాల్లో ఒకటి చొప్పున మొత్తం 3 వేల సచివాలయాల్లో ఆధార్‌ సేవలు అందుబాటులోకి వసాయి. ఇందుకోసం ఒక ల్యాప్‌టాప్, ఐ– స్కానర్, బయోమెట్రిక్‌ డివైస్‌ తో కూడిన ఆధార్‌ కిట్‌లను సచివాలయాలకు ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. మే నెలాఖరుకలా ఆధార్‌ కిట్లు చేరతాయని అధికారులు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాల్లో ప్రత్యేక ఆధార్‌ క్యాంపుల  నిర్వహణకు  కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికీ ఆధార్‌ నమోదు చేసుకోని వారికి నమోదు చేయిస్తామని అధికారుల తెలిపారు. ఇప్పటికే ఆధార్‌ నమోదు చేసుకొన్న పిల్లలకు బయోమెట్రిక్‌ ఆధునీకరణ వంటి సేవలను ఈ క్యాంపుల ద్వారా అందించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా అధికారులు వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement