ఈ చిత్రంలోని ఇతని పేరు పుసులూరి బుజ్జిబాబు, కొడవళ్ల తయారీ కార్మికుడు. వ్యవసాయ సీజన్‌లో రోజుకు వంద నుంచి 150 కొడవళ్లు తయారు చేసి సాన పట్టి, కుక్కు పెడతారు. సుమారు రూ.500 నుంచి రూ.700 వరకు సంపాదిస్తారు. ఈ సీజన్‌లో నిత్యం పని ఉంటుందని, కుటుంబాలు సక్రమంగా సాగిపోతాయని బుజ్జిబాబు ఆనందంగా చెబుతున్నారు. మామూలు రోజుల్లో నామమాత్రంగా పని ఉంటుందని పేర్కొన్నారు.
కణకణమండే అగ్ని కీలలు.. అందులో నుంచి ఎగసిపడే నిప్పురవ్వలు.. లయబద్ధమైన సుత్తుల సవ్వడులు.. బలంగా బిగిసే పిడికిళ్లు.. కొడ‘వళ్లు వంచి’.. సానబట్టే చేయి తిరిగిన శ్రామికులు.. పేటేరు గ్రామంలో నిత్యం కనిపించే దృశ్యాలివీ.. కొడవళ్ల తయారీకి ఈ గ్రామం పెట్టింది పేరు.
రేపల్లె: వ్యవసాయ సీజన్ ప్రారంభమైందంటే రేపల్లె మండలం పేటేరు గ్రామం వైపు రైతులు, వ్యాపారుల అడుగులు పడతాయి. వ్యవసాయ పనులకు అవసరమైన కొడవళ్ల తయారీకి ఈ గ్రామం ప్రసిద్ధి చెందింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకే కాక ఇతర రాష్ట్రాలకూ ఇక్కడి నుంచి కొడవళ్లు ఎగుమతి అవుతాయి.
ఈ గ్రామంలో సుమారు 70 ఏళ్ల క్రితం కొడవళ్ల తయారీ ప్రారంభమైంది. మూడు తరాలుగా ఇదే వృత్తిపై ఆధారపడి ఇక్కడి శ్రామికులు జీవనం సాగిస్తున్నారు. కొడవలి తయారీలో అద్భుత నైపుణ్యం సాధించారు. వీరు జీవించే కాలనీ శ్రామికనగర్‌గా గుర్తింపు పొందింది. ఈ గ్రామంలో 40కుపైగా కార్ఖానా(కొలిమి)లు ఉన్నాయి. ప్రస్తుతం సుమారు 200 మందికిపైగా కార్మికులు పనిచేస్తున్నారు.
తయారీ ఎలాగంటే..
ముడి ఇనుపబద్ధలను కొలిమిలో కాల్చి కార్మికులు కొడవలిని తయారు చేస్తారు. అనంతరం దానికి సానబెట్టి నొక్కులు కొట్టి పట్టుకునేందుకు అనువుగా చివరన చెక్కలను అమరుస్తారు. సీజన్లో ఒక్కొక్క కొలిమిలో రోజుకు సుమారుగా 500 వరకు కొడవళ్లు తయారు చేస్తుంటారు. ఇవి మూడు సైజుల్లో ఉంటాయి. సైజును బట్టి ధర ఉంటుంది. చిన్నసైజు రూ.30, మధ్యస్తంగా ఉన్నవి రూ.60, పెద్దవి రూ.90 వరకు విక్రయిస్తారు. ప్రతి నెలా గ్రామంలో లక్షకుపైగా కొడవళ్లు తయారవుతాయని అంచనా. అత్యాధునిక వ్యవసాయ పరికరాలు అందుబాటులోకి వచ్చినా కొడవళ్లకు గిరాకీ తగ్గలేదు.
ముడిసరుకు దిగుమతి
బేల్ కట్లకు ఉపయోగించి పనికిరాని పడవేసే ఇనుప బద్దలను చెన్నై, విశాఖపట్నం, కాకినాడ పోర్టుల నుంచే కాకుండా విజయవాడ తదితర ప్రాంతాల నుంచి కిలో రూ.30లెక్కన కొని ఇక్కడి కార్ఖానాల యజమానులు దిగుమతి చేసుకుంటారు. బొగ్గులు, చెక్క సిద్ధం చేసుకుని కొడవళ్లు తయారు చేస్తారు. అయితే ప్రస్తుతం ముడిసరుకుల ధరలు భారీగా పెరిగాయని, దీనికి రవాణా చార్జీలు అదనంగా పడుతున్నాయని యజమానులు చెబుతున్నారు. వందల మంది కార్మికులు కొడవళ్ల తయారీలో నిరంతరం శ్రమిస్తుంటారు. కత్తులు తయారీలో నాణ్యమైన ముడి ఇసుమును ఉపయోగించటం వల్ల ఎక్కువ కాలం మన్నుతాయి. అందుకే ఇక్కడ తయారైన కొడవళ్లకు మంచి గిరాకీ ఉంది.
– చందోలు రవికుమార్, శ్రామికనగర్, పేటేరు
కొడవళ్లు అమ్ముతా
వ్యవసాయ సీజన్‌లో పేటేరు నుంచి కొడవళ్లు తీసుకువెళ్లి మా జిల్లాలో అమ్మకాలు చేస్తుంటాం. పేటేరు కొడవళ్లు మన్నికగా ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా తీసుకువెళ్తున్నాం. వ్యవసాయ సీజన్ వచ్చిందంటే పేటేరు రావాల్సిందే.
– సత్యనారాయణ, వ్యాపారి తుని, తూర్పుగోదావరి
Comments
Please login to add a commentAdd a comment