నైట్‌బీట్ పోలీసుల రాకతో కంగుతిన్న దుండగులు
కారును వదిలేసి తప్పించుకునిపోయిన వైనం
వాహనంలో సెల్‌ఫోన్లు, మారణాయుధాలు లభ్యం
ఓడీ చెరువు: జోరుగా కురుస్తున్న వర్షంలోనే బ్యాంకు చోరీకి వచ్చిన వ్యక్తులు ఊహించని విధంగా పోలీసులు తారసపడటంతో కారును వదిలేసి పరారయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు... మండల కేంద్రం ఓడీచెరువులో శుక్రవారం రాత్రి వర్షం కురుస్తోంది. స్టేట్‌బ్యాంక్ ముందు ఓ కారు (కేఏ–04జెడ్–5155) ఆగింది. అందులోని వ్యక్తులు బ్యాంకులో కన్నం వేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో నైట్‌బీట్ పోలీసులు అటుగా వస్తుండటం గమనించిన దుండగులు వెంటనే కారులోకి ఎక్కి వేగంగా ముందుకు దూసుకెళ్లారు. అయితే ఆ వైపు పోలీసుస్టేషన్ ఉందన్న విషయం వారికి తెలియదు. పోలీసులు డివైడర్‌ను అడ్డుపెట్టగా.. దాన్ని కారు ఢీకొని అడ్డం తిరిగి ఆగింది.
ఒక్క ఉదుటున కారులోంచి బయటకు దిగి దుండగులు పరుగులు తీశారు. కారును ఎస్‌ఐ సత్యనారాయణ సోదా చేయగా రెండు సెల్‌ఫోన్లు, మారణాయుధాలు దొరికాయి. కారు రాప్తాడు మండలానికి చెందిన ఓ మండలస్థాయి అధికారిదిగా గుర్తించారు. దొరికిన సెల్‌ఫోన్‌లో కాల్స్, ఫేస్‌బుక్ సమాచారం ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సెల్‌ఫోన్లలో ఒకటి గుంటూరు జిల్లా కోటప్పకొండకు చెందిన రమేష్‌జువారికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. రెండు నెలల క్రితం రమేష్ జువారి ఇంటిలో సెల్‌ఫోన్‌తో పాటు మూడు తులాల బంగారు చోరీ అయినట్లు తెలిసింది. కాల్ లిస్ట్ ఆధారంగా కదిరి ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులను పట్టుకుని పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
బ్యాంకు చోరీకి విఫలయత్నం!
Published Sat, Aug 12 2017 10:44 PM | Last Updated on Sat, Aug 11 2018 6:04 PM
Advertisement