దురుద్దేశం, రాజకీయ కక్షతోనే కేసు నమోదు
పోలీసులు ఓ కొత్త సంప్రదాయానికి తెర తీశారు
ఇది ఏమాత్రం సమంజసం కాదు
భవిష్యత్తులో అది వారికే ఇబ్బందిగా మారుతుంది
మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
తప్పుడు కేసుపై పోలీసులే బాధ్యత వహించాలి
వ్యక్తిగత ద్వేషంతోనే రఘురామ ఆరోపణలు
నాటి వాంగ్మూలానికి నేటి ఫిర్యాదుకు పొంతన ఉందా?
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పక్కా పన్నాగంతో తప్పుడు కేసు నమోదు చేశారని మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, వ్యక్తిగత ద్వేషంతోనే రఘురామకృష్ణరాజు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. అరెస్ట్ చేసిన తరువాత ఆయన్ను కస్టడీలో వేధించినట్లు చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు.
ఆయన అరెస్ట్ విషయంలో, ఆ తరువాత కూడా సీఐడీ అధికారులు నిబంధనల మేరకే వ్యవహరించారని స్పష్టం చేశారు. ఎవరి సంతోషం కోసమో మూడేళ్ల తర్వాత తప్పుడు కేసు నమోదు చేసి పోలీసులు ఓ సాంప్రదాయానికి తెర తీశారని చెప్పారు. ఈ చర్యకు భవిష్యత్తులో వారే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎవరినో సంతోషపెట్టడం.. మరెవరినో ఇబ్బంది పెట్టడం కోసమే
2021 మే 14న అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు కాగా ఆయన్ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి సంబంధిత జ్యూరిస్ డిక్షన్ పరిధిలోని గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారని పొన్నవోలు చెప్పారు. ‘పోలీస్ కస్టడీలో తనను టార్చర్ చేశారంటూ రఘురామకృష్ణరాజు విచిత్రంగా మూడేళ్ల తర్వాత.. గత నెల 11న గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈనెల 11న కేసు నమోదు చేశారు.
ఆ ఫిర్యాదుపై నెల రోజుల తరవాత పోలీసులు స్పందించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు కొందరు పోలీస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి 307 సెక్షన్ కింద కేసు పెట్టారు. ఎవరినో సంతోషపెట్టడం, మరెవరినో ఇబ్బంది పెట్టడం కోసమే ఈ కేసు నమోదు చేసినట్లు స్పష్టమవుతోంది’ అని పేర్కొన్నారు.
వాంగ్మూలం ఒకటి.. ఫిర్యాదు మరొకటి
2021లో రఘురామకృష్ణరాజును గుంటూరు కోర్టులో హాజరు పర్చినప్పుడు ఆయన చెప్పిన మాటలకు, ఇప్పుడు ఫిర్యాదులో చేసిన ఆరోపణలకు ఏమాత్రం పొంతన లేదు. ముఖానికి రుమాలు కట్టుకున్న గుర్తు తెలియని వ్యక్తులు పోలీసు కస్టడీలో తనను టార్చర్ చేశారని నాడు మేజిస్ట్రేట్ ఎదుట ఆయన వాంగ్మూలం ఇచ్చారు.
కానీ గత నెలలో చేసిన ఫిర్యాదులో మాత్రం విచిత్రంగా పోలీసు ఉన్నతాధికారుల పేర్లు చెప్పారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు సునీల్, సీతారామాంజనేయుల పేర్లు ప్రస్తావించారు. తనను హింసిస్తున్న వీడియోను వైఎస్ జగన్ చూశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇంతకన్నా తప్పుడు కేసు ఉండదు
మూడేళ్ల తర్వాత ఫిర్యాదు చేస్తే.. అందులో ప్రస్తావించిన వారందరిపైనా ఇప్పుడు కేసు నమోదు చేయడం పూర్తిగా అసమంజసం. అసలు ఈ కేసులో వైఎస్ జగన్ ఎలా నిందితుడు అవుతారు? ఇంతకన్నా తప్పుడు కేసు మరొకటి ఉండదు. కేవలం దురుద్దే«శం, ద్వేషంతో రఘురామరాజు ఫిర్యాదు చేస్తే పోలీసులు అత్యుత్సాహంగా స్పందించారు. నాడు మెజి్రస్టేట్ ఎదుట రఘురామ చెప్పిందేమిటి? మూడేళ్ల తర్వాత ఫిర్యాదు చేయడం ఏమిటి? అని పోలీసులు కనీసం ఆలోచించరా?
టార్చర్ చేయనేలేదు
రఘురామరాజును నాడు సీఐడీ కస్టడీలో ఏమాత్రం టార్చర్ చేయలేదు. ఆయన కోరడంతో కోర్టు ఆదేశాల మేరకు వైద్య బృందం పరీక్షించి రఘురామ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని నివేదిక ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో జైలు నుంచి విడుదల అయిన తరువాత రఘురామరాజు ఒక్కరే తన సొంత వాహనంలో హైదరాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి వెళ్లారు. పోలీసుల సూచనను బేఖాతర్ చేస్తూ అలా వెళ్లిన రఘురామరాజు ఆర్మీ ఆస్పత్రిలో తన శరీరంపై గాయాలు చూపారు. దాన్నిబట్టి ఆయన ప్రయాణంలో ఏం జరిగి ఉంటుందన్నది అందరూ అర్థం చేసుకోవాలి.
ముందే కల గన్నారా?
రఘురామరాజు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి వైఎస్ జగన్‌ను, డాక్టర్‌ను కూడా ముద్దాయిలుగా చేర్చడం సరికాదు. పాలించే వ్యక్తి మారితే చట్టం మారుతుందా? ఆ వ్యక్తికి వంత పాడుతుందా? అసలు చట్టం, న్యాయం, ప్రాథమిక సూత్రాలు ఏం చెబుతున్నాయో పట్టించుకోరా?
77 రోజుల తర్వాత సాక్షులను విచారించడమే సరికాదని సుప్రీంకోర్టు గతంలో చెప్పిన విషయం తెలియదా? అలాంటప్పుడు మూడేళ్ల తర్వాత విచారిస్తే ఏం జరుగుతుంది? రఘురామ గత నెల 11న ఈ – మెయిల్ ద్వారా గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేస్తే అంతకు ఒక రోజు ముందే అంటే జూన్ 10వ తేదీనే పోలీసులు లీగల్ ఒపీనియన్ ఎలా పొందారో చెప్పాలి. రఘురామ ఫిర్యాదు చేస్తారని పోలీసులు ముందుగానే కల గన్నారా?
చట్టపరంగానే ఎదుర్కొంటాం
ఈ తప్పుడు కేసును చట్టపరంగా, న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఈ కేసు విషయంలో పోలీసులు వ్యవహరించిన విధానం సరికాదు. ఇదో సంప్రదాయంగా మారితే భవిష్యత్తులో పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోతుంది. ఈ పరిణామం ప్రజాస్వామ్య వ్యవస్ధకే కళంకం. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుపై గత ప్రభుత్వ హయాంలో కేసు నమోదు చేయలేదు. 2015లోనే టీడీపీ హయాంలోనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) ఆ కేసు నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment