ఇంటింటికీ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ప్రోగ్రెస్ రిపోర్టు ఇదే
సాక్షి, అమరావతి: ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మేనిఫెస్టోను ఓ భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావిస్తూ అందులో చెప్పిన వాటితో పాటు ప్రజల అవసరాలను బట్టి చెప్పనివి కూడా ఏడాది కాలంలో చేసింది. ఏడాది పాలనలో నెరవేర్చిన, చేసిన అంశాలతో కూడిన ప్రోగ్రెస్ రిపోర్టుతో పాటు మేనిఫెస్టోను కూడా ధైర్యంగా ప్రజల వద్దకు పంపిస్తోంది. గత ప్రభుత్వ విశ్వసనీయతకు, ఇప్పటి ప్రభుత్వ విశ్వసనీయతకు మధ్య ఉన్న తేడా ఇదే. గత ప్రభుత్వం 2014 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలతో కూడిన మేనిఫెస్టోను గత ఎన్నికల సమయంలో ఏకంగా పార్టీ వెబ్‌సైట్ నుంచి కనిపించకుండా మాయం చేసిన విషయం తెలిసిందే.
మేనిఫెస్టోలో ఏమి చెప్పాం.. ఏడాది పాలనలో ఏమి చేశాం.. అనే వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తోంది. ఇప్పటికే 78,54,563 బుక్‌లెట్‌లను వలంటీర్లు ఇంటింటా పంపిణీ చేశారు. మిగతా బుక్‌లెట్ల పంపిణీని నాలుగు రోజుల్లో పూర్తి చేస్తామని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. మేనిఫెస్టోను ప్రజల దగ్గరకే పంపించి ఏడాది పాలనలో ఏమేం చేశాం.. ఏమి చేయలేదో ప్రజలనే చెప్పాల్సిందిగా కోరతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఆ మాట మేరకు ఏడాది పాలనలో ఏమి చేశారో చెప్పడంతో పాటు 2020–21 ఆర్థిక సంవత్సర సంక్షేమ క్యాలెండర్‌ను, మేనిఫెస్టోను ప్రజల దగ్గరకే పంపిస్తున్నారు. ఇందులో భాగంగానే ‘గుండెల నిండా జనం అజెండా’ శీర్షికతో కూడిన బుక్‌లెట్‌లో తొలియేడు – జగనన్న తోడు వివరాలను పేర్కొన్నారు. మొత్తం 129 హామీల్లో ఇప్పటికే 78 హామీలు అమలు చేయగా, మరో 35 హామీలు అమలుకు సిద్ధంగా ఉన్నాయి. 16 హామీలు అమలు కావాల్సి ఉంది. ఈ లెక్కన 90 శాతం హామీలు నెరవేర్చారు. ఇవి కాక అదనంగా చేసినవి 40 అంశాలు. ఏడాది పాలనలో నవరత్నాల ద్వారా 3.98 కోట్ల మందికి రూ.41,718 కోట్ల మేర సాయం అందించినట్లు బుక్‌లెట్‌లో స్పష్టం చేశారు.
ఇంటింటికీ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ప్రోగ్రెస్ రిపోర్ట్‌లోని సంక్షేమ క్యాలెండర్
అదనంగా చేసిన 40 అంశాల్లో ముఖ్యమైనవి ఇలా..
– ముందు చెప్పిన దాని కన్నా మిన్నగా ప్రతి రైతు కుటుంబానికి రైతు భరోసా సొమ్ము ఎనిమిది నెలలు ముందుగా.. ఏటా రూ.12,500 బదులుగా రూ.13,500 పెట్టుబడి సాయం. నాలుగేళ్లలో 50 వేలకు బదులు రూ.67,500 లబ్ధి.
– ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు–2019 దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం. మహిళల మర్యాదకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే కేసులను నాన్చకుండా 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి శిక్షపడేలా బిల్లుకు రూపకల్పన.
– ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్ధులందరికీ స్కూళ్లు తెరిచేనాటికి జగనన్న విద్యా కానుక కింద కిట్. ఇందులో మూడు జతల యూనిఫాం క్లాత్, నోట్‌బుక్స్, షూ, సాక్స్, బ్యాగు మొదలైనవి ఉంటాయి. ఇందుకు రూ.650 కోట్ల వ్యయం. 39.70 లక్షల మందికి లబ్ది.
– రూ.2,497 కోట్లతో 10,641 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఈ కేంద్రాల్లో విక్రయించే దిశగా చర్యలు.
– శనగ రైతులను ఆదుకునేందుకు రూ.300 కోట్లు విడుదల. అయిల్ పాం రైతులకు మద్దతు ధర కల్పనకు రూ.80 కోట్లు కేటాయింపు. దీని ద్వారా 1.10 లక్షల మందికి లబ్ధి.
– పొలాల్లోనే పంట కొనుగోళ్లు.
– రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.2,200 కోట్లకు పైగా ఆదా.. రూ.100 కోట్లు దాటిన ప్రతి పని జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపి ఆమోదించిన తర్వాతే టెండర్లకు పిలుపు. తద్వారా టెండర్లలో పూర్తి పారదర్శకత.
– నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు.
– ఇసుక ఇంటికే డోర్ డెలివరీ. ఈ మేరకు కొత్త ఇసుక పాలసీ ఖరారు. 1.52 కోట్ల టన్నుల ఇసుక ఉత్పత్తి. ఖజానాకు రూ.468 కోట్లు ఆదాయం.
– రేషన్, ఆరోగ్య శ్రీ, విద్యా దీవెన ఇలా ప్రతి పథకానికి ఆదాయ పరిమితి భారీగా పెంపు. తద్వారా లక్షల మందికి ప్రయోజనం. ప్రతి సంక్షేమ పథకానికి ప్రత్యేక కార్డుల జారీ.
– 36,34,861 మంది విద్యార్ధులకు మంచి రుచికరమైన భోజనం కోసం జగనన్న గోరుముద్ద కార్యక్రమానికి అదనంగా రూ.465 కోట్లు ఖర్చు.
– వ్యవసాయ మిషన్ ఏర్పాటు.
– నియోజకవర్గ స్థాయిలో రూ.53.30 కోట్ల వ్యయంతో 46 చోట్ల ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌ల ఏర్పాటు.
– గతంలో గిట్టుబాటు ధర లేని మిరప, పసుపు, ఉల్లి, చిరు ధాన్యాలకు దేశంలో ఎక్కడా లేని విధంగా కనీస గిట్టుబాటు ధరల ప్రకటన.
– పులివెందులలో అరటి పరిశోధన కేంద్రం ఏర్పాటు.
– ‘అమ్మ ఒడి’ పథకం ఇంటర్ వరకూ వర్తింపు.
– వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమానికి రూ.53.85 కోట్లు వ్యయం.
– కొత్తగా 108, 104 అంబులెన్స్‌లు 1088 కొనుగోలు.
– ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇప్పుడున్న 11 మెడికల్ కాలేజీలకు అదనంగా మరో 16 కాలేజీల ఏర్పాటు.
– పారిశుద్ధ్య కార్మికుల వేతనం ఆసుపత్రుల్లో రూ.16 వేలకు, మున్సిపాలిటీల్లో రూ.18 వేలకు పెంపు.
– 108, 104 డ్రైవర్లు, టెక్నిషియన్ల వేతనాలు పెంపు.
– ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో అందుబాటులో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్టాండర్డ్స్‌తో 500 రకాల మందులు.
– బోధకాలు, పక్షవాతం, ప్రమాదాల కారణంగా వీల్‌చైర్ లేదా మంచానికే పరిమితమైన వారికి ప్రతి నెలా రూ.5,000 ఆర్థిక సాయం.
– క్యాన్సర్‌కు సంబంధించిన అన్ని రకాల వ్యాధులు ఆరోగ్య శ్రీ పరిధిలోకి. లెప్రసీ రోగులకు ప్రతి నెలా రూ.3000
– డాక్టర్ వైఎస్సార్ టెలి మెడిసిన్ ప్రారంభం. 14410 టోల్ ఫ్రీ నంబర్‌కు మిస్ట్ కాల్ ఇస్తే ఫోన్‌లోనే వైద్య సేవలు. ఇంటి వద్దకే మందులు.
– ఎమ్‌ఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకంగా రూ.963 కోట్లు.. ఫిక్స్‌డ్ విద్యుత్ చార్జీలు రూ.188 కోట్లు మాఫీ.
పేదల ఆర్థిక స్థితిగతులు మార్చిన నవరత్నాలు
– రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన అర్హులకు ఎటువంటి వివక్ష లేకుండా ప్రభుత్వం నవరత్నాల ఆర్థిక ఫలాలను అందించింది. ఈ నెల 13వ తేదీ వరకు రాష్ట్రంలోని 4.82 కోట్ల లబ్ధిదారులకు రూ.59,425 కోట్ల నగదును నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది.
– నవరత్నాల లబ్ధికి ఏకైక ప్రమాణికం అర్హతే. కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడలేదు. దీంతో అన్ని కులాలకు చెందిన అఖరుకు అగ్ర వర్ణాల్లోని పేదలకు కూడా నవరత్నాల ద్వారా ఆర్థిక ప్రయోజనం చేకూరింది.
– ఈ ప్రయోజనం కూడా పైసా లంచం లేకుండా, పారదర్శకంగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే చేరడం రాష్ట్రంలో ఇదే తొలిసారి.
– ఈ ఏడాది మార్చి నుంచి కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయినప్పటికీ చెప్పిన మాట ప్రకారం నవరత్నాల ద్వారా ఆర్థిక ఫలాలను లబ్ధిదారులకు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుంది.
– ఈ పథకాలన్నీ పేద వర్గాల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మార్చి.. మెరుగైన జీవనానికి కొండంత అండగా నిలుస్తున్నాయి.
జగన్ పాలన నభూతో నభవిష్యత్
రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు పట్టిన ఏడాదిలోనే వైఎస్ జగన్ ఎవరూ వూహించని రీతిలో ప్రజల ముంగిటకే సుపరిపాలన అందించిన ఘనత పొందారు. వైస్సార్‌సీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే కనీసం ఐదు సంవత్సరాలు పడుతుంది. అలాంటిది 129 హామీల్లో ఇప్పటికే 90.80 శాతం అమలు చేసి 3.98 కోట్ల మందికి లబ్ధి కలిగించడం అంటే మాటలు కాదు. గ్రామ సచివాలయ వ్యవస్థ దేశ చరిత్రలోనే నూతన అధ్యాయాన్ని సృష్టించింది. ఎన్నో విషయాల్లో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అవుతోంది. కలయా నిజమా అనే చందంగా రాష్ట్రంలో అందుతున్న జన రంజక పాలన నభూతో నభవిష్యత్.
– ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయి, పూర్వ ఉప కులపతి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, శ్రీకాకుళం.
Comments
Please login to add a commentAdd a comment