సాక్షి, విజయవాడ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతోంది. క్రమంగా బలపడి 24గంటల్లో తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ వాయువ్యం దిశగా పయనించి సోమవారం రాత్రి నర్సాపురం-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు.వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
సోమవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల మోస్తారు నుంచి తేలిక వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మంగళవారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి గంటకు 55-75 కి.మీ వేగంతో గాలుల వీచే అవకాశం ఉందని విశాఖ జిల్లాకు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మత్స్య కారులు వేటకు వెళ్లకుండా చూడాలని అధికారులను జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ ఆదేశించారు. వాయుగుండం నేపథ్యంలో కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. సహాయం కోసం కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నెంబర్లు: 0891-2590102, 0891-2590100 ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు. తీరప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి, తగినజాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అటు తెలంగాణలోనూ వాయుగుండం ప్రభావం కనిపిస్తోంది. హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment