ఈనాడు అధినేత రామోజీరావు బాధ అర్ధం చేసుకోదగిందే. తన కంపెనీల గుట్టు, మట్లు అన్ని అధికారులకు తెలిసిపోతాయన్న ఆయన ఆందోళన గమనించదగిందే. ఏపీ సీఐడి అధికారులు బ్రహ్మయ్య అండ్ కో ఆడిట్ కంపెనీ నుంచి మార్గదర్శి చిట్ ఫండ్‌కు సంబంధించిన సమాచారమే కాకుండా, డాల్ఫిన్స్ హోటల్స్, ఉషోదయ ఎంటర్ ప్రైజెస్, ఉషోదయ పబ్లికేషన్స్, ఈటివి, మార్గదర్శి ఇన్వెస్టెమెంట్ అండ్ లీజింగ్ కంపెనీ లిమిటెడ్, ఎల్.చిమన్ లాల్ ఇండస్ట్రీలకు చెందిన సమాచారం సీఐడీ తీసుకువెళ్లిందని బ్రహ్మయ్య అండ్ కంపెనీ తెలంగాణ హైకోర్టుకు సమర్పించిన అనుబంధ పిటిషన్‌లో తెలిపింది.
చట్ట ప్రకారం కేసుతో సంబంధం ఉన్న సమాచారాన్నే సీఐడీ అధికారులు తీసుకువెళ్లాలని, దానికి విరుద్దంగా సంబంధం లేని వాటిని, ఇతర ఖాతాదారుల సమాచారాన్ని తీసుకువెళ్లారని ఈ సంస్థ తెలిపింది. ఇలా తీసుకువెళ్లిన సమాచారాన్ని కాపీ చేయకుండా తిరిగి ఇచ్చేలా ఆదేశించాలని ఈ సంస్థ కోరింది. లేనిపక్షంలో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కింది. నిజమే. ఒక్కోసారి ఆయా సంస్థలలో సమాచారం బయటకు వస్తే కొంత నష్టం జరగవచ్చు. అది ఎప్పుడు జరుగుతుంది? ఆ సంస్థల ఆర్దిక లావాదేవీలలో ఏవైనా అవకతవకలు ఉంటే, అవి అందరికి తెలిసిపోతే, ముఖ్యంగా ప్రభుత్వానికి తెలిస్తేనే కదా నష్టం జరిగేది.
ఆర్ధిక విషయాలు కాకుండా ఏదైనా కెమికల్ ఫార్ములానో, మరో రహస్య సమాచారాన్నో లీక్ చేస్తే తప్పు అవుతుంది. ఆడిటింగ్ సంస్థ పని చేసేది ఆయా సంస్థలలో ఉన్న తప్పు, ఒప్పులను కనిపెట్టి వాటిని సంబంధిత కంపెనీలకు తెలియచేసి సరిచేయడానికే కదా! ఆ తర్వాత ప్రభుత్వానికి ఆ ఆడిట్ నివేదికలు సమర్పించడానికే కదా! మరి అలాంటప్పుడు ఇందులో ఉండే రహస్యాలేమిటన్నది అర్ధం కాదు. ఒక్కోసారి ప్రైవేటు కంపెనీలతో ఆడిట్ సంస్థలు కుమ్మక్కు అవుతుంటాయన్న అభియోగాలు ఉన్నాయి. సత్యం రామలింగరాజు కేసులో ఒక ఆడిట్ సంస్థపై కేంద్ర ప్రభుత్వం చర్యలు కూడా తీసుకున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. నిజానికి బ్రహ్మయ్య అండ్ కంపెనీ చాలాకాలంగా ఉన్న సంస్థే.
పేరు, ప్రఖ్యాతులు ఎన్నదే. అయినా ఆ కంపెనీవారు రామోజీరావుకు చెందిన మార్గదర్శి కేసులో కాని, ఆయనకు చెందిన ఇతర కంపెనీల సమాచారం విషయంలో ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నది తెలియదు. మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో అవకతవకలు జరుగుతున్నాయన్నది సీఐడీ అధికారుల ఆరోపణ. అందులో వాస్తవం ఉందా?లేదా? అన్నదాని గురించి రామోజీరావు కాని, ఆయన కోడలు శైలజకాని, ఆయన తరపున లాయర్లు కాని ఎందుకు చెప్పడం లేదు. ఎంతసేపు ఎవరూ ఫిర్యాదు చేయలేదు కనుక తమ జోలికి రాకూడదని డిమాండ్ చేయడం సరైన చర్యేనా అన్న ప్రశ్న వస్తుంది. ఉదాహరణకు ఆదాయపన్ను శాఖకు ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా, చాలా పెద్ద,పెద్ద కంపెనీలపై దాడులు, సోదాలు జరుపుతుంటుంది.
అదే విధంగా సీబిఐ, ఈడీ వంటి సంస్థలు కూడా తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంటాయి. తద్వారా ఆయా సంస్థలు అక్రమాలకు పాల్పడకుండా చూడడం వారి విధి. అదే విధంగా చిట్ ఫండ్ చట్టాన్ని పర్యవేక్షించే రిజిస్ట్రేషన్ అధికారులు కూడా తమ బాధ్యత నిర్వహిస్తుండాలి. నిజంగానే ఆ సోదాలలో ఎలాంటి అక్రమ లావాదేవీలు కనిపించలేదనుకోండి. అప్పుడు ఆ సంస్థ క్రెడిబిలిటి పెరుగుతుంది కదా!.
గతంలో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏ సహ పెట్టుబడిదారుడు ఫిర్యాదు చేయకపోయినా, రాజకీయంగా ఎవరో చేసిన ఆరోపణ ఆధారంగా విచారణకు హైకోర్టు ఎలా ఓకే చేసింది? ఆ తర్వాత ఇష్టారాజ్యంగా సీబిఐ ఈడీ వంటివి ఎలా సోదాలు, దాడులు నిర్వహించాయి. అయినా ఆ సందర్భంలో ఒక్క చోట కూడా వీరికి ఎలాంటి అక్రమ లావాదేవీల ఆధారాలు దొరకకపోబట్టే కదా క్విడ్ ప్రోకో అని కొత్తది కనిపెట్టి రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాల ఆధారంగా కేసులు పెట్టింది. దానివల్ల ఏపీకి పరిశ్రమలు రావడానికి భయపడే పరిస్థితిని కాంగ్రెస్, తెలుగుదేశంలు కలిసి సృష్టించాయన్న ఆరోపణ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే కదా!
ఆ రోజుల్లో జగన్ గాని, ఆయన తరపు మనుషులు కాని తమ కంపెనీలలో సోదాలు చేయవద్దని ఎక్కడా చెప్పలేదు కదా! వారు పెట్టిన కేసులపై పోరాడుతున్నారే కాని ఏదో రహస్య సమాచారం తీసుకువెళ్లారని గగ్గోలు పెట్టలేదు కదా!. జగన్ కేసుల సమయంలో కాని, ఇతరత్రా ఆయా కేసుల విచారణలో కాని కూపీ లాగినట్లు, పరిశోధించి కనిపెట్టినట్లు రాసే ఈనాడు పత్రిక తనవరకు వచ్చేసరికి ఎందుకు ఇంతగా భయపడుతోంది. ప్రభుత్వపరంగా ఏ చిన్న విషయం దొరికినా, దానిని చిలవలు పలవలు చేసి బ్యానర్లు కట్టి కథనాలు ఇచ్చే ఈనాడు దినపత్రిక తను మాత్రం గోప్యంగా ఉండాలని అనుకుంటోంది. తన రహస్య సమాచారం ఎవరికి ఎందుకు తెలియకూడదని చెబుతోంది.
ఇవన్ని కాదు. ఎంతసేపు తమపై ఫిర్యాదు చేయలేదనో, మరొకటనో వాదించే బదులు, తమ సంస్థలో ఏ ఒక్క అవకతవక జరగలేదని సవాల్ చేసి ఎందుకు చెప్పడం లేదు?తాజాగా సీఐడీ బ్రహ్మయ్య అండ్ కంపెనీలో సేకరించిన సమాచారం ప్రకారం కోట్లాది రూపాయల చెక్ లు ,నగదు కేవలం రికార్డులలోనే చూపారు తప్ప, వాటిని ఎక్కడ జమ చేసింది? అసలు నిజంగానే ఆ చెక్కులు ఉన్నాయా?లేవా? ఒకవేళ ఉంటే వాటిని ఏ ఇతర సంస్థలలోకి జమ చేశారు? అన్న వివరాలు లేవని వార్తలు వచ్చాయి. వీటికి సంబంధించి ఈనాడులో వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది కదా!
అలాగే మార్గదర్శి బ్రాంచ్‌ల నుంచి చిట్స్ డబ్బును హైదరాబాద్ కేంద్ర కార్యాలయానికి తరలించవచ్చా?. అలా తరలించడం తప్పు అయితే దానికి రామోజీరావు లేదా ఆయన కోడలు శైలజ ఇచ్చే సమాధానం ఏమిటి?తప్పు కాకపోతే అదే విషయం చెప్పి ఉండవచ్చు. ఒకవేళ సీఐడీ తొందరపడితేనో, చట్ట విరుద్దంగా వ్యవహరిస్తేనో, ఆ అధికారులే చిక్కులలో పడతారు కదా?. రామోజీరావుకు ఆయా వ్యవస్థలలో, కేంద్ర స్థాయిలో ఉన్న పరపతి తెలియనిదా? పైగా ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వార్త ప్రచారం అయింది. రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు కుటుంబంలో జరిగిన ఒక ఫంక్షన్ కు న్యాయవ్యవస్థలోని అత్యున్నత అధికారితో సహా సుమారు పాతికమంది న్యాయమూర్తులు హాజరయ్యారట. అంత మాత్రాన వారికి తప్పు ఆపాదించజాలం.
కాని ప్రజలలో ఒక అపోహ ఏర్పడే అవకాశం ఉంటుంది కదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏపీకి సంబంధించిన మార్గదర్శి కేసును తెలంగాణ హైకోర్టు విచారించడం కూడా న్యాయవర్గాలను ఆశ్చర్యపరచిందట. తనకు ఉన్న లాయర్ల శక్తితో వీరిపై ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశాలు సాధించగలిగారు కదా? అలాగే బ్రహ్మయ్య అండ్ కంపెనీ కేసు విషయంలో కూడా యధాతధ స్థితి ఆదేశాలు వచ్చాయి. కాకపోతే అప్పటికే సిఐడి తన పని ముగించుకుని తాను సేకరించిన ఆధారాలను కోర్టులో సబ్మిట్ చేసిందట. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ న్యాయవాది గోవింద రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.
టైమ్ ముగిసిన తర్వాత కూడా మార్గదర్శి కేసును హైకోర్టు ఎలా విచారిస్తుందని, అదే ఒక సామాన్య మానవుడి కేసు అయితే ఇలా చేస్తారా అని అంటూ ,దీనివల్ల మార్గదర్శికో నీతి, సామాన్యుడికో నీతి అని ప్రజలు భావించే అవకాశం ఉందని అన్నారని వార్తలు వచ్చాయి. రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణకుమార్ అదే విషయం పదే, పదే చెబుతుంటారు. రామోజీరావు కేసుల్లో ప్రతివాదికి అవకాశం ఇవ్వకుండా కూడా కొన్నిసార్లు కోర్టులు కొట్టివేశాయట. రామోజీకి దేశంలో ఉన్న పలుకుబడి అటువంటిదని ఆయన అభిప్రాయపడుతుంటారు. అలాంటి రామోజీరావును ఎ 1గాను, ఆయన కోడలు శైలజను ఎ 2 గాను అంటే నిందితులుగా చేసి కేసు పెట్టడం అంటే ఏపీ ప్రభుత్వానికి ఎంత గట్స్ ఉండాలని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
చదవండి: తన్నారు.. తిన్నారు.. చంద్రబాబు, రామోజీరావు అసలు బండారం
మరి ఇందులో సీఐడీ ఎంత పురోగతి సాధిస్తుంది? మార్గదర్శి కేసును లాజికల్ ముగింపునకు ఎలా తీసుకువెళుతుందన్నది అత్యంత ఆసక్తికరం అయిన ఘట్టం అవుతుంది. ఈ కేసులో బహుశా మరిన్ని సంచలనాలు వెలుగు చూడవచ్చని ప్రచారం జరుగుతోంది. నిత్యం ప్రభుత్వం, ఆయా సంస్థలు పారదర్శకంగా ఉండాలని నీతులు చెప్పే రామోజీరావు తన వరకు వచ్చే సరికి ఎందుకు ఇంత గోప్యం పాటిస్తున్నారా?. ఇందులో ఉన్న చిదంబర రహస్యం ఏమిటో?
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment