సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామస్థాయిలోనే అవినీతి రహిత, సత్వర సేవలను అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలో భాగంగానే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ రూపుదిద్దుకుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 15,004 సచివాలయాల ద్వారా 34 శాఖలకు చెందిన 543 సేవలను ప్రజల ముంగిటకు తీసుకొచ్చినట్లు చెప్పారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు కైలే అనిల్‌కుమార్, అంబటి రాంబాబు, రాజన్నదొర, బియ్యపు మధుసూధన్‌రెడ్డి, కేవీ ఉషశ్రీ చరణ్‌లు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటివరకు 3.54 కోట్ల సేవల కోసం ప్రజల నుంచి సచివాలయాలకు వినతులు అందగా, వాటిల్లో 3.52 కోట్ల వరకు పరిష్కారమయ్యాయన్నారు. అన్ని సంక్షేమ పథకాలు, సర్టిఫికెట్లు, కేంద్రం ఇచ్చే ఆధార్, పాసుపోర్టు సేవలతో పాటు రిజిస్ట్రేషన్లు కూడా గ్రామాల్లోనే సచివాలయాల ద్వారా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు బాబు వస్తే జాబు వస్తుందని చంద్రబాబు గోడల మీద రాయించారని, కానీ సీఎం జగన్ 1.35 లక్షల మందికి సచివాలయ ఉద్యోగులుగా.. 2.65 లక్షల మందికి వలంటీర్లుగా మొత్తం దాదాపు 4 లక్షల మందికి ఏకకాలంలో ఉద్యోగావకాశాలు కల్పించి చరిత్ర సృష్టించారన్నారు.
ఉత్తమ వలంటీర్లకు పురస్కారాలు
వలంటీర్లకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని, సేవామిత్ర కింద రూ.10,000, సేవారత్న కింద రూ.20,000, సేవావజ్ర కింద రూ.30,000 చొప్పున నగదు ప్రోత్సాహం, ఒక సర్టిఫికెట్, బ్యాడ్జి, శాలువతో సన్మానిస్తున్నామని.. ఇందుకోసం ఈసారి బడ్జెట్‌లో రూ.258.37 కోట్లు కేటాయించినట్లు పెద్దిరెడ్డి తెలిపారు. కోవిడ్ కష్టకాలంలో వారి సేవలు వెలకట్టలేనివన్నారు. మరో ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. తూర్పు గోదావరి జిల్లాలోని సముద్రతీర ప్రాంతంలో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం వాటర్ గ్రిడ్ పథకం కింద రూ.1,650 కోట్లకు పరిపాలనా అనుమతి జారీచేసినట్లు తెలిపారు. దీని ద్వారా 1,603 ప్రాంతాలకు రక్షిత మంచినీటి సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ సందర్భంగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఒక్క పాఠశాల మూతపడదు
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాల మూతపడదని ఆ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సభలో వెల్లడించారు. టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ప్రతీ సబ్జెక్టుకు నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉండాలనే లక్ష్యంతో సబ్జెక్టు టీచర్లను బట్టి తరగతులను విలీనం చేస్తున్నాం కానీ పాఠశాలలు మూయడంలేదని స్పష్టంచేశారు.
ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీకి రూ.970.90 కోట్లు
రాష్ట్రంలో ఆక్వా రైతులకు ప్రభుత్వం యూనిట్ రూ.1.50లకే సబ్సిడీపై విద్యుత్‌ను అందిస్తోందని, దీనికి ఏటా రూ.970.90 కోట్లు వ్యయం అవుతున్నట్లు ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. గతంలో యూనిట్ విద్యుత్ రేటు రూ.3.86గా ఉండేదన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటివరకు సబ్సిడీ రూపంలో వారికి రూ.2,113 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చిందన్నారు.
గిరిజనులకు రూ.4,968.25 కోట్లు..
ఇక గిరిజనులకు ‘నవరత్నాల’ ద్వారా రూ.4,968.25 కోట్ల లబ్ధిచేకూర్చినట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి ప్రకటించారు. ఈ పథకాల ద్వారా మొత్తం 13,22,266 మందికి ప్రయోజనం లభించిందన్నారు.
సెల్‌ఫోన్లు, రికార్డర్లకు అనుమతిలేదు
ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగిసిన తర్వాత సభాపతి తమ్మినేని సీతారాం పలు అంశాలపై రూలింగ్‌లు ఇచ్చారు. సభలోకి సభ్యులు సెల్‌ఫోన్లు, రికార్డర్లు తీసుకురావడం, కాగితాలు చింపి విసరడం, సభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఇతర సభ్యులు అంతరాయం కలిగించడాన్ని అనుమతించబోమన్నారు. టీడీపీ సభ్యులు మార్చి 16న ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు నిబంధనలకు లోబడి లేకపోవడంతో తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. నాటుసారా, నాణ్యతలేని మద్యం అంశాలపై అదే పార్టీ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఇచ్చిన వాయిదా తీర్మానాన్నీ తిరస్కరిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment