ఆయన అవినీతికి ఆధారాలున్నాయని నిర్ధారించిన కేంద్ర హోం శాఖ
అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి
కేసు నమోదు చేసి దర్యాప్తుకు సిద్ధమవుతున్న ఏసీబీ
ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో బిగుసుకుంటున్న ఉచ్చు
చంద్రబాబు ఆదేశాల మేరకు నిఘా పరికరాల కొనుగోలుకు ప్రణాళిక
కేంద్ర భద్రత చట్టాలను ఉల్లంఘించి కొనుగోలుకు నిర్ణయం
తన కుమారుడి కంపెనీ పేరిట అవినీతి దందా
సాక్షి, అమరావతి: చంద్రబాబు కుట్రల్లో భాగస్వామిగా ఉన్న అత్యంత వివాదాస్పద ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ)కి ఉచ్చు బిగుసుకుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో చట్టాలను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా ఆయన చేసిన అవినీతి పాపం పండింది. చంద్రబాబుకు రాజకీయ లబ్ధి కలిగించేందుకు దేశ భద్రత చట్టాలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఆయన అవినీతికి పాల్పడినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కేంద్ర హోంశాఖ నిర్ధారించింది.
ఏబీ వెంకటేశ్వరరావుపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఈ నెల 2న జారీ చేసిన ఉత్తర్వులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఏబీ వెంకటేశ్వరరావు అవినీతి వ్యవహారాలపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయన్ని సస్పెండ్ చేసింది. ఇప్పుడు కేంద్ర హోం శాఖ కూడా ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తునకు అనుమతించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలోనే సంచలనం సృష్టించిన ఈ వ్యవహారం కథ కమామిషు ఇదీ..
బాబు కుట్రల్లో భాగస్వామి
2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వంలో ఏబీ వెంకటేశ్వరరావు రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు వినియోగించాల్సిన నిఘా వ్యవస్థను ఆయన దురి్వనియోగం చేసి, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు కలిగించేందుకు అడ్డదారులు తొక్కారు. వైఎస్సార్‌సీపీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి టీడీపీలో చేరేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు.
అంతేకాదు.. నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలోని ఓటర్ల వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీకి చెందిన సేవా మిత్ర యాప్‌నకు అనుసంధానం చేసి, డేటా చౌర్యానికి పన్నిన పన్నాగంలోనూ ప్రధాన పాత్రధారిగా మారారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి అడ్డదారిలో విజయం చేకూర్చాలన్న కుట్రల్లో కీలకంగా వ్యవహరించారు. అందుకోసం వైఎస్సార్‌సీపీ కీలక నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయాలన్న చంద్రబాబు ఆదేశాలతో పకడ్బందీ పన్నాగం పన్నారు.
ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాల కొనుగోలు కుట్ర
వైఎస్సార్‌సీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్ కోసం ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలు కొనాలని ఇంటెలిజెన్స్ చీఫ్ హోదాలో ఏబీ వెంకటేశ్వరరావు నిర్ణయించారు. ఇందుకోసం నిబంధనలను ఉల్లంఘించారు. నిఘా పరికరాలు కొనుగోలుకు ముందుగా కేంద్ర రక్షణ శాఖ అనుమతి తప్పనిసరి. కానీ కేంద్ర రక్షణ, హోం శాఖలకు తెలియకుండానే ఈ వ్యవహారాన్ని ముగించాలని ఆయన నిర్ణయించారు. రాష్ట్ర పోలీసు శాఖ ఆధునీకరణ ముసుగులో మానవ రహిత వాహనం (యూఏవీ), ఏరో్రస్టాట్ పరికరాలు, ఇతర నిఘా పరికరాలను రూ.25.50 కోట్లతో కొనాలని నిర్ణయించారు.
ఈ వ్యవహారంలోనూ ఆయన కుమారుడు చేతన సాయి కృష్ణ కంపెనీకి టెండరు కట్టబెట్టడం ద్వారా అవినీతికి తెరలేపారు. ఏబీవీ కుమారుడు చేతన సాయి కృష్ణ, అతని స్నేహితుడు భాగస్వామిగా 2017 జులై 11న ఆకాశ్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని విజయవాడలో ఏర్పాటు చేశారు. అనంతరం ఇజ్రాయెల్‌కు చెందిన ఆర్‌టీ ఇన్‌ఫ్లేమబుల్ ఆబ్జెక్ట్ లిమిటెడ్ (ఆర్‌టీఎల్‌టీఏ) అనే కంపెనీ ద్వారా నిఘా పరికరాలు కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారు.
అనంతరం 2017 డిసెంబర్ 19న ఆర్‌టీఎల్‌టీఏ కంపెనీ భారత్‌లో తమ ప్రతినిధిగా ఏబీవీ కుమారుడు చేతన సాయికృష్ణను నియమించడం గమనార్హం. అంటే ఏఆర్‌టీఎల్‌టీఏ కంపెనీ ముసుగులో ఏబీ వెంకటేశ్వరావు తన కుమారుడి కంపెనీకి టెండర్లు కట్టబెట్టాలని పథకాన్ని పక్కాగా అమలు చేశారు. అందుకోసం టెండర్ నిబంధనలను ఉల్లంఘించారు.
కచి్చతంగా అవినీతి దందానే అని నిర్ధారించిన సీవీసీ
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం పూర్తిగా వెలుగులోకి వచ్చింది. దేశ భద్రతకు మప్పు కలిగించే అవకాశం ఉన్న నిఘా పరికరాలను కేంద్ర రక్షణ శాఖ అనుమతి లేకుండా కొనడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అవినీతి నిరోధక చట్టాన్ని కూడా ఉల్లంఘించిన ఏబీవీపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఆయన్ని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది. ఐపీఎస్ అధికారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటే కేంద్ర హోం శాఖ అనుమతి తీసుకోవాలి.
అందుకే నిఘా పరికరాల కొనుగోలులో ఏబీ వెంకటేశ్వరావు అవినీతిపై కేంద్ర హోం శాఖ అనుమతి కోరుతూ నివేదిక ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ నివేదికను కేంద్ర హోం శాఖ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) పరిశీలనకు పంపింది. ఆ వ్యవహారాన్ని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించింది. ఏబీ వెంకటేశ్వరరావు అవినీతికి పాల్పడినట్టు నిర్ధారించి, ఆయనపై చర్యలు తీసుకునేందుకు అనుమతించాలని పేర్కొంటూ ఈ ఏడాది ఏప్రిల్ 15న కేంద్ర హోం శాఖకు నివేదించింది. అంటే ఆయన అవినీతికి పాల్పడినట్టు ప్రాథమిక ఆధారాలున్నాయని నిరూపితమైంది.
దాంతో ఏబీ వెంకటేశ్వరరావుపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(1)(ఎ), రెడ్ విత్ సెక్షన్ 15, 7(ఎ) కింద కేసు నమోదు చేసేందుకు కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. ఆయనపై ఏసీబీ త్వరలోనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఏబీవీకి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశించే అవకాశాలున్నాయని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment