గిరిజనాభివృద్ధికి పెద్దపీట | priority for tribal welfare cm jagan in lwe meet | Sakshi
Sakshi News home page

గిరిజనాభివృద్ధికి పెద్దపీట

Published Sat, Oct 7 2023 4:16 AM | Last Updated on Sat, Oct 7 2023 4:30 PM

priority for tribal welfare cm jagan in lwe meet - Sakshi

వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించడంలో విద్య పాత్ర కీలకం. భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిన 28 ఏకలవ్య పాఠశాలల్లో 24 స్కూళ్లు వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లోనే ఉన్నాయి. వీటి ద్వారా రాష్ట్రంలోని గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్య అందుతోంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం 1,953 ప్రభుత్వ ప్రాథమిక, 81 గురుకుల, 378 ఆశ్రమ పాఠశాలలతో పాటు 179 ప్రీ, పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లను నిర్వహిస్తోంది. మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు–నేడు కార్యక్రమం ద్వారా ఈ స్కూళ్లన్నింటిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ.. డిజిటలైజేషన్‌ పరంగా తరగతి గదులన్నింటినీ అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం.     – సీఎం వైఎస్‌ జగన్‌


సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన ప్రజల హక్కులు పరిరక్షిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గిరిజన రైతుల అభివృద్ధి కోసం 3.22 లక్షల ఎకరాలకు పట్టాలు జారీ చేశామన్నారు. వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూ­లించాలంటే విద్య ప్రధాన ఆయుధంగా తీసుకొని ఆయా ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నా­మని తెలిపారు. కేంద్ర హోం శాఖ ధృడమైన మార్గద­ర్శకత్వం, మద్దతుతో రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద సమస్యను విజయవంతంగా రూపు మాపుతామని, రాష్ట్ర ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తామని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. శుక్రవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఆధ్వర్యంలో వామ­పక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో పాల్గొన్న వైఎస్‌ జగన్‌.. రాష్ట్రంలో వామ­పక్ష తీవ్రవాదంపై పోరాటం, నిర్మూలన, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధిపై మాట్లాడారు.

‘ఆంధ్రప్రదేశ్‌ గత నాలుగు దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాద సమ­స్యపై పోరాడుతోంది. జాతీయ విధానం, కార్యా­చ­రణ ప్రణాళిక ప్రకారం.. తీసుకున్న చర్యలు, అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక ప్రజల హక్కుల పరిరక్షణ వంటి బహుముఖ విధానం సానుకూల ఫలితాలను అందించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మద్దతుతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్య­లను తీసుకుంటోంది. మా ప్రభుత్వం అనుసరించిన వ్యూహాల వల్ల రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద హింసాత్మక సంఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి’ అని తెలిపారు. ఈ సదస్సులో సీఎం జగన్‌ ఇంకా ఏం చెప్పారంటే.. 

తీవ్రవాదబలం బాగా తగ్గుముఖం

  • తొలుత ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు జిల్లాల్లో విస్త­రించిన మావోయిస్టు కార్యకలాపాలు ఇప్పుడు అల్లూరి సీతారామరాజు, పార్వతీ­పురం మన్యం జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న చురుకైన చర్యల కారణంగా మావోయిస్టు తీవ్రవాదబలం 2019 నుంచి 2023 నాటికి 150 నుంచి 50 కి తగ్గింది. 
  • పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌­గఢ్‌లతో పటిష్టమైన సమన్వయం ఉంది. నాలు­గు రాష్ట్రాల అధికారులతో కూడిన జాయింట్‌ టాస్క్‌ఫోర్స్‌లు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. వామ­పక్ష తీవ్రవాద కార్యకలాపాలను ఎదు­ర్కోవడానికి మాకున్న సమాచారాలను ఈ ఉమ్మడి టాస్క్‌ఫోర్స్‌ ద్వారా పరస్పరం పంచుకుంటూ సమష్టిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం.
  • స్థిరమైన అభివృద్ధి, సామాజిక, ఆర్థిక పురోగతి మాత్రమే తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కీలక పరి­ష్కారాలు అని దృఢంగా విశ్వసిస్తున్నాం. పేద­రికం, అవిద్య, అందుబాటులో లేని వైద్యం, సమాజాన్ని పీడిస్తున్న పరిమితమైన ఉపాధి అవకాశాలే తీవ్రవాదానికి అత్యంత అనుకూల అంశాలు. సమర్థవంతమైన విధానాలు అమలు చేయడం ద్వారా మాత్రమే దీన్ని రూపు మాపగలం. 

ప్రత్యామ్నాయ పంటల సాగు

  • ఆపరేషన్‌ పరివర్తనలో భాగంగా 2020–21 నుంచి ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు 9,371 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశారు. 224 కేసులు నమోదు చేసి, 141 మంది నిందితులను అరెస్టు చేశారు. సుమారు 3.24 లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని తగులబెట్టారు. నిరంతరాయంగా చేస్తున్న ఈ ఆపరేషన్‌ వల్ల 2022లో గంజాయి సాగు 1500 ఎకరాలకు తగ్గింది. ప్రస్తుత సంవత్సరం అంటే 2023లో అది కేవలం 45 ఎకరాలకు మాత్రమే పరిమితమైందని చెప్పడానికి సంతోషిస్తున్నా.
  • గంజాయి సాగు చేసే గిరిజనుల ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడానికి పోలీసులు, జిల్లా యంత్రాంగం, పోలీసులు గంజాయి సాగు చేపడుతున్న గిరిజనులతో సంప్రదించి.. వారికి ప్రత్యామ్నాయ పంటలైన కాఫీ, నిమ్మ, జీడి మామిడి, నారింజ, కొబ్బరి, చింతపండు, సిల్వర్‌ ఓక్‌తో పాటు రాజ్మా, కందిపప్పు, వేరుశనగ తదతర పంటల సాగును ప్రోత్సహిస్తూ వారికి జీవనోపాధి కల్పిస్తోంది. తద్వారా వారిని గంజాయి సాగు నుంచి మరల్చే ప్రయత్నం చేస్తోంది.

ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు.. రహదారులు

  • అటవీ ప్రాంతంలో అర్హులైన 1.54 లక్షల మంది గిరిజన రైతులకు 3.22 లక్షల ఎకరాల మేరకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు జారీ చేశాం. వారి భూములను సాగు చేసుకునేందుకు మద్దతుగా, పెట్టుబడి ఖర్చు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతు భరోసాగా రూ.13,500 ఆర్థిక సహాయం అందజేస్తోంది. 
  • మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రహదా రులతో అనుసంధానం అన్నది అత్యంత కీలక మైన అంశం. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో లెఫ్ట్‌ వింగ్‌ ఎక్స్‌ట్రీమిజమ్‌ ఎఫెక్టెడ్‌ ఏరియాస్‌ స్కీం కింద 1,087 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణాన్ని పూర్తి చేశాం. 
  • ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా, పారదర్శకంగా త్వరితగతిన అందజేయడం కోసం 897 గ్రామ సచివాల­యాలను ఏర్పాటు చేశాం. ఒక్కో సచివాల­యంలో 10 మంది ఉద్యోగులతో పాటు ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ కూడా ఉన్నారు. కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. ఇందులో భాగంగా మొబైల్‌ కనెక్టివిటీ పెంచడం కోసం 944 కమ్యూనికేషన్‌  టవర్‌లను ఏర్పాటు చేశాం. 

పిల్లలను బడికి పంపే తల్లులకు ప్రోత్సాహకం

  • పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్స­హిస్తూ, అమ్మఒడి కార్యక్రమం ద్వారా వారికి ఏటా రూ.15,000 ఆర్థిక సహాయం అందిస్తు­న్నాం. మరోవైపు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలు బలోపేతం చేయడానికి, మా ప్రభుత్వం కొత్తగా 879 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ను ఏర్పాటు చేసింది. దీంతో పాటు అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవ­లను అందించేందుకు గిరిజన ప్రాంతాల్లో 108 అంబులెన్స్‌లు 75 పని చేస్తున్నాయి. 89 మొబై­ల్‌ మెడికల్‌ యూనిట్ల (104) ద్వారా గ్రామా­ల్లో ఫ్యామిలీ డాక్టర్‌ సేవలు కూడా  ప్రవేశపెట్టాం.
  • సికిల్‌సెల్‌ అనీమియా, తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న గిరిజనులకు ఆ రోగ్య పింఛన్‌ కింద నెలకు రూ.10 వేలు అందజేస్తున్నాం. వృద్ధాప్య ఫించను కింద గిరిజన ప్రాంతాల్లో 50 ఏళ్ల నుంచే నెలకు రూ.2,750 ఇస్తున్నాం. మేము ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నప్ప­టికీ.. గిరిజన ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపా­లను ఇంకా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం ఈ మావో ప్రభావిత జిల్లాల్లో కనీసం 15 కొత్త బ్యాంకు శాఖలు మంజూరు కావాల్సి ఉంది. గతంలో సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో సిఫార్సు మేరకు వైజాగ్‌లో గ్రే హౌండ్స్‌ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమిని కేటా­యించి, దీనికి సంబంధించిన ప్రతిపాద­నను కేంద్రానికి సమర్పించిందనే విషయాన్ని తెలియజేస్తున్నా. దీనిని వీలైనంత త్వరగా మంజూరు చేయగలరు. 
  • వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధి, శాంతిని సాధించడం, వామ­పక్ష తీవ్రవాద కార్యకలాపాలు విస్తరించకుండా నిరోధించడం కోసం కేంద్ర, రాష్ట్రాల నడుమ నిరంతరం పరస్పర సహాయ సహకారాలు అవసరం. ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అయినప్పటికీ, వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలకు.. అక్కడ పోలీసు బలగాల ఆధునికీ­కరణ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్థిక, వ్యూహా­త్మక మద్దతును కేంద్రం అందించడం అన్నది చాలా కీలకం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement