చెప్పేటందుకే నీతులు ఉన్నాయి.. అని ఒక సామెత. సరిగ్గా ఈనాడు, మార్గదర్శి గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు బాగా అతుకుతుంది. దేశంలో అందరికి ఆయన నీతులు చెబుతారు. భారీ సంపాదకీయాలు రాస్తారు. కాని తాను మాత్రం ఆ నీతులకు అతీతం అని భావిస్తారు.తనకు రాజ్యాంగం ,చట్టాలుఏవీ వర్తించవు అని నమ్ముతారు. మార్గదర్శి చిట్ ఫండ్ కు సంబందించి కొన్ని నెలలుగా సాగుతున్న ప్రహసనాన్ని చూడండి. రామోజీ అండ్ కో విన్యాసాలు గమనించండి. చివరికి రామోజీరావు మొదటి నిందితుడుగా, ఆయన కోడలు శైలజ రెండో నిందితురాలిగా సీఐడీ కేసు నమోదు చేసే పరిస్థితి తెచ్చుకున్నారు. అంతా పారదర్శకంగా ఉండాలని చెప్పే రామోజీ తాను మాత్రం అలా ఉండరని మార్గదర్శి పరిణామాలు రుజువు చేశాయి.
రికార్డు చూపించేది లేదని మార్గదర్శి మొరాయించిందట!
ఏపీలో చిట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ లు చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ విభాగం రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు చేపట్టి పలు అక్రమాలను గుర్తించింది. నిబంధలనకు విరుద్దంగా వ్యవహరిస్తున్నట్లు, చివరికి డిపాజిట్లు కూడా సేకరిస్తున్నట్లు కనిపెట్టింది. మార్గదర్శి సంస్థలో ఇన్ని అవకతవకలు ఉన్నందునే రికార్డులను రహస్యంగా ఉంచుతున్నారన్న సందేహం సహజంగానే వస్తుంది. ఏ తప్పు చేయకపోతే తెరచిన పుస్తకం మాదిరి ఏ రికార్డు కావాలంటే వాటిని తీసుకోండని మార్గదర్శి అధికారులు చెప్పి ఉండాలి కదా? మిగిలిన చిట్ పండ్ కంపెనీలు కొన్ని నెలల క్రితం రిజిస్ట్రేషన్ విభాగం తనిఖీలకు వచ్చినప్పుడు అధికారులు ఏ రికార్డు కోరితే దానిని చూపించారట.
కాని ఒక్క మార్గదర్శి మాత్రం తాను ఎలాంటి రికార్డు చూపించేది లేదని మొరాయించిందట. అయితే మాత్రం అధికారులు వదలిపెడతారా? వారు మార్గదర్శి కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్ లో ఉంటే అక్కడకు వెళ్లి కొన్ని రికార్డులు పరిశీలించారు. మార్గవర్శి నిర్వహణలో జరుగుతున్న పలు లోపాలు, అక్రమాలను గుర్తించారు. ఆ మీదట వారు సీఐడీ కి ఫిర్యాదు చేయడం ,ఈ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగి విచారణ చేపట్టి రామోజీ, ఆయన కోడలితో సహా పలువురిని నిందితులని ప్రకటించింది. దీనికి సంబంధించిన వార్తల కవరేజీని గమనిస్తే సాక్షిలో స్పష్టంగా సీఐడీ విడుదల చేసిన ప్రకటనలోని అంశాలన్నిటిని పూర్తిగా తెలియచేసి, పూర్వాపరాలను వివరించింది.
అలాగే మరుసటి రోజు మార్గదర్శిలో జరుగుతున్న అవకతవకల వివరాలను ప్రజల ముందు ఉంచింది. అదే ఈనాడు దినపత్రికలో మాత్రం హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి సీఐడీ అదికారులు మార్గదర్శిలో సోదాలు చేపట్టారని ప్రదాన కధనంగా ఇచ్చింది.రెండో రోజు కూడా మార్గదర్శి మేనేజర్ల అరెస్టు వార్తలో సీఐడీ అధికారుల తనిఖీలు, ఒత్తిడులు అనే కదనాన్ని ఇచ్చింది కాని, అసలు సీఐడీ చేస్తున్న ఆరోపణలలోని నిజానిజాలేమిటి అన్నదానికి జోలికి వెళ్లలేదు. హైకోర్లు ఆదేశాలను అతిక్రమించి ఉంటే దానిపై మార్గదర్శి కోర్టుకు ఎటూ వెళుతుంది. అక్కడ ఏమి జరుగుతుందన్నది వేరే విషయం. కాని సీఐడీ గుర్తించి అక్రమాల గురించి ఎందుకు మార్గదర్శి జవాబు ఇవ్వలేదో తెలియదు.
పరువు పోతుందని రామోజీ భయపడ్డారా?
ప్రత్యేకంగా అడ్వర్టైజ్ మెంట్ ఇస్తారేమో తెలియదు.శనివారం నాడు పత్రికలో మార్గదర్శి ఆఫీస్ లలో సీఐడీ అదికారులు ఇలా సోదాలు చేశారు..అలా చేశారు.. అంటూ రాసి, చివరిలో మాత్రం సీఐడీ ప్రకటనలోని సారాంశాన్ని ఒక చిన్నపేరాగా ఇచ్చారు. రామోజీరావు,శైలజ, మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లపై కేసులు నమోదు అయ్యాయన్న సంగతిని వెనక్కి నెట్టేశారు. వారి ఇబ్బంది అర్ధం చేసుకోవచ్చు. దానినే హైలెట్ చేస్తే రామోజీ కుటుంబ పరువు దెబ్బతింటుందని భయపడి ఉండవచ్చు.అదెలా ఉన్నా సీఐడీ స్పెసిఫిక్ గా కొన్ని అభియోగాలు చేసింది. వాటికి మార్గదర్శి వివరణ ఏమిటి. మార్గదర్శి సంస్థ రిజర్వు బ్యాంక్ నిబంధనలను అతిక్రమించి రశీదుల పేరుతో డిపాజిట్లు వసూలు చేసిందా?లేదా? చిట్ కట్టిన వారి సొమ్ము ఇతరత్రా మళ్లించకూడదన్న రూల్ ను ఈ సంస్థ ఎందుకు పాటించలేదు? చిట్ గ్రూపులలో ఖాళీగా ఉన్న వాటిని సంస్థ పేరుతో ఎందుకు తీసుకున్నారు? ఆ చిట్‌లకు డబ్బు కట్టవలసిన అవసరం ఉందా? లేదా?
గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి?
చిట్‌ల వారీగా లాభనష్టాల ఖాతాలను ఎందుకు సక్రమంగా నిర్వహించడం లేదన్న సీఐడీ ప్రశ్నకు వీరు ఇచ్చే సమాధానం ఏమిటి? బాలెన్స్ షీట్ లోని నోట్ 7లో 460 కోట్ల రూపాయలను చూపారు. అంటే అవి వేరే సంస్థలకు మళ్లించినవేనా? కాదా? మళ్లించి ఉంటే అలా చేయవచ్చా?మార్గదర్శికి అనుబంధంగా ఉన్నట్లు చూపించిన ఉషాకిరణ్ మీడియా సంస్థ చిట్ ఫండ్ బిజినెస్ లేదన్న సంగతిని సీఐడీ గుర్తించడం వాస్తవమా?కాదా? చిట్ దారులు పాట పాడుకున్నా వెంటనే వారికి ఆ మొత్తాన్ని చెల్లించకుండా డిపాజిట్లుగా మళ్లించడం సరైనదేనా?ఆస్తి,అప్పుల నివేదికలో పెట్టుబడులను గోప్యంగా ఉంచవలసిన అవసరం ఎందుకు వచ్చింది?ఎక్కడెక్కడ శాఖలలో ప్రత్యేక ఖాతాలలో ఉంచవలసిన చిట్ సొమ్మును కార్పొరేట్ ఆఫీస్ కు తరలించారన్న ఆరోపణపై వీరు ఇచ్చే జవాబు ఏమిటి? గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిజర్వు బ్యాంక్ నిబంధనలకు విరుద్దంగా డిపాజిట్లు సేకరిస్తున్నట్లు అంగీకరించి , ఆ డిపాజిట్లను తిరిగి చెల్లించింది
వాస్తవమా?కాదా? అయినా మళ్లీ మార్గదర్శి యాజమాన్యం రశీదుల రూపంలో డిపాజిట్లు వసూలు చేయడమే కాకుండా,వాటిని మ్యూచ్ వల్ ఫండ్స్ లో పెట్టడం సక్రమమేనా? అందుకు చట్టం అనుమతిస్తుందా? ఇలాంటి సందేహాలకు మార్గదర్శి జవాబు ఇచ్చి ఉండాల్సింది. ఆ పని చేయకపోవడంతో రామోజీరావు ఆత్మరక్షణలో పడ్డారన్న భావన కలుగుతోంది. తప్పులు చేశారన్న అభిప్రాయం ఏర్పడుతుంది.ఇక్కడ ఒక మాట చెప్పాలి. మార్గదర్శి చిట్ దారులకు డబ్బులు ఇస్తోంది కదా అని కొందరు అమాయకంగా ప్రశ్నిస్తుంటారు. నిజమే. కాని ఏ సంస్థ అయినా రాజ్యాంగం నిర్దేశించిన రీతిలో ,చట్టాలను అనుసరించవలసి ఉంటుంది. వాటికి అతీతంగా ఉంటామంటే కుదరదు. రామోజీ 2007 ప్రాంతంలో డిపాజిట్లు చెల్లించడానికి పలు టీవీ చానళ్లను విక్రయించారన్న సంగతి తెలిసిందే.
ఆ విషయం తేల్చాల్సింది అధికారులే
ఇప్పుడు మార్గదర్శి చిట్ దారులకు లేదా డిపాజిట్ దారులకు చెల్లింపులు చేయగలిగినా, వారు సేకరించిన డబ్బును ఇతర సంస్థలలో పెట్టినప్పుడు వాటి నుంచి సరైన రిటర్న్స్ లేకపోతే ఆ నష్టం మార్గదర్శి భరించవలసి ఉంటుంది. రామోజీకి సంబందించిన కొన్ని సంస్థలు కూడా ఆర్దిక ఇబ్బందులకు గురై, నష్టాలలో ఉండడంతో మూతపడ్డ విషయం కూడా రహస్యమేమీ కాదు. ఆయన అదీనంలోని న్యూస్ టైమ్, సితారా, చతుర,విపుల వంటి ముద్రణలను నిలిపివేయవలసి వచ్చింది. కొన్ని సంస్థలు నష్టాలలో ఉండవచ్చు. చాలా ఆర్దిక సంస్థలు చాలాకాలం బాగానే ఉన్నట్లు కనిపిస్తాయి. కాని ఆ తర్వాత కాలంలో అవి పెట్టుబడులు పెట్టిన సంస్థలు దెబ్బతింటే, ఇవి కూడా నష్టపోతాయి.ఉదాహరణకు అగ్రిగోల్డ్ వంటి సంస్థలు ఎలా దెబ్బతిన్నాయో, ఆ తర్వాత ప్రభుత్వాలపై ఎలాంటి విమర్శలు వచ్చాయో తెలియదా?
ఆయా సంస్థలు బాగానే నడిచినంతకాలం ఎవరూ పట్టించుకోరు.. తీరా ఏదైనా తేడా రాగానే ప్రభుత్వం ఏమి చేస్తోందని వీరే ప్రశ్నిస్తారు. నష్టపోయినవారిని ప్రభుత్వం ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తుంటారు. అందువల్ల చట్టప్రకారం మార్గదర్శి వ్యవహరిస్తోందా?లేదా ? అన్న విషయం తెలుసుకోవలసిన బాద్యత ప్రభుత్వ అధికారులపై ఉంటుంది. పెట్టుబడుల సంగతి చూస్తే, మార్గదర్శి రిస్క్ ఎక్కువగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ లో మదుపరుల సొమ్ము పెట్టడానికి చట్టం అనుమతించదని చెబుతున్నారు. ఒకవేళ మ్యూచుఫల్ పండ్స్ నష్టపోతే దాని ప్రభావం మార్గదర్శి పై కూడా పడి డిపాజిటర్లు కూడా నష్టపోతారు. అన్నిటికి మించి మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ కార్యకలాపాలను ,రికార్డులను అధికారుల పరిశీలనకు ఇవ్వకుండా గోప్యంగా ఉంచడంలోని మతలబు ఏమటన్నది తెలియవలసి ఉంది. ఇది పలు అనుమానాలకు దారి తీస్తుంది.
ఏది ఏమైనా రామోజీ రావు ఈ వయసులో ఇలాంటి అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా ఉండాల్సింది.ఆయన ఒక విషయాన్ని బాగా నమ్ముతారు.చట్టాన్ని చట్టం ద్వారానే అతిక్రమించాలన్నది ఆయన ధీరి. అంటే చట్టంలోని లొసుగులను కనిపెట్టి వాటిని వాడుకోవాలని ఆయన భావిస్తారు.ఆ క్రమంలో కొన్నిసార్లు ఇలా నేరాభియోగాలకు కూడా గురి అయ్యే అవకాశం ఉందని ఈ ఉదంతం తెలియచేస్తుంది. ఏది ఏమైనా మార్గదర్శి కేసులో తోడు దొంగలు శీర్షికన ఆయనతో పాటు కోడలి పేరు, పోటోలు కూడా సాక్షి పత్రికలో వచ్చే పరిస్థితి ఏర్పడడం కచ్చితంగా రామోజీరావు స్వయంకృతాపరాదమే అని చెప్పాలి.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment