భీమవరం : విద్య, వైద్య, వ్యాపార రంగాల్లో అభివృద్ది చెందుతున్న భీమవరం పట్టణం జిల్లా కేంద్రం కావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతోపాటు వివిధ శాఖల కార్యాలయాల ఏర్పాటుతో ఉద్యోగుల సంఖ్య పెరిగింది. దీంతో మదుపరులు ఇక్కడ భూముల కొనుగోలుపై ఆసక్తి చూపిస్తున్నారు. భీమవరం పట్టణంలో ఇప్పటికే కార్పొరేట్ స్ధాయి ఆసుపత్రులు,
విద్యాసంస్థలున్నాయి. దీనికితోడు ఆక్వారంగం బాగా విస్తరించడంతో విదేశాలకు సైతం చేపలు, రొయ్యల ఎగుమతులు చేస్తున్నారు. రైతులకు, ఆక్వా వ్యాపారులకు డాలర్ల పంట పండడంతో భీమవరం ఖరీదైన పట్టణంగా గుర్తింపు పొందింది.
ప్రస్తుతం పట్టణం సుమారు 14 కిలోమీటర్లు విస్తరించగా.. ఇటీవల మండలంలోని తాడేరు, చినఅమిరం, రాయలం, కొవ్వాడ అన్నవరం గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఇదే సమయంలో భీమవరం జిల్లా కేంద్రం కావడంతో మరో 10 కిలోమీటర్లు విస్తరించవచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కార్యాలయాలను తాత్కాలికంగా ఏర్పాటుచేయగా పర్మినెంట్‌గా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను ఏర్పాటు చేయడానికి సుమారు 10 ఎకరాలు, ఎస్పీ కార్యాలయం ఏర్పాటుకు మరో 15 ఎకరాలు అవసరమని అంచనా వేస్తున్నారు. పర్మినెంట్ జిల్లా కార్యాలయాలు ఎక్కడ నిర్మిస్తారో తెలియకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పలు ప్రాంతాలపై దృష్టి పెట్టి భూములు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
భీమవరం సెంటర్‌లో సెంటు రూ.కోటిపైనే
రెండేళ్లుగా కరోనా కారణంగా భూముల అమ్మకాలు, కొనుగోళ్లు మందగించాయి. అనంతరం ప్రభుత్వం పేదలకు పంపిణీచేసిన ఇళ్లస్థలాల పూడిక కారణంగా ప్రైవేటు భూముల పూడికకు అంతరాయం ఏర్పడింది. ఇటీవల కరోనా ప్రభావం తగ్గడం, ప్రైవేటు భూముల పూడికకు అవకాశం ఏర్పడడంతోపాటు భీమవరం జిల్లా కేంద్రంగా అవతరించడంతో కొనుగోలుదారుల కన్ను భీమవరంపై పడింది. భీమవరం పట్టణం నడిబొడ్డున సెంటు స్థలం రూ.కోటి పైమాటే. జువ్వలపాలెం రోడ్డులో సెంటు స్థలం ఇప్పటికే రూ.50 లక్షల వరకు పలుకుతుండగా కుముదవల్లిరోడ్డులో ఇటీవల ధరలు విపరీతంగా పెరిగాయి. సెంటు స్థలం రూ.10 లక్షల నుంచి రూ.35 లక్షలకు పెరిగినట్లు చెబుతున్నారు.
మూడు నెలల్లో రూ. 18 కోట్ల ఆదాయం
భీమవరం పట్టణంలోని గునుపూడి, తాలుకా ఆఫీసు సెంటర్‌లోని రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మూడు నెలల్లో సుమారు రూ.18 కోట్ల ఆదాయం వచ్చిందని రెండుచోట్ల నెలకు చిన్నవి, పెద్దవి కలిపి సుమారు 1,700 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఒక అధికారి చెప్పారు. 30 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వ్యాపారి మాట్లాడుతూ గతంలో తక్కువ ధరకు భూములు కొనుగోలు చేయడం వల్ల పెద్ద మొత్తంలో వ్యాపారం చేసే వాళ్లమని, జిల్లా కేంద్రం కావడంతో భూములు ధరలు పెరిగి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నపాటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment