
బ్యారేజ్ నుంచి తూర్పు డెల్టాకు విడుదలవుతున్న సాగునీరు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/ధవళేశ్వరం: సాగు నీటి ఎద్దడి లేకుండా రబీ రైతు గట్టెక్కేసినట్టే. ప్రభుత్వ సంకల్పానికి గోదారమ్మ తోడైంది. సహజ జలాలు తక్కువగా ఉండటంతో పూర్తి ఆయకట్టుకు సాగునీరందదని ఆందోళన చెందినా ప్రభుత్వ పట్టుదలకు పరిస్థితులు సానుకూలంగా కలిసొచ్చాయి. దీంతో రైతులు గుండె నిండా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి 10న కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నీటి మట్టం 5.50 అడుగుల కనిష్టానికి నమోదైంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిని డెల్టాల సాగు కోసం విడిచిపెట్టారు.
అరకొరగా సాగునీరు అందుతోందని అందోళన చెందుతోన్న సమయంలో అఖండ గోదావరి ఎగువన వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలతో తెలంగాణాలోని లక్ష్మీ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో జనవరి 14 నాటికి బ్యారేజ్ వద్ద నీటి సామర్థ్యం పూర్తి స్థాయికి చేరుకుంది. అప్పటివరకూ ఆందోళన చెందిన రైతులు ఉపసమనం చెందారు. జనవరి నెలాఖరుకు సాగు వసరాలకు నిల్వలు సరిపోవడంతో ఈ సారి అనూహ్యంగా మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. గడచిన పదేళ్లలో జనవరిలో మిగులు జలాలను విడుదల చేయడం తొలిసారిగా బ్యారేజీ రికార్డులకు ఎక్కింది. ఫలితంగా నెలంతా సాఫీగానే సాగునీరు సరఫరా సాగింది.
ఫిబ్రవరిలోనే ఏర్పడిన ధీమా
ఫిబ్రవరి 13 నుంచి నీటి మట్టం తగ్గడంతో మరోసారి రబీ రైతులు టెన్షను పడ్డారు. సరిగ్గా ఇదే సమయంలో బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురిశాయి. ఆ వర్షాలతో గోదావరి జలాలు కాటన్ బ్యారేజ్‌కి చేరాయి. ఫలితంగా ఫిబ్రవరి నెలంతా సాగునీటికి ఇబ్బంది లేకుండా నీరు విడుదలైంది. ప్రభుత్వ భరోసాతో రైతులు ధైర్యంగా చేపట్టిన పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ రబీకి సాగునీటి కొరత లేదనే విషయం దాదాపు ఖాయమైంది. సాగు, తాగు నీటికి మొత్తం 94టీఎంసీలు అవసరమని ప్రాథమికంగానే నీటిపారుదలశాఖాధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 62.82 టీఎంసీలు ఉభయగోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రబీ సీజన్ ముగిసే నాటికి మరో 32 టీఎంసీల నీరు విడుదలచేస్తే సరిపోతుంది.
అవసరమైతే రెడీగా సీలేరు నీరు
విశాఖ జిల్లా సీలేరు నుంచి మన డెల్టాలకు 38 టీఎంసీలు వినియోగించుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు 9.09 టీఎంసీలు మాత్రమే వినియోగించుకున్నాం. భవిష్యత్ అవసరాల కోసం సీలేరులో 29 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. అంటే ప్రభుత్వం రబీ సాగు ప్రణాళిక ప్రకటన రోజు ఏమని చెప్పిందో దానిని నిజం చేసి చూపించిందని చెప్పవచ్చు. ఇందుకు ప్రకృతి కూడా తోడ్పాటునందించడంతో ఎలాంటిì ప్రతిబంధకాలు లేకుండా రబీ గట్టెక్కినట్టేనని అధికారులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఈ రబీలో 8,96,533 లక్షల ఎకరాలకు 87టీఎంసీల సాగు నీరు అవసరమని ఇరిగేషన్ అధికారులు తొలుత అంచనా వేశారు. సాగు, తాగు నీటికి మరో 7 టీఎంసీలతో కలిపి మొత్తం 94 టీఎంసీలు అవసరమని లెక్కతేల్చారు. సోమవారం నాటికి మూడు డెల్టాలకు కలిపి బ్యారేజ్ నుంచి 62.82 టీఎంసీలు విడుదల చేశారు. తూర్పు డెల్టాకు 18.37టీఎంసీలు, మధ్య డెల్టాకు 12.01టీఎంసీలు, పశ్చిమ డెల్టా 32.44టీఎంసీలు విడుదలయ్యాయి.
రబీకి పుష్కలంగా సాగునీరు
రబీలో ముందస్తుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ప్రతి ఎకరాకు సాగు నీరందించగలగుతున్నాం. అవసర సమయంలో ఎగువన వర్షాలు కురవడం, పోలవరం ప్రాజెక్టులో నీరు కూడా ఈ సీజన్‌లో కలిసి వచ్చింది. వ్యవసాయ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయడంతో ఇది సాధ్యమైంది. మార్చి నెలలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగునీరందిస్తాం.
– పి.రాంబాబు, సూపరింటెండెంట్ ఇంజినీర్, నీటి పారుదల శాఖ, ధవళేశ్వరం
Comments
Please login to add a commentAdd a comment