సాక్షి,అమరావతి/చిలకలూరిపేట/గంగాధరనెల్లూరు (చిత్తూరు జిల్లా): రాష్ట్రంలో 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేకూరుస్తున్న మేలును వివరించడం, విపక్షాల దు్రష్పచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ కావడంపై వైఎస్సార్ సీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇంటింటా సీఎం జగన్‌కు ప్రజలు నీరాజనం పలికారని చెప్పారు.
ఈ నెల 7న ప్రారంభమైన ఈ కార్యక్రమం శనివారంతో ముగిసింది. 22 రోజుల్లో 1.45 కోట్ల కుటుంబాలతో జగనన్న సైన్యం మమేకమైందని తెలిపారు. మెగా పీపుల్స్ సర్వేలో 1.16 కోట్ల కుటుంబాల ప్రజలు సీఎం జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 82960–82960 నెంబర్‌కు మిస్డ్ కాల్స్ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో 80 శాతానికిపైగా కుటుంబాలు ముఖ్యమంత్రి జగన్ పాలన పట్ల సంపూర్ణ విశ్వాసంతో ఉన్నట్లు మెగా పీపుల్స్ సర్వేతో నిరూపితమైందన్నారు.
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ముగింపు సందర్భంగా శనివారం 175 నియోజకవర్గాలలో పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు మెగా పీపుల్స్ సర్వే వివరాలు వెల్లడించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడారు.
ధైర్యంగా ప్రజల ముందుకు...
మా ప్రభుత్వం ప్రజలకు మంచి చేసింది. అందువల్లే మేం ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్లి చేసిన మంచిని చెప్పగలుగుతున్నాం. మేం చెప్పడమే కాదు... ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పనితీరు గురించి అడిగి వివరాలు తీసుకున్నాం. రాష్ట్రవ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. మొత్తం 1.1 కోట్లకు పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయి. వారంతా ముఖ్యమంత్రి జగన్ సందేశాన్ని తమ ఫోన్ ద్వారా విన్నారు.
నా నియోజకవర్గంలో 83 శాతం అంటే 77,534 కుటుంబాలను గృహసారథులు, సచివాలయ కన్వినర్లు కలిశారు. ఏ గడపకు వెళ్లినా చిరునవ్వుతో ప్రజలు ఆహ్వానించారు. జగనన్న అందిస్తున్న సుపరిపాలనే దీనికి కారణం. ఈ మెగా పీపుల్స్ సర్వే విజయవంతం కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు, ఆ పార్టీ నాయకులకు నిద్ర పట్టడంలేదు. మా పార్టీకి లభిస్తున్న ప్రజా మద్దతును సహించలేక చంద్రబాబు ప్రజలను దూషించడం మొదలు పెట్టారు. ఇటీవల పల్నాడు జిల్లా పర్యటనలో ప్రజలకు దయ్యం పట్టిందంటూ పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేశారు. – విడదల రజిని, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి
ప్రజాభిప్రాయానికి ప్రతీక
అధికారంలోకి వచ్చిన దాదాపు నాలుగేళ్ల తర్వాత ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలనే ఆలోచన దేశంలో ఏ ఒక్క సీఎంకు రాలేదు. ప్రజల్లోకి నేరుగా వెళ్లి అభిప్రాయాలను సేకరించడం ద్వారా సీఎం జగన్ నూతన ఒరవడి సృష్టించారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా అన్ని రాజకీయ పారీ్టలకు చెందిన వారి ఇళ్లకు వెళ్లాం. ప్రజా మద్దతు పుస్తకంలో ఐదు ప్రశ్నలను చదివి, వారి అభిప్రాయాలను కోరి నమోదు చేశాం.
80 శాతం ప్రజలు సీఎం జగన్ పాలనకు మద్దతు తెలిపారు. ప్రజా మద్దతు పుస్తకం ప్రజాభిప్రాయానికి ప్రతీకలా నిలిచింది. చంద్రబాబు మాదిరిగా దొంగ లెక్కలు వైఎస్సార్‌సీపీ ఎన్నటికీ చెప్పదు. సీఎం జగనన్న పరిపాలన పట్ల నమ్మకం ఉంది కాబట్టే జగనన్నే మా భవిష్యత్తు మెగా సర్వేను ప్రజలు విశేష స్థాయిలో ఆదరించారు. – దేవినేని అవినాష్, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త
రాజకీయాల్లో నూతన ఒరవడి
దేశంలో ఎన్నడూ లేని రీతిలో ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు మెగా పీపుల్స్ సర్వే నిర్వహించడం ద్వారా రాజకీయాల్లో నూతన ఒరవడిని సీఎం జగన్ సృష్టించారు. ఎన్నికల హామీల్లో 99 శాతం అమలు చేసి రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలను అందించారు.
సుపరిపాలన ద్వారా ప్రజలకు చేరువయ్యారు. సీఎం జగన్ నాయకత్వం పట్ల 80 శాతం కుటుంబాలు పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు పీపుల్స్ సర్వేలో వెల్లడైంది. సీఎం జగన్ పాలనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి కార్యకర్త, నాయకులకు అభినందనలు. – ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎంపీ
విశేష స్పందన
మా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్నే మన భవిష్యత్’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ 1.16 కోట్ల మంది నుంచి మిస్డ్‌కాల్స్ వచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే ఇందుకు కారణం. ప్రతి గడపలోనూ ప్రజలందరు జగనన్న వెంటే ఉన్నామని స్పష్టంచేశారు.
ఎర్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును ప్రోత్సహించే వారిని ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. ఎస్సీ, ఎస్టీలకు టీడీపీ ప్రభుత్వంలో మేలు జరిగిందని చంద్రబాబు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. ఓట్ల కోసం చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు సీఎం వైఎస్ జగన్ పాలనలోనే అత్యంత ఎక్కువగా మేలు కలుగుతోంది. – నారాయణస్వామి, డిప్యూటీ సీఎం
మా నమ్మకం నువ్వే జగన్
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంతో రాష్ట్రవ్యాప్తంగా 1.45 కోట్ల కుటుంబాల ప్రజలతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు నేరుగా కలిశాయి. ఏడు లక్షల మంది గృహసారథులు, సచివాలయాల కన్వినర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్రంలో 80 శాతానికిపైగా కుటుంబాలు సీఎం జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలిపాయి.
ప్రజలు వారి భవిష్యత్తు కోసం.. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ నినదిస్తున్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సీఎం జగన్‌తోనే సాధ్యమని విశ్వసిస్తున్నారు. ప్రజా మద్దతు పుస్తకంలో ప్రశ్నలకు ప్రజలు స్వచ్ఛందంగా సమాధానాలు ఇచ్చారు. ప్రజల అంగీకారంతోనే సీఎం జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్లను అతికించాం. చంద్రబాబు సంస్కార హీనుడిలా మాట్లాడటం సరికాదు. – మర్రి రాజశేఖర్, ఎమ్మెల్సీ
ప్రజా మద్దతు వైఎస్సార్‌సీపీకే
రాష్ట్రంలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ ఇలాంటి కార్యక్రమాన్ని చేయలేదు. మెగా సర్వేతో ప్రజా మద్దతు వైఎస్సార్‌సీపీకే ఉందని స్పష్టమైంది. సీఎం జగన్ పాలనకు అనుకూలంగా 80 శాతం ప్రజలు తీర్పు ఇచ్చారు. అవినీతి, వివక్ష లేని పాలనకు మద్దతుగా నిలిచారు. సర్వేలో ఇదే స్పష్టమైంది. 15 వేల సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహించాం. చంద్రబాబు ఇలాంటి సర్వే జీవితంలో ఎప్పుడైనా చేశారా? – మల్లాది విష్ణు, ఎమ్మెల్యే
ఇలాంటి సర్వే ఇదే తొలిసారి
దేశంలోనే ఇలాంటి సర్వే చేసిన మొదటి ప్రభుత్వం మాదే. 40 ఏళ్లు అనుభవం ఉందని చెప్పుకునే వారు కూడా ఇలాంటి సర్వేకు సాహసించలేదు. కేవలం 22 రోజుల్లో 1.45 కోట్ల కుటుంబాలను కలిశాం. ఇలాంటి కార్యక్రమం చేసే దమ్ము చంద్రబాబుకి ఉందా? కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా వైఎస్సార్‌సీపీ పాలన చేస్తోంది. ఈ మాట చంద్రబాబు ఒక్కసారైనా ఆయన ప్రభుత్వ హయాంలో చెప్పగలిగారా? మెగా సర్వేను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు . – వెలంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment