సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటా ‘మా నమ్మకం నువ్వే జగన్..’ నినాదం ప్రతిధ్వనించింది. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వానికి మద్దతు పలికి ఆశీర్వదిస్తూ మళ్లీ ఆయనే అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ 1.16 కోట్ల కుటుంబాల ప్రజలు మెగా పీపుల్స్ సర్వేలో చాటిచెప్పారు. తద్వారా రాష్ట్రంలో 80 శాతానికిపైగా కుటుంబాల ప్రజలు సీఎం జగన్ పాలనకు మద్దతు తెలిపినట్లు స్పష్టమవుతోంది. టీడీపీ సంప్రదాయ ఓటర్లు కూడా వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గుచూపుతున్నారనడానికి మెగా పీపుల్స్ సర్వే ఫలితాలే తార్కాణమని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు.
ప్రతి గడపనూ పలుకరించిన జగనన్న సైన్యం
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడం..మెగా పీపుల్స్ సర్వేలో 80 శాతానికిపైగా కుటుంబాలు సీఎం జగన్‌కు మద్దతు తెలపడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నెలకొంది. రాష్ట్రంలో 46 నెలలుగా అమలవుతున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా సీఎం జగన్ ప్రభుత్వం చేకూరుస్తున్న మేలును వివరించడం, విపక్షాల దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా ఈనెల 7న ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
సచివాలయానికి ముగ్గురు చొప్పున నియమించిన కన్వీనర్లు, 50 నుంచి వంద ఇళ్లకు ఇద్దరు చొప్పున నియమించిన గృహ సారథులు వెరసి ఏడు లక్షల మందితో కూడిన క్షేత్ర స్థాయి సైన్యం ప్రతి గడపనూ పలుకరించింది. టీడీపీ సర్కారు, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మధ్య తేడాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాన్ని చదివి ఆయా కుటుంబాలకు గృహ సారథులు అందజేశారు.
మెగా పీపుల్స్ సర్వేలో భాగంగా ప్రజా మద్దతు పుస్తకంలో ఐదు ప్రశ్నలను చదివి వినిపించి ప్రజాభిప్రాయాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత రసీదు అందచేశారు. సీఎం జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 82960–82960 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆయా కుటుంబాల అంగీకారం మేరకు సీఎం జగన్ ఫోటో ఉన్న స్టిక్కర్లను ఇంటి తలుపులు, మొబైల్ ఫోన్లకు అతికించారు.
1.16 కోట్ల కుటుంబాల మిస్డ్ కాల్స్
వైఎస్సార్‌సీపీ శ్రేణులు వెల్లడించిన అంశాలతో ఏకీభవిస్తూ 1.16 కోట్ల కుటుంబాలు ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ మిస్డ్ కాల్స్ ఇచ్చాయి. గృహ సారథుల వద్ద సీఎం వైఎస్ జగన్ ఫోటోతో ఉన్న స్టిక్కర్లను అడిగి మరీ తీసుకుని ఇంటి తలుపులకు, మొబైల్ ఫోన్లకు అతికించుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అధికారంలో ఉన్న పార్టీ తమ ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు నేరుగా జనంలోకి వెళ్లడం ఇదే తొలిసారి అని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు మేలు చేసిన సీఎం జగన్ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు క్షేత్ర స్థాయిలోకి పార్టీ శ్రేణులను పంపి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని ప్రశంసిస్తున్నారు.
వెల్లువలా మద్దతు..
సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాలను దక్కించుకోవడం ద్వారా వైఎస్సార్‌సీపీ చరిత్ర సృష్టించింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95 శాతానికిపైగా హామీలను అమలు చేసి ఎన్నికల మేనిఫెస్టోకు సీఎం జగన్ సరి కొత్త నిర్వచనం ఇచ్చారు. దేశంలో తొలిసారిగా నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలకు రిజర్వు చేస్తూ చట్టం చేసి మరీ పదవులిచ్చారు.
నామినేటెడ్ నుంచి కేబినెట్ వరకూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సింహభాగం పదవులు కల్పించి సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో విప్లవాత్మక మార్పులను తెచ్చి ప్రజలకు చేరువయ్యారు. కరోనా మహమ్మారిని సమర్థంగా నియంత్రించి ప్రజల ప్రాణాలకు భరోసా ఇవ్వడంతోపాటు ఆ కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులను లెక్క చేయకుండా సంక్షేమ పథకాలను కొనసాగించి ప్రజల మన్ననలను చూరగొన్నారు.
దీంతో పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలతోపాటు తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికలలో వైఎస్సార్‌సీపీకి తిరుగులేని విజయాన్ని ప్రజలు కట్టబెట్టారు. తాజాగా మెగా పీపుల్స్ సర్వేలో 80 శాతానికిపైగా కుటుంబాల ప్రజలు సీఎం జగన్ పాలనకు మద్దతు తెలిపారు. వీటిని పరిగణలోకి తీసుకుంటే వైఎస్సార్ సీపీకి నానాటికీ ప్రజల్లో మద్దతు పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇది ప్రతిపక్షాల నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
22 రోజుల్లో 1.45 కోట్ల కుటుంబాలతో మమేకం..
రాష్ట్రంలో ఈనెల 7న ప్రారంభమైన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం శనివారంతో ముగిసింది. మొత్తం 22 రోజుల్లో 15,004 సచివాలయాల పరిధిలోని 1.45 కోట్ల కుటుంబాల ప్రజలతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు మమేకమయ్యాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో సీఎం జగన్ 98.5 శాతం అమలు చేయడంతోపాటు 46 నెలల్లోనే సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో నేరుగా రూ.2 లక్షల కోట్లకుపైగా జమ చేయడాన్ని ప్రతి కుటుంబానికి వివరించాయి.
సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి వద్దకే తేవటాన్ని గుర్తు చేశాయి. పరిపాలన సౌలభ్యం, ప్రజల సౌకర్యం కోసం 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించడాన్ని వివరించాయి. సొంతింటి స్వప్నాన్ని సాకారం చేస్తూ 30 లక్షల మందికిపైగా అక్కచెల్లెమ్మలకు ఇంటి స్థలాలను ఇవ్వడంతోపాటు, 17,005 జగనన్న కాలనీల్లో ఇళ్లను నిర్మించి ఇస్తుండటాన్ని ప్రతి ఇంటికీ చాటి చెప్పాయి. టీడీపీ హయాంలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే జన్మభూమి కమిటీల్లోని టీడీపీ నేతలకు లంచాలు ఇవ్వనిదే పనులు జరగని విషయాన్ని గుర్తు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment