ఈనాడు అధినేత రామోజీరావు ఈ వయసులో ఈ పరిస్థితిని ఎదుర్కోవడం ఆయన స్వయంకృతాపరాధమే అనిపిస్తుంది. మార్గదర్శి చిట్ ఫండ్స్‌కు సంబంధించి సీఐడీ సోదాలలో వెలుగు చూస్తున్న అంశాలు ఆందోళన కలిగించేవే. ఎంత పెద్ద సంస్థ అయినా సిస్టమ్స్‌ను సరిగా అమలు చేయకపోయినా, స్వయంగా యాజమాన్యమే నిబంధనలను ఉల్లంఘించినా, ఎప్పుడో అప్పుడు సంక్షోభంలోకి వెళతారనడానికి ఇదో ఉదాహరణ. గతంలో కూడా చాలా పెద్ద కంపెనీలు ఇలాగే దెబ్బతిని మూతపడ్డాయి. మార్గదర్శికి ఆ దశ రావాలని ఎవరూ కోరుకోరు.
రామోజీ అతీతుడా?
కాని అందరికీ నీతులు చెప్పే రామోజీరావు తాను మాత్రం అతీతుడిని అన్నట్లుగా వ్యవహరించడమే బాగోలేదు. ఈనాడు పత్రికలో ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలు రాస్తున్నాం కాబట్టి కక్ష బూనారని, అందుకే మార్గదర్శి చిట్స్‌పై దాడులు చేస్తున్నారని వీరి అభియోగం. నిజమే ఎవరిపైన అయినా కక్ష ఉండరాదు. అలాగని ఏదైనా సంస్థలో నిబంధనలు అమలు చేయడం లేదని తెలిస్తే, ఆ సంస్థ ప్రమాదంలో పడుతుందని సమాచారం వచ్చినా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టకుండా ఎలా ఉంటారు? ప్రభుత్వాలలోని లోపాలు ఎత్తి చూపడానికి మీడియా ఉంది. దానిని ఎవరూ కాదనలేరు.
ప్రభుత్వంపై నీచంగా అసత్యాలు, వ్యతిరేక కథనాలు
కాని మీడియా ఉంది కదా అని పత్రికలో పచ్చి అబద్దాలు రాసినా అదే పత్రికా స్వేచ్చ అట. మార్గదర్శిలో సోదాలు చేసినా, అక్రమాలు ఉన్నాయని చెప్పినా అది కక్ష అట. ఈనాడు మీడియా గత నాలుగేళ్లుగా ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎంత నీచంగా అసత్యాలు, అర్ద సత్యాలు, వ్యతిరేక కథనాలు రాసి ప్రచారం చేసింది, ఇంకా ఎలా విష ప్రచారం సాగిస్తున్నది ఎవరికీ తెలియదా? ప్రభుత్వంలోని లోటుపాట్లను ఎత్తి చూపవచ్చు. కాని అదే పనిగా ఉన్నవి, లేనివి రాయడం మాత్రం పత్రికా స్వేచ్చను దుర్వినియోగం చేయడమే అవుతుంది. గతంలో వాతావరణం అనుకూలంగా ఉండబట్టే ఏమి రాసినా నడిచిపోయింది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి మారింది.
మార్గదర్శి విషయంలో ఎందుకు చేయలేదు?
ఈనాడుకు పోటీగా మరికొన్ని మీడియా సంస్థలు వచ్చాయి. సోషల్ మీడియా ఉండనే ఉంది. అయినా జర్నలిజం విలువలకు కట్టుబడి ఉంటే మార్గదర్శి అక్రమాలను సమర్ధిస్తూ రాయగలుగుతారా? ఇతర చిట్ సంస్థలకు సంబంధించి, ఇలా ఎక్కడైనా సోదాలు జరిగితే చిలవలు, పలవలు చేసి వార్తలు రాశారా? లేదా? అంతదాకా ఎందుకు అగ్రిగోల్డ్ విషయంలో ఎన్ని కథనాలు ఇచ్చారు? ఎక్కడైనా దర్యాప్తు అధికారులు విచారణ జరుపుతుంటే, వారు పక్కన కూర్చుని చూసినట్లు రాస్తుంటారు కదా! మరి మార్గదర్శి విషయంలో ఎందుకు అలా చేయలేకపోయారు.
భుజనా వేసుకొని ప్రచారం చేస్తే ఎలా?
పైగా పత్రిక తమ చేతిలో ఉంది కదా అని పేజీల కొద్దీ ఎదురు దాడి. మార్గదర్శి చందాదారులకు భారీగా బాకీ పడి ఉంటుందని సీఐడీ అంచనా అన్నట్లు వార్తలువచ్చాయి..అవి నిజమా? కాదా? వారు చెబుతున్న అంశాలలో ఉన్న మెటీరియల్ ఏమిటి. నల్లదనం యధేచ్చగా ప్రవహిస్తోందా? లేదా? చిట్‌దారులకు డబ్బు చెల్లించడంలో ఇబ్బంది పడుతున్నారా? లేదా? ఘోస్ట్ చందాదారులు ఉన్నారని చెబుతున్నారు. ఇలా సీఐడీ చెబుతున్న వాటి గురించి మార్గదర్శి వివరణ ఇస్తే పర్వాలేదు. కాని ఈనాడు మీడియానే భుజనా వేసుకుని ప్రచారం ఎలా చేస్తోంది.
ఆ విషయం ఈనాడుకు తెలీదా?
ఇతర సంస్థల విషయంలోనూ అలాగే చేస్తారా? పన్నెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి చెందిన సాక్షి, భారతీ సిమెంట్ వంటి వాటికి వ్యతిరేకంగా ఈనాడు ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేసింది తెలియదా? సాక్షిని ఎలాగైనా మూసివేయించాలని విశ్వయత్నం చేశారా? లేదా? ఆ రోజుల్లో సోనియా గాందీ, చంద్రబాబు నాయుడు, సీబీఐఅధికారి ఒకరు, అలాగే రామోజీరావు వంటివారు ఆ కుట్రలో భాగస్వాములా? కాదా? మాట్లాడితే జగన్‌కు అలా అవుతుంది? ఇలా అవుతుంది? ఆయన ఇక జైలు నుంచి బయటకు రారు. తీహారు జైలుకు తరలిస్తారు.. అంటూ ఎన్ని కథనాలు రాశారు.
చట్టాలే మాకు వర్తించవని చెబితే కుదురుతుందా?
సీబీఐ విచారణ జరిగిందో, లేదో.. తెల్లారేసరికి ఆ విచారణలో అలా జరిగింది? ఇలా జరిగింది? ఈ ప్రశ్నలకు సమాదానం చెప్పలేదు? అంటూ ఎలా రాశారు. మరి ఇప్పుడు సీఐడీ చేస్తున్న విచారణ గురించి రాయకుండా మార్గదర్శిని వేధిస్తున్నారని ఎందుకు రాస్తున్నారు? పోనీ వేధింపులని ఫీల్ అయ్యి రాస్తే రాశారని అనుకుందాం. మరి సోదాలలో ఏమి బయటపడిందో కూడా వార్తలు ఇవ్వాలి కదా! మార్గదర్శి నిధులను చట్ట విరుద్దంగా ఇతర కంపెనీలకు తరలించారన్నది ఆరోపణ. దానిపై వీరు ఇచ్చే వివరణ ఏమిటి? అసలు చట్టాలే తమకు వర్తించవని చెబితే కుదురుతుందా? కోర్టులలో తాము పెద్ద లాయర్లను పెట్టి రక్షణ పొందగలమన్నది వారి విశ్వాసం కావచ్చు.
జర్నలిజం అవుతుందా?
గత నాలుగేళ్లుగా జగన్ ప్రభుత్వంపై ఈనాడు మీడియా అనండి.. రామోజీరావు అనండి..ఎంతలా దాడి చేస్తున్నారు? ప్రభుత్వంలోని లోపాలు ఎత్తి చూపడం, నిర్దిష్ట ఆదారాలతో ఏవైనా రాయడం మంచిదే.అలా కాకుండా అచ్చం తెలుగుదేశం కరపత్రం మాదిరి తప్పుడు వార్తలను నింపి ప్రజల మనసులను కలుషితం చేయాలని అనుకోవడం జర్నలిజం అవుతుందా? ప్రభుత్వాన్ని అస్దిర పరచాలని అనుకోవడం, కుట్రపూరితంగా ప్రజలలో వ్యతిరేకత పెంచాలని అనుకోవడం వంటివి సరైనదేనా?
ఈనాడు వైఖరికి కోపం
గతంలో కూడా కొందరు రాజకీయ నేతలు, లేదా ఇతర సంస్థలతో విభేదాలు వస్తే రామోజీరావు ఇలాగే వారిపై విరుచుకుపడేవారు. ఎక్కువ మంది ఈయనతో తగాదా పడలేక వదలివేసేవారు. ఉదాహరణకు ఈనాడు ప్రారంభానికి ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు బాగా ఉపయోగపడ్డారని అంటారు. కాని ఆ తర్వాత కాలంలో విబేధాలు వచ్చాయి. ఈనాడు వైఖరికి కోపం వచ్చిన జలగం కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మార్గదర్శి ఆఫీస్‌లో సోదాలు చేయించారు. తదుపరి అది ఏమైందో తెలియదు .అనంతరం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఈయన పత్రికను నడిపినా, మరీ అంత అడ్డగోలుగా రాసేవారు కాదు.
చంద్రబాబు వ్యూహాత్మకంగా రామోజీతో రాయబారం
పైగా కాంగ్రెస్‌లోని ఏదో ఒక గ్రూప్‌తో బాగుండేలా జాగ్రత్తపడేవారు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక కొంతకాలం సంబంధాలు సజావుగానే ఉన్నా, తదుపరి తేడా వచ్చింది. హైదరాబాద్ అసెంబ్లీ ఎదుట ఉన్న మార్గదర్శి భవనానికి అధిక అంతస్తులకు ఎన్టీఆర్ ప్రభుత్వం భద్రతా కారణాల రీత్యా అనుమతి ఇవ్వలేదని అంటారు. దాంతో వీరిద్దరి మధ్య తగాదా పెరిగిందని అనేవారు. అప్పట్లో ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు టీడీపీలో ప్రవేశించడం, ఆయన కర్షక పరిషత్ పదవి చేపట్టడం, ఆనాటి కొన్ని పరిణామాలను రామోజీ విమర్శిస్తూ వ్యతిరేక కార్టూన్లు వేయించేవారు. కాని చంద్రబాబు వ్యూహాత్మకంగా రామోజీతో రాయబారం చేసుకుని మంచి సాంగత్యం సంపాదించారు.
ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్‌పై విపరీతమైన వ్యతిరేక కార్టూన్లు వేశారు. కాంగ్రెస్ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి మీడియా రంగంలోకి వస్తుండడంపై ఆయనను దెబ్బతీయడానికి మద్య నిషేధ ఉద్యమాన్ని భుజాన వేసుకున్నారని చెబుతారు. ఆ రోజుల్లో కోట్ల విజయ భాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఈనాడు ఉద్యమాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఆయన సారాను నిషేధించారు. అయినా రామోజీరావు మధ్య నిషేధ ఉద్యమం ఆపకపోవడానికి మాగుంట నుంచి పత్రికాపరంగా వచ్చే పోటీనేనని చాలా మంది నమ్ముతారు. కోట్ల విజయభాస్కరరెడ్డి ఒక సందర్భంలో రామోజీ గురించి బాధపడ్డారు.
రామోజీ ఆడింది ఆట పాడంది పాట
ఆయనను గౌరవించి రామోజీ ఫిలింసిటీకి రోడ్డు కోసం సంఘీకి ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకుని ఇస్తే, దానికి కృతజ్ఞత చూపలేదని బాధపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రామోజీ ఆడింది ఆట పాడంది పాట అన్నట్లుగా సాగింది. టీడీపీ సంక్షోభ సమయంలో చంద్రబాబు కుమద్దతు ఇవ్వడం, ఎన్టీఆర్‌ను అవమానించడం వంటి ఘట్టాలతో ఎన్టీఆర్ నేరుగా రామోజీని తీవ్రంగానే విమర్శించేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొంతకాలం పాటు వివాదం లేకుండా చూసుకునే యత్నం జరగకపోలేదు. అయినా పరిస్థితిలో పెద్ద మార్పు రాలేదు.
వైఎస్ మీద దారుణమైన సంపాదకీయం
రింగ్‌రోడ్డులో ఆయన భూమి కొంత పోతోందని కోపం తెచ్చుకుని వైఎస్ మీద దారుణమైన సంపాదకీయం రాశారు .దాంతో వారి మధ్య పూర్తిగా సంబంధాలు చెడిపోయాయి. ఇంతలో మార్గదర్శి డిపాజిట్ల వ్యవహారం బయటకు రావడంతో రామోజీ 2600 కోట్ల రూపాయలకు తన టీవీ చానళ్లను అమ్ముకోవలసి వచ్చిందని చెబుతారు. అప్పటి నుంచి వైఎస్ ఆర్ కుటుంబంపై విపరీతమైన ద్వేషం పెంచుకున్నారు.
సాక్షితో రామోజీకి మరింత ఆగ్రహం
ఈ నేపథ్యంలో వైఎస్ తమకు సొంతమీడియా ఉండాలని భావించి సాక్షి పేపర్, టీవీ చానల్ ఆరంభించారు. అది రామోజీకి మరింత ఆగ్రహం తెప్పించింది. ఈనాడుకు సాక్షి గట్టి పోటీ అనే భావన ఏర్పడడం ఆయనకు ఇబ్బందిగా మారింది. దాంతో వైఎస్ కుటుంబంపై ఆయన పగ పెంచుకున్నారు. అంతలో వైఎస్ మరణంతో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలతో తెలివిగా సత్సంబంధాలు నెరపేవారు. కానీ వైఎస్ కుమారుడు జగన్‌పై మాత్రం వ్యతిరేక వార్తలు రాయడమే పనిగా పెట్టుకుని జగన్ కేసుల సందర్భంలో విపరీతమైన ద్వేషం ప్రచారం చేశారు. సీబీఐ విచారణను దగ్గరుండి చూసినట్లు రాసేవారు. ఆ ప్రభావం కూడా కొంతపడి 2014లో జగన్ అధికారంలోకి రాలేకపోయారు.
ముగ్గురు దొంగలు కలిసి వెంటాడుతున్నారు
అయినా జగన్ పోరాటం ఆపకుండా, తనదైన ఎజెండాతో ముందుకు వెళ్లారు. 2019 ఎన్నికల ముందు కూడా జగన్ పై దారుణమైన కథనాలు ఇచ్చినా జనం నమ్మలేదు. జగన్ భారీ మెజార్టీతో గెలుపొందారు. అది రామోజీకి సహించలేదు. ఆయనకు తోడు ఆంద్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 తోడయ్యారు. ముగ్గురు కలిసి గత నాలుగేళ్లుగా జగన్ ప్రభుత్వన్ని వేంటాడి ,వేటాడుతున్నారు. అయినా జగన్ మొండితనంతో ముందుకు సాగబట్టి వారిని తట్టుకోగలిగారు. చివరికి జగన్ ప్రభుత్వంలో సహనం నశించి రామోజీ మార్గదర్శిలోని అక్రమాలను బయటకు తీసింది.
అప్పుడు అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా రామోజీపై , ఆయన కోడలు శైలజపై కేసులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. రామోజీ ప్రభుత్వాన్ని వేధిస్తే అది పత్రికా స్వేచ్చ అని ప్రచారం చేసేవారు. మార్గదర్శి అక్రమాలను ప్రశ్నిస్తే మాత్రం అది కక్ష అని వాదిస్తున్నారు. అందులోనే వారి పక్షపాతం తెలిసిపోతుంది. గతంలో రామోజీ దందాకు వైఎస్ సవాల్ విసరగా, ఆయన కుమారుడు జగన్ ఇప్పుడు రామోజీ మూలాలు కదిలేలా చేశారు. మార్గదర్శి లోగుట్టును జనానికి తెలియచేశారు. ఇంతా రామోజీ స్వయంకృతాపరాధం కాదా!
--కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment