నిందితుడు చేతన్‌చౌదరి నుంచి స్వాధీనం చేసుకున్న బ్యాంకు చెక్కులు, డీడీలు, పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులు తదితరాలు
కందుకూరు: కొరియర్ సర్వీసుల్లో వచ్చే బ్యాంకు చెక్కులు, ఏటీఎం కార్డులు, డీడీలు వంటివి దొంగిలించడం, వాటిని మాన్యుపులేట్ చేసి బ్యాంకుల నుంచి రూ.లక్షల్లో నగదు కొట్టేయడం అలవాటుగా చేసుకున్న మోసగాడు చివరికి కటకటాల పాలయ్యాడు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నివాసం ఉంటున్న తిరుపతికి చెందిన గాలి చేతన్‌చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కందుకూరు డీఎస్పీ కండె శ్రీనివాసులు శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. కందుకూరుకు చెందిన రమాదేవి అనే మహిళ తనకు తెలిసిన వి.వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి కెనరా బ్యాంకు చెక్‌బుక్ నుంచి రూ.2 లక్షలకు చెక్కు రాసి ఇచ్చింది. ఈ చెక్కును వెంకటేశ్వర్లు తన యూనియన్ బ్యాంకు అకౌంట్ ద్వారా మార్చుకునేందుకు స్థానిక బ్యాంకులో ఇచ్చాడు.
ఆ చెక్కును వెరిఫికేషన్ చేసి పాస్ చేసేందుకు కందుకూరు బ్రాంచ్ అధికారులు ఒంగోలు బ్రాంచ్‌కు ప్రొఫెషనల్ కొరియర్ సర్వీస్ ద్వారా గత నెల 28న పంపారు. కొరియర్ బాయ్ డెలివరీ చేసే సమయంలో చేతన్ చౌదరి ఆ చెక్కును దొంగిలించాడు. చెక్కులో వి.వెంకటేశ్వర్లు పేరును మిస్టర్ వెంకటేశ్వర్లుగా మార్పు చేశాడు. తర్వాత తనకు తెలిసిన అల్లరి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి చేత ఒంగోలు కెనరా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయించి, రూ.2 లక్షల చెక్కును మార్చి నగదు డ్రా చేసుకున్నాడు.
మరోవైపు వి.వెంకటేశ్వర్లు యూనియన్ బ్యాంకులో తాను చెక్కు ఇచ్చి పది రోజులైనా తన అకౌంట్‌లో డబ్బులు పడకపోవడంతో బ్యాంకు అధికారులను ప్రశ్నించాడు. దీంతో మేలుకున్న బ్యాంకు అధికారులు ఈ నెల 14న స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కూపీ లాగడంతో చేతన్‌చౌదరి మోసాలు వెలుగుచూశాయి. చేతన్‌ను అరెస్ట్ చేసి, అతని నుంచి రూ.40 వేల నగదు, పెద్ద ఎత్తున చెక్కుబుక్‌లు, డీడీలు, ఏటీఎం కార్డులు, ఆధార్ కార్డులు, పాన్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో చేతన్ గత రెండేళ్లలో చెన్నై, కోయంబత్తూరు, హైదరాబాద్, ఒంగోలులలో మోసాలకు పాల్పడి దాదాపు రూ.50 లక్షల వరకు బ్యాంకుల నుంచి కాజేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment