సాక్షి, తూర్పు గోదావరి: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో ప్రథమ ముద్దాయి.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడి తొలిరోజు సీఐడీ కస్టడీ విచారణ Interrogation ముగిసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బాబును.. శనివారం మొత్తంగా ఏడు గంటలపాటు ప్రశ్నించింది సీఐడీ డీఎస్పీ ధనుంజయుడి నేతృత్వంలోని బృందం. అలాగే.. కోర్టు ఆదేశాల ప్రకారం నిర్ణీత సమయంలోనే విచారణ ముగించిన సీఐడీ.. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేసింది.
రాజమండ్రి సెంట్రల్ జైలులోని కాన్ఫరెన్స్ హాల్‌లో చంద్రబాబు విచారణ కొనసాగింది. శనివారం ఉదయం, మధ్యాహ్నాం రెండు దఫాలుగా ప్రశ్నించారు అధికారులు. ఫస్ట్ హాఫ్‌లో దాదాపు గంటన్నరపాటు చంద్రబాబును ప్రశ్నించారు అధికారులు. భోజన విరామంతో పాటు విచారణలో మొత్తం నాలుగుసార్లు బ్రేకులు ఇచ్చారు. బాబు వయసు రీత్యా ఒక వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచారు. మొత్తం 120 ప్రశ్నలతో విచారణకు వెళ్లిన సీఐడీ.. యాభై ప్రశ్నలను సంధించినట్లు తెలుస్తోంది.
సీమెన్స్ ఒప్పందం, లావాదేవీలపైనే ప్రధానంగా చంద్రబాబును ప్రశ్నించింది సీఐడీ. స్కిల్ స్కాంలో కుట్ర కోణం, నిధుల విడుదల, షెల్ కంపెనీలు.. సాక్ష్యాధారాల మాయంపైనా సీఐడీ ప్రశ్నల వర్షం గుప్పించినట్లు తెలుస్తోంది. డీపీఆర్ లేకుండా ఎందుకు ప్రాజెక్టు ఓకే చేయించారు?. ఫైనాన్స్ సెక్రటరీ వద్దన్నా.. నిధులు ఎందుకు విడుదల చేశారు?. యూపీ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్‌ను డిప్యూటీ సీఈవోగా ఎందుకు చేశారు?.. లాంటి ప్రశ్నలు గుప్పించినట్లు సమాచారం.
సుమన్ బోస్‌తో చంద్రబాబు రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారా?. ఆయనతో గంటా సుబ్బారావుకు జరిగిన ఈమెయిల్స్ వివరాలేంటి?. సుబ్బారావుకు నాలుగు పదవులు కట్టబెట్టడం వెనుక మతలబేంటి?. ఈ స్కామ్‌లో బాబుతో పాటు అచ్చెన్నాయుడి పాత్ర ఏంటి?. మూడు వేల కోట్ల రూపాయల గ్రాంట్ ఇన్ ఎయిడ్.. డిస్కౌంట్‌గా ఎందుకు మారింది?. రూ. 3 వేల కోట్ల గురించి అడగొద్దని అధికారుల్ని ఎందుకు దబాయించారు? లాంటి ప్రశ్నలూ సంధించినట్లు సమాచారం. అయితే వాటిని ఆయన ఎలాంటి ప్రశ్నలు సంధించారనేది సీఐడీ కోర్టుకు నివేదిక సమర్పించిన తర్వాతే తెలిసేది.
బాబు తరపు లాయర్లు దమ్మలపాటి శ్రీనివాస్, సుబ్బారావుల సమక్షంలో.. చంద్రబాబు స్టేట్‌మెంట్‌ను పకడ్బందీగా రికార్డ్ చేశారు సీఐడీ అధికారులు.
మరోవైపు విచారణ నేపథ్యంలో సెంట్రల్ జైలు దగ్గర పోలీసుల అలర్ట్ అయ్యారు. విచారణ జరిగాక.. స్థానిక గెస్ట్‌హౌజ్‌కి వెళ్లింది సీఐడీ అధికారుల బృందం. రేపు(సెప్టెంబర్ 24, ఆదివారం) కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాల్‌లో చంద్రబాబును విచారించనుంది సీఐడీ.
ఇదీ చదవండి: ఫస్ట్ టైం.. ‘బ్లూజీన్’తో కోర్టులో హాజరైన చంద్రబాబు
Comments
Please login to add a commentAdd a comment