సాక్షి, అమరావతి/మంగళగిరి/తెనాలిఅర్బన్/మహారాణిపేట(విశాఖ దక్షిణ)/సాక్షి ప్రతినిధి, కాకినాడ: గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)ను, కాకినాడలో నిర్మించిన 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రిని గుజరాత్‌లోని రాజ్‌కోట్ నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే వైఎస్సార్, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు, విజయనగరం మెడికల్ కాలేజీలతోపాటు తెనాలి, హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రుల్లో 9 క్రిటికల్ కేర్ యూనిట్ల ఏర్పాటుకు ఆయన శంకుస్థాపన చేశారు.
విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మైక్రోబయాలజీ, ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ను, నాలుగు సంచార ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ సహా పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు.
మంగళగిరి ఎయిమ్స్‌లో 960 పడకలున్నాయని.. 41 విభాగాల్లో ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయని వివరించారు. 125 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. 2019 నుంచి రోగులకు ఓపీ సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎయిమ్స్ సేవలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పింంచాలని సూచించారు.
అభివృద్ధి చెందిన దేశంగా భారత్..
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ‘కరోనా, లాక్‌డౌన్ వంటి క్లిష్ట సమయాన్ని కూడా భారత్ సమర్థంగా ఎదుర్కొని ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం’ అని చెప్పారు.
కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ ప్రవీణ్ భారతీపవార్ మాట్లాడుతూ ‘2014కు ముందు ఎయిమ్స్‌లో చికిత్స పొందాలంటే ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చేది. మోదీ సర్కార్ వచ్చి న తర్వాత గత పదేళ్లలో ఎయిమ్స్‌ల సంఖ్య 22కు పెరిగింది. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ నవ భారతాన్ని ప్రధాని మోదీ నిర్మిస్తున్నారు’ అని పేర్కొన్నారు.
ఎయిమ్స్‌కు అన్ని విధాల సహకారం
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ‘వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత పెరిగింది. ఎయిమ్స్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 183 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. విద్యుత్ సరఫరా కోసం రూ.35 కోట్లతో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుతో పాటు జాతీయ రహదారి నుంచి ఎయిమ్స్‌కు రూ.10 కోట్లతో అప్రోచ్ రోడ్‌ల అభివృద్ధి చేపట్టాం. రూ.7.74 కోట్లతో నీటి సరఫరా పనులు, రూ.2.2 కోట్లతో డ్రైన్‌ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చాం. ఉచితంగా నీటిని సరఫరా చేస్తున్నాం.
రాష్ట్ర ప్రజలకు వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్‌ను అందించడమే సీఎం జగన్ లక్ష్యం. నాడు–నేడు, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో కార్యక్రమాలు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నాయి’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఉన్నతాధికారులు కృష్ణబాబు, నివాస్, గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మధబానందక తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment