od cheruvu
-
శభాష్ వలంటీర్లు: రాష్ట్రాలను దాటి మరీ పింఛన్ల పంపిణీ
ఓడీ చెరువు/ మడకశిర రూరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో కొత్త ఒరవడి తీసుకువచ్చింది. లబ్ధిదారుల ఇంటికే నేరుగా పింఛన్లు అందించే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే పింఛన్‌దారులు ఇంట్లో ఉండకుండా ఇతర రాష్ట్రాల్లో ఉండగా అక్కడికి వెళ్లి మరీ ఇస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఉన్న లబ్ధిదారుల వద్దకు వెళ్లి పింఛన్ నగదు వారి చేయికి అందిస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళకు పింఛన్ అందజేసి వలంటీర్ ప్రశంసలు అందుకున్నాడు. మండల కేంద్రానికి చెందిన గోవిందమ్మ కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. మూడు నెలల నుంచి బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో పింఛన్ పొందలేకపోయింది. మంగళవారం వలంటీర్ సురేశ్‌బాబు సొంత ఖర్చులతో బెంగళూరు వెళ్లి బయోమెట్రిక్ వేయించుకొని 3 నెలల పింఛన్ రూ.6,750 అందజేశాడు. మడకశిర మండలం వైబీహళ్లి సచివాలయం పరిధిలోని గ్రామ వలంటీర్ హనుమంతేగౌడ్ తెలంగాణకు వెళ్లి లబ్ధిదారుకు పింఛన్ అందజేశారు. హైదరాబాద్‌లో ఉంటున్న దివ్యాంగురాలు లక్ష్మీదేవికి మంగళవారం మూడు నెలల పింఛన్ డబ్బు అందించారు. హైదరాబాద్‌లోని నేత్ర విద్యాలయం కళాశాలలో లక్ష్మీదేవి డిగ్రీ తృతీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతోంది. దీంతో ఆమె రెండు నెలల పింఛన్ తీసుకోలేదు. ఇది తెలుసుకున్న వలంటీర్ వెళ్లి పింఛన్ డబ్బు అందజేసినట్లు కార్యదర్శి పెద్దన్న తెలిపారు. -
బ్యాంకు చోరీకి విఫలయత్నం!
నైట్‌బీట్ పోలీసుల రాకతో కంగుతిన్న దుండగులు కారును వదిలేసి తప్పించుకునిపోయిన వైనం వాహనంలో సెల్ఫోన్లు, మారణాయుధాలు లభ్యం ఓడీ చెరువు: జోరుగా కురుస్తున్న వర్షంలోనే బ్యాంకు చోరీకి వచ్చిన వ్యక్తులు ఊహించని విధంగా పోలీసులు తారసపడటంతో కారును వదిలేసి పరారయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు... మండల కేంద్రం ఓడీచెరువులో శుక్రవారం రాత్రి వర్షం కురుస్తోంది. స్టేట్‌బ్యాంక్ ముందు ఓ కారు (కేఏ–04జెడ్–5155) ఆగింది. అందులోని వ్యక్తులు బ్యాంకులో కన్నం వేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో నైట్‌బీట్ పోలీసులు అటుగా వస్తుండటం గమనించిన దుండగులు వెంటనే కారులోకి ఎక్కి వేగంగా ముందుకు దూసుకెళ్లారు. అయితే ఆ వైపు పోలీసుస్టేషన్ ఉందన్న విషయం వారికి తెలియదు. పోలీసులు డివైడర్‌ను అడ్డుపెట్టగా.. దాన్ని కారు ఢీకొని అడ్డం తిరిగి ఆగింది. ఒక్క ఉదుటున కారులోంచి బయటకు దిగి దుండగులు పరుగులు తీశారు. కారును ఎస్ఐ సత్యనారాయణ సోదా చేయగా రెండు సెల్ఫోన్లు, మారణాయుధాలు దొరికాయి. కారు రాప్తాడు మండలానికి చెందిన ఓ మండలస్థాయి అధికారిదిగా గుర్తించారు. దొరికిన సెల్ఫోన్లో కాల్స్, ఫేస్బుక్ సమాచారం ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సెల్ఫోన్లలో ఒకటి గుంటూరు జిల్లా కోటప్పకొండకు చెందిన రమేష్‌జువారికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. రెండు నెలల క్రితం రమేష్ జువారి ఇంటిలో సెల్‌ఫోన్‌తో పాటు మూడు తులాల బంగారు చోరీ అయినట్లు తెలిసింది. కాల్ లిస్ట్ ఆధారంగా కదిరి ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులను పట్టుకుని పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. -
ఎంపీ నిమ్మల, ఎమ్మెల్యే పల్లె నిలదీత
ఓడీ చెరువు: మండలకేంద్రంలో ఆదివారం నిర్వహించిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే పల్లె, ఎంపీ నిమ్మల మధ్య వర్గపోరు మరోమారు బహిర్గతమయింది.. స్థానిక ఐటీఐ కళాశాలలో ఓడీసీ, అమడగూరు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయ కమిటి సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ నిమ్మల కిష్టప్ప హాజరయ్యారు. మొదట ఎమ్మెల్యే జన్మభూమి కమిటి సభ్యుల మార్పు, బూత్ కమిటీల ఏర్పాటు చేసే అంశాలపై మాట్లాడారు. అనంతరం ఎంపీ నిమ్మల కిష్టప్ప టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి సం«క్షేమ పథకాలు గురించి మాట్లాడుతున్న సమయంలో కార్యకర్తలు బోరు రమణ తదితరులు తరచూ పార్టీలు మారే వారికే డీలరు షిప్పులు, కాంట్రాక్టులు ఇస్తున్నారని వాపోయారు. పల్లె, నిమ్మల కిష్టప్పకు చెందిన ఇరువర్గాల కార్యకర్తల మధ్య కొంత సేవు వాగ్వాదం చోటు చేసుకుంది. పల్లె సర్ధి చెప్పేందుకు ప్రయత్నిస్తుండగా ఎంపీ నిమ్మల నవ్వుకుంటూ సమావేశం నుంచి వెళ్లిపోయారు. తర్వాత పల్లె కూడా వెళ్లిపోయారు. దీంతో టీడీపీలో ఎమ్మెల్యే, ఎంపీల మధ్య అంతర్గతంగా నలుగుతున్న కుల, వర్గపోరు సమావేశంలో మరోమారు బహిర్గతమైంది. -
20 కిలోల గంజాయి పట్టివేత
గంజాయి ముఠా నేతల అరెస్ట్ ఓడీ చెరువు (పుట్టపర్తి) : గంజాయి ముఠాకు చెందిన ప్రధాన నాయకులను ఓడీ చెరువు మండలం గౌరాపురం క్రాస్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్చార్జ్ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ సత్యనారాయణ ప్రత్యేక నిఘా పెట్టి శనివారం సాయంత్రం వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 2 లక్షల విలువ కలిగిన 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు వివరాలను కదిరి డీఎస్పీ వెంకట రామాంజనేయులు ఓడీ చెరువు పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు వివరించారు. ఓడీ చెరువు మండలం వంచిరెడ్డిపల్లికి చెందిన మంకముతక నారాయణ, విశాఖ జిల్లా సంకడ మండలం గండెంపల్లికి చెందిన గొర్ల ఈశ్వర్‌తో కలిసి గంజాయిని అనంతపురం, కర్ణాటకలోని బాగేపల్లి, చిక్»బళ్లాపూర్, బెంగళూరుకు తరలించి విక్రయించేవారు. గత బుధవారం పట్టుబడ్డ కొందరు నిందితులు ఇచ్చిన సమాచారంతో లోతుగా దర్యాప్తు చేసి ప్రత్యేక నిఘా వేసి నారాయణ, గొర్ల ఈశ్వర్‌ను పట్టుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. -
ఓడీచెరువులో జెడ్పీ సీఈఓ
ఓబుళదేవరచెరువు : జెడ్పీ సీఈఓ రామచంద్ర ఓబుళదేవరచెరువులో బుధవారం పర్యటించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరుకు సంబంధించిన బయోమెట్రిక్‌ను పరిశీలించారు. హాజరైన సిబ్బంది వివరాలను ఎంపీడీఓ నాగరాజును అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలోని గదులు, పరిసరాలను ఆయన పరిశీలించారు. కార్యాలయం చుట్టూ అపరిశుభ్రంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. వాటిని తొలగించి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మండల వ్యాప్తంగా చేపట్టిన ఫారంపాండ్లపై ఆరా తీశారు. -
రత్నమయ్య అక్రమాస్తులు రూ. 7 కోట్లపైనే
అనంతపురం : ప్రస్తుతం ఓడీ చెరువు తహశీల్దార్‌గా పనిచేస్తున్న రత్నమయ్య రూ.7కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టారని ఏసీబీ అధికారులు బుధవారం నిగ్గు తేల్చారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడని ఆరోపణలు రావడంతో అనంతపురం ఏసీబీ డీఎస్పి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో హిందూపురం, అనంతపురం, బెంగళూరు, మదనపల్లె తదితర ప్రాంతాల్లో ఏడు ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మంగళవారం ఈ దాడులు మొదలైయ్యాయి. ఈ దాడుల్లో బెంగుళూరులో రెండు బంగళాలు, చిత్తూరు జిల్లా మదనపల్లెలో మేడలు, ఇళ్లు, అనంతపురంలో అపార్ట్మెంట్లు, హిందూపురంలో ఇళ్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే పలు కీలక పత్రాలు, ఖాళీ చెక్కులు, 25 తులాల బంగారు నగలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రత్నమయ్య నంబులుపూలకుంటలో తహశీల్దార్‌గా పనిచేసినపుడు సోలార్సిటీకి వ్యవహారంలో కోట్ల రూపాయిలు అక్రమంగా ఆర్జించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాగే చిలమత్తూరు తహశీల్దార్‌గా పని చేసినపుడు కూడా ఆయనపై విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. వీటిపై దృష్టిలో పెట్టుకుని ఏసీబీ అధికారులు ఏక కాలంలో ఏడుచోట్ల దాడులు నిర్వహించారు. తహశీల్దార్ అక్రమాస్తుల లెక్కింపు ఇంకా కొనసాగుతోందని తెలుస్తోంది. -
ఏసీబీ వలలో ఎమ్మార్వో
అనంతపురం : అనంతపురం జిల్లా ఓడి చెరువు ఎమ్మార్వో రత్నమయ్య నివాసంపై మంగళవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఆయనపై వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు మంగళవారం రత్నమయ్య నివాసంపై దాడి చేసి.... సోదాలు నిర్వహించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.