పీటీ వారంట్‌! | Quid Pro Quo case of Inner Ring Road alignment: Chandrababu Naidu named accused 1 by Andhra Pradesh CID | Sakshi
Sakshi News home page

పీటీ వారంట్‌!

Published Tue, Sep 12 2023 3:38 AM | Last Updated on Tue, Sep 12 2023 7:23 AM

Quid Pro Quo case of Inner Ring Road alignment: Chandrababu Naidu named accused 1 by Andhra Pradesh CID - Sakshi

అటాచ్‌ చేయనున్న ఆస్తుల వివరాలు..

  •  ఏ–1 చంద్రబాబు కరకట్ట నివాసం (లింగమనేని రమేశ్‌ కుటుంబం పేరిట ఉన్న ఈ నివాసాన్ని చంద్రబాబు క్విడ్‌ ప్రో కో కింద పొందారు)
  •  ఏ–2 పొంగూరు నారాయణ కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీల పేరిట అమరావతిలో ఉన్న  75,888 చదరపు గజాల ఇళ్ల స్థలాలు.
  •  ఏ–2 నారాయణ భార్య పొత్తూరి ప్రమీల, కుటుంబ సభ్యులు, బంధువులు రాపూరి సాంబశివరావు, ఆవుల మునిశంకర్, వరుణ్‌ కుమార్‌ ఇప్పటివరకు పొందిన కౌలు మొత్తం రూ.1,92,11,482. 

సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో యథేచ్ఛగా సాగిన కుంభకోణాలపై దృష్టి సారించిన సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ అక్రమాల కేసులో మాజీ సీఎం చంద్రబాబును విచారించేందుకు పీటీ వారంట్‌ కోరుతూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో సోమవారం పిటిషన్‌ దాఖలు చేసింది.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణంలో అరెస్ట్‌ అయిన ప్రధాన నిందితుడు చంద్రబాబు రాజమ­హేం­ద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన్ను ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ అక్రమాల కేసులో కూడా అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఉందని సీఐడీ భావిస్తోంది. ఈ కేసులో పూర్తి ఆధారాలతో చంద్రబాబు, నారాయణ, లోకేశ్‌తోపాటు వారి బినామీలైన లింగమనేని రమేశ్, లింగమనేని రాజశేఖర్, ఆర్కే హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ అంజినీ కుమార్‌లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

ఈ కేసులో ఇంతవరకు వారిని అరెస్ట్‌ చేయలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబును ఇందులోనూ అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఉందని సీఐడీ నిర్ణయించింది. ఇప్పటికే రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబును ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కుంభకోణం కేసులో కూడా రిమాండ్‌ ఖైదీగా పరిగణించాలని న్యాయస్థానాన్ని కోరాలని నిర్ణయించి పీటీ వారంట్‌ దాఖలు చేసింది.

అందుకు న్యాయస్థానం అనుమతిస్తే ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అక్రమాల కేసులో కూడా చంద్రబాబు అరెస్టై జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నట్లుగా పరిగణిస్తారు. ఆ కేసులో కూడా ఆయన్ని విచారించేందుకు తమ కస్టడీకి కోరనుంది. దీంతో కేసు దర్యాప్తులో మరింత పురోగతి సాధించవచ్చని సీఐడీ భావిస్తోంది. 

చంద్రబాబు, చినబాబు భూ దోపిడీ
టీడీపీ హయాంలో జరిగిన భారీ కుంభకోణాలకు మరో ఉదాహరణ అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ ప్రాజెక్టు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో ఇష్టాను­సారంగా మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారు. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రులు లోకేశ్, పొంగూరు నారాయణ కలసి అసైన్డ్‌ భూములను కొల్లగొట్టారు.

వారి బినామీ లింగమనేని రమేశ్‌ క్విడ్‌ ప్రోకోకు పాల్పడ్డారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ను ఇష్టానుసారంగా మెలికలు తిప్పి సింగపూర్‌ కన్సల్టెన్సీ రూపొందించినట్లు మభ్యపుచ్చారు.అప్పటివరకు రూ.177.50 కోట్లుగా ఉన్న తమ 148 ఎకరాల మార్కెట్‌ విలువను అమాంతం రూ.877.50 కోట్లకు పెంచుకున్నారు. అమరావతి రాజదాని నిర్మాణం పూర్తయితే ఆ భూముల మార్కెట్‌ విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు పెరి­గేలా పథకం వేశారు.

ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ను ఆనుకుని హెరిటేజ్‌ ఫుడ్స్‌ కొనుగోలు చేసిన భూములు వీటికి అదనం. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పు కుంభకోణంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కూడా చంద్రబాబు వాటా కల్పించారు. ఆ రోడ్డు అలైన్‌మెంట్‌కు సమీపంలోనే ఆయనకు 2.4 ఎకరాల భూమి ఉండటం గమనార్హం.  లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను కొనుగోలు చేసినట్లు చూపించి ల్యాండ్‌ పూలింగ్‌ నుంచి మినహాయింపు కల్పించారు. 

ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ,ఏ–6 లోకేశ్‌
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు భూ కుంభకోణాన్ని సిట్‌ పూర్తి ఆధారాలతో బట్టబయలు చేసింది. ఈ కేసులో  ప్రధాన నిందితుడి (ఏ–1)గా చంద్రబాబు, ఏ–2గా నారాయణ, ఏ–6గా లోకేశ్‌పై కేసు నమోదు చేసింది. చంద్రబాబు, నారాయణ బినామీలు లింగమనేని రమేశ్‌ను ఏ–3గా, లింగమనేని రాజశేఖర్‌ ఏ–4గా, రామకృష్ణ హౌసింగ్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ అంజని కుమార్‌ను ఏ–5గా పేర్కొంది. 

చంద్రబాబు, నారాయణ ఆస్తుల అటాచ్‌ 
ఈ కేసులో చంద్రబాబు, నారాయణ బినామీల ద్వారా పొందిన ఆస్తులు, బ్యాంకు ఖాతాలను అటాచ్‌ చేయాలని సీఐడీ నిర్ణయించింది. ఆ మేరకు సీఐడీ ప్రతిపాదనను ఆమోదిస్తూ హోంశాఖ ఉత్త­ర్వులు జారీ చేసింది. క్విడ్‌ ప్రోకో కింద లింగమనేని రమేశ్‌ నుంచి చంద్రబాబు పొందిన కరకట్ట నివాసంతోపాటు నారాయణ కుటుంబ సభ్యుల స్థిర, చరాస్తులను అటాచ్‌ చేయనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement