ఇసుక టెండర్ల ప్రక్రియ అత్యంత పారదర్శకం | Process of sand tenders is highly transparent | Sakshi
Sakshi News home page

ఇసుక టెండర్ల ప్రక్రియ అత్యంత పారదర్శకం

Published Tue, Mar 23 2021 3:16 AM | Last Updated on Tue, Mar 23 2021 4:31 AM

Process of sand tenders is highly transparent - Sakshi

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థ.. ఎంఎస్‌టీసీ ద్వారా అత్యంత పారదర్శకంగా, పటిష్ట నిబంధనలతో టెండర్లు నిర్వహించి ఇసుక తవ్వకాలు, నిల్వ, విక్రయాలను ప్రైవేటు సంస్థకు అప్పగించామని రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. ఎటువంటి లొసుగులు లేకుండా ఉండాలనే టెండర్ల ప్రక్రియలో అపార అనుభవం ఉన్న ఎంఎస్‌టీసీకి ఆ బాధ్యత అప్పగించామని, ఆ సంస్థ కొన్ని వందల టెండర్ల ప్రక్రియ నిర్వహించిందని తెలిపారు. అయినా కొంతమంది ఆరోపణలు చేస్తుండటం బాధాకరమన్నారు. రూ.950 కోట్ల ఇసుక కాంట్రాక్టులో రూ.2 వేల కోట్ల ఆదాయం వస్తుందనడం సరికాదన్నారు. ఈ మేరకు సచివాలయంలో సోమవారం ద్వివేది మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

7 కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సంప్రదింపులు జరిపాం..
ఇసుక తవ్వకాలు, నిల్వ, విక్రయాలు నిర్వహించే సంస్థలను ఎంపిక చేయడానికి ఏడు సంస్థలతో సంప్రదింపులు జరిపి ఎంఎస్‌టీసీతో భూగర్భ గనుల శాఖ ఎంవోయూ కుదుర్చుకుంది. దరఖాస్తు చేసుకున్న కంపెనీల సాంకేతిక సమర్థతలను పరిశీలించాక ఎంఎస్‌టీసీ ఆర్థిక బిడ్లను ఆహ్వానించింది. పోటీలో ఎక్కువమంది పాల్గొనేందుకు వీలుగా టెండర్ల స్వీకరణకు గడువు తేదీని పెంచింది. దీనిపై అన్ని ప్రముఖ దినపత్రికల్లో విస్తృతంగా ప్రకటనలు కూడా ఇచ్చింది. బిడ్ల దాఖలులో భయాలు, సందేహాలు లేకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌ పద్ధతిలో టెండర్లు స్వీకరించింది. అత్యంత పారదర్శకంగా జయ్‌ప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ను ఎంపిక చేసింది.

ఎప్పుడూ లేని విధంగా కాంట్రాక్ట్‌ సంస్థ నుంచి రూ.120 కోట్ల బ్యాంకు గ్యారెంటీని కూడా స్వీకరించాం. ఈ సంస్థ ప్రతి 15 రోజులకు ఒకసారి, ముందుగానే తర్వాత 15 రోజులకు డబ్బును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది ఇసుక తవ్వకాలు సుమారు 1.6 కోట్ల మెట్రిక్‌ టన్నులు కాగా తాజాగా ఏడాదికి 2 కోట్ల మెట్రిక్‌ టన్నుల ఇసుక తవ్వకాలు, సరఫరాను కనీస లక్ష్యంగా నిర్దేశించాం. దీనివల్ల కొరత లేకుండా ఇసుక అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్‌ ద్వారా ఇసుకను బుక్‌ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సర్వర్లు మొరాయించడం, నెట్‌వర్క్‌ సమస్యలు, కృత్రిమ కొరతను సృష్టించడం, మధ్యవర్తుల ప్రమేయం వంటి అక్రమాలకు చెక్‌ పడుతుంది.

మెట్రిక్‌ టన్నుకు రూ.475 చెల్లిస్తే చాలు
తాజా ఇసుక విధానం ప్రకారం.. మెట్రిక్‌ టన్నుకు రూ.475 చెల్లిస్తే చాలు.. ఎంత కావాలంటే అంత ఇసుకను తీసుకెళ్లొచ్చు. 175 నియోజకవర్గాలవారీగా రవాణా ఖర్చులతో కలిపి ప్రభుత్వం ధరలు ప్రకటిస్తుంది. ఈ ధరల కంటే అధిక ధరకు ఎవరైనా విక్రయిస్తే 14500కు ఫిర్యాదు చేయొచ్చు. ఇప్పటికే ఇసుక అక్రమాలను నివారించడానికి స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఉంది. ఇసుక రీచ్‌ వద్ద మెట్రిక్‌ టన్నుకు రూ.475 చెల్లించగానే అందులో రూ.375 నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. మిగిలిన రూ.100 నిర్వహణా ఖర్చులు కింద కాంట్రాక్టర్‌కు వెళతాయి. టన్నుకు రూ.475 చొప్పున మొత్తం 2 కోట్ల మెట్రిక్‌ టన్నుల ఇసుక విలువ రూ.950 కోట్లు. ఇందులో కాంట్రాక్టు సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సింది రూ.765 కోట్లు కాగా, మిగిలిన సొమ్ము యంత్రాలు, పరికరాలు, పంపిణీ, నిర్వహణా ఖర్చుల కింద కాంట్రాక్టు సంస్థకు వెళ్తుంది. 

ప్రజలకు మేలు చేయడానికే కొత్త ఇసుక విధానం
నదుల పక్కనే ఉన్న గ్రామాల్లోనివారు సొంత అవసరాల కోసం ఎడ్ల బళ్ల ద్వారా ఉచితంగా ఇసుకను తెచ్చుకోవచ్చు. బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణాలకు, ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలకు రాయితీపై సరఫరా ఉంటుంది. గతంలో మాదిరిగా ఉచితమని చెప్పి రూ.వందల కోట్లు దోపిడీ చేసే అవకాశం లేకుండా ప్రజలకు మేలు చేయడానికే కొత్త ఇసుక విధానానికి రూపకల్పన చేశాం. కాంట్రాక్టు పొందిన సంస్థ నిబంధనల విషయంలో విఫలమైతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement