చిట్‌ఫండ్ కంపెనీలు నల్లధనం కేంద్రాలా? ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది. కాని ఏపీ సీఐడీ జరుపుతున్న విచారణలో బయటపడుతున్న విషయాలు గమనిస్తే ఆ చిట్ సంస్థలు నల్లధనాన్ని తెల్లధనంగా ఎలా మార్చుతున్నాయో అర్ధం అవుతుంది. ఈనాడు అధినేత రామోజీరావు ఆధ్వర్యంలోని మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ ఒకటే ఈ పనిలో ఉందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. రామోజీరావుపై కక్ష కట్టారా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. వారికి సమాధానం దొరికి ఉంటుంది.
రాజమహేంద్రవరంలో మరో చిట్ ఫండ్ కంపెనీ కూడా అదే పనిలో ఉందని విచారణలో తేలింది. కాకపోతే రామోజీరావు శక్తిమంతుడు కనుక తెలంగాణ హైకోర్టు ద్వారా కొంత రక్షణ పొందగలిగారు. కాని రాజమహేంద్రవరంలోని జగజ్జనని చిట్ సంస్థకు అంత పరపతి లేదో, లేక టైమ్ దొరకలేదో కాని, ఆ కంపెనీ డైరెక్టర్లు అరెస్టు కావల్సి వచ్చింది. వీరు తెలుగుదేశం పార్టీకి చెందినవారు కావడంతో ఆ పార్టీవారు దీనిని రాజకీయంగా వాడుకోవడానికి యత్నిస్తున్నారు. రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త వాసు, మామ అప్పారావులు ఈ కేసులో అరెస్టు అయ్యారు. ఇది కక్ష కూడా అని ఆమె కూడా ఆరోపించారు.
చదవండి: రామోజీరావును పెంచి పోషించింది మా నాన్నే
అంతే తప్ప తమ కంపెనీ తప్పు చేయలేదని చెప్పలేకపోతున్నారు. సహజంగానే తప్పు లేదా స్కామ్ కు పాల్పడినవారు తెలుగుదేశం కు సంబంధించినవారైతే ఆ పార్టీ నేతలే కాకుండా, ఈనాడు, ఆంధ్రజ్యోతి ,టివి 5 వంటి మీడియా సంస్థలు స్కామస్టర్ లకు మద్దతు ఇస్తూ వంత పాడుతున్నాయి. మార్గదర్శి కేసు బయటకు రాకపోతే ఈనాడు వారు ఈ జగజ్జనని పై కథలు, కథలుగా రాసేవారేమో! ఇప్పుడు సీఐడీ అక్రమంగా అరెస్టు చేసిందని ప్రచారం చేయడంలో బిజీగా ఉన్నారు. సీఐడీ వారు చేసిన పరిశోధనలో ఈ కంపెనీ చిట్‌ల రూపంలో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుతోందట. కంపెనీ ప్రభుత్వ రిజిస్ట్రేషన్ అధికారులకు ఇచ్చిన చిట్‌ల వివరాలకు, వాస్తవంగా ఉన్న చిట్‌లకు మధ్య చాలా తేడా ఉందట.
అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్నారట. అనధికారికంగా కాకినాడలో కూడా ఒక బ్రాంచ్ నడుపుతున్నారట. మరి ఇవన్ని తప్పులా?కావా? అన్న విషయాన్ని టీడీపీ అధినేత, పదమూడున్నరేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చెప్పగలగాలి కదా? ఆదిరెడ్డి అప్పారావు కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. అంటే ప్రజల డబ్బుతో అడ్డగోలుగా వ్యాపారాలు చేసేవారు తెలుగుదేశం వారైతే చాలు.. అండగా ఉంటామని చెబుతారా?ఇప్పటికే మార్గదర్శిలో సుమారు 600 కోట్ల మేర నల్లధనం సర్కులేట్ అయిందని సీఐడీ అంచనా వేసిందని వార్తలు వచ్చాయి. ఈ చిట్ కంపెనీలు డిపాజిట్‌లు వసూలు చేసే అదికారం లేకపోయినా, డిపాజిట్లు తీసుకుంటున్నాయి. ఏదైనా తేడా వస్తే డిపాజిట్ దారుల పరిస్థితి, చిట్ కట్టినవారికి ఎదురయ్యే సమస్యలు వీటన్నిటి గురించి చంద్రబాబు కు పట్టవా?
పైగా ఆయన టైమ్ లోనే డిపాజిట్ దారుల రక్షణ చట్టం వచ్చిన సంగతి మర్చిపోయారా?నిజంగానే మార్గదర్శిలో తప్పులేమీ జరగకుండా ఉంటే రామోజీ రావు ఎంత గగ్గోలు చేసి ఉండేవారు. ఆయనకు మద్దతుగా చంద్రబాబు తన పార్టీవారితో ఎన్ని ర్యాలీలు తీయించేవారో! అక్కడికి తనకు మీడియా ఉంది కనుక , ఎవరు అనుకూల ప్రకటన చేసినా దానిని తన పత్రికలో పరుస్తున్నారు.
టీవీలలో గంటల కొద్ది ప్రసారం చేస్తున్నారు. అయినా వారు ఆశించిన విధంగా ప్రజలలో తమకు అనుకూలంగా ఆందోళన కనిపించకపోవడంతో వారికి ఎటూ పాలుపోవడం లేదు. కాకపోతే న్యాయ వ్యవస్థ ద్వారా కేసుల తీవ్రత తగ్గించే యత్నం చేసుకుంటున్నారు. చివరికి మార్గదర్శిలో ఆధారాలు దొరకకుండా ఎలా ధ్వంసం చేయాలో జూమ్ మీటింగ్‌లో చెప్పే దశకు వెళ్లారంటే ఏమనుకోవాలి.
చదవండి: ‘రాజధాని దొంగల’పై సంచలన నివేదిక
తెల్లవారి లేస్తే రామోజీరావు ఎన్ని నీతులు చెబుతారు. ఇతరులపై ఎంత దారుణమైన కదనాలు రాస్తుంటారు. కాని తన వద్దకు వచ్చేసరికి అంతా గప్ చుప్‌గా ఉండాలని ఆయన కోరుకుంటారు. తన రహస్యాలు ,గుట్టుమట్లు ఎవరికి తెలియరాదని, తను పోగు చేసిన నల్లధనం, దానిని తన ఇతర కంపెనీలలో వాడుకున్న తీరు ఇవేవి జనానికి తెలియకూడదని ఆయన కంగారు పడుతున్నారు. ఇప్పుడు జగజ్జనని కేసులో డైరెక్టర్‌లు అరెస్టు అవడం వారికి భయం కలిగించే పాయింటే. ఇంతకాలం మార్గదర్శి ఒక్క సంస్థ అవకతవకలపైనే సీఐడీ దృష్టి పెట్టిందన్న విమర్శలకు ఆస్కారం లేకుండా పోయింది.
చదవండి: సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట
ఈ నేపథ్యంలోనే రాజమహేంద్రవరం జగజ్జనని చిట్ ఫండ్ కంపెనీపై వచ్చిన అభియోగాలకు ఈనాడు తదితర టీడీపీ మీడియా సంస్థలు ప్రాధాన్యత ఇవ్వలేదు.. సీఐడీ అక్రమంగా అరెస్టు చేసిందని, నోటీసులు ఇవ్వలేదని, కుటుంబ సభ్యులకు చెప్పలేదని ఇలా ఏవేవో కుంటిసాకులకు ప్రాముఖ్యత ఇచ్చారు తప్ప, సీఐడి చెబుతున్న ఆరోపణలలో వాస్తవం ఉందా? లేదా? అన్న విశ్లేషణ మాత్రం చేయడం లేదు. ఇలా ప్రతి విషయంలోను ఈ మీడియా ఇలాగే చేస్తోంది.
చివరికి తెలుగుదేశం నాయకుడు ఒకరికి లైంగిక వేధింపుల కేసులో జీవిత ఖైదు పడితే ఆ వార్తను కూడా కనబడకుండా చేయడానికి ఈ మీడియా చేసిన ప్రయత్నం చూస్తే, ఇంత నీచంగా వీరు మారారా అన్న అభిప్రాయం కలుగుతుంది. ఒక పత్రిక అయితే ఆ తీర్పు వార్తలో శిక్ష పడిన టిడిపి నేత పేరు కూడా రాయకుండా వార్త ఇచ్చింది ఈ రకంగా జర్నలిజం స్థాయిని రోజురోజుకు మరింతగా దిగజార్చుతూ రికార్డు సృష్టిస్తున్నారు.
వైసీపీవారిపై ఏవైనా ఆరోపణలు వస్తే దానిని తాటికాయంత అక్షరాలతో ప్రచారం చేసే వీరు టీడీపీ చిన్న నేతకు సంబందించిన అక్రమాల వార్తలను కప్పిపుచ్చడానికి కృషి చేస్తున్నారు. తద్వారా వచ్చే శాసనసభ ఎన్నికలలో టిడిపికి నష్టం కలగకుండా ఉండాలని తెగ ఆరాటపడుతున్నారు. ఏది ఏమైనా మార్గదర్శి, జగజ్జనని వంటి చిట్ సంస్థల అక్రమాలకు ముకుతాడు వేసే విషయంలో ఏపీ ప్రభుత్వం ఒక లాజికల్ ముగింపును తీసుకువెళ్లవలసిన అవసరం ఉందని చెప్పాలి.
-కొమ్మినేని శ్రీనివాసరావు
సి.ఆర్.ఎపి మీడియా అకాడమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment