ఆకివీడు/భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లా కేంద్రానికి కావాల్సిన అన్ని అర్హతలు, హంగులూ భీమవరానికి ఉన్నాయి. విద్య, వ్యాపార, వాణిజ్య, రవాణాపరంగా ఇప్పటికే ఆధునికతను సంతరించుకుంది. ముఖ్యంగా జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూముల సేకరణ కీలకం కాగా, 1500 ఎకరాల ప్రభుత్వ భూమి భీమవరంలో అందుబాటులో ఉంది. కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాకు భౌగోళికంగా నడిబొడ్డున ఉండగా, జి ల్లాలో ఏ ప్రాంతం నుంచి అయినా ప్రజలు జిల్లా కేంద్రానికి తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు. భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, వనరులపై ఈ ప్రాంత ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇప్పటికే అధికార యంత్రాంగం ఒక నివేదికను సిద్ధం చేసి ఎమ్మెల్యేల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. భూసేకరణకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా, ఆ సొమ్ముతో ప్రభుత్వ కార్యాలయాలు, బంగ్లాలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టవచ్చని పలువురు చెబుతుండటం విశేషం.
కూత వేటు దూరంలోనే వందల ఎకరాలు
జిల్లా కేంద్రంగా భీమవరం పట్టణాన్ని ప్రకటించిన నేపథ్యంలో పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న గొల్లవానితిప్ప సమీపంలో 1,500 ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నట్లు ఈ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటే కలెక్టర్ కార్యాలయంతో పాటు, ఇతర జిల్లా శాఖల కార్యాలయాలు, కోర్టులు, ఎస్‌పీ కార్యాలయం తదితర సుమారు 100 కార్యాలయాల్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. జిల్లా స్థాయి పోలీస్ పెరేడ్ గ్రౌండ్, కలెక్టర్ కార్యాలయానికి పెరేడ్ గ్రౌండ్, క్రీడా స్టేడియం ఏర్పాటుకు ఎంతో భూమి అవసరం.
అంతేకాక ముఖ్యమైన జిల్లా స్థాయి అధికారులు, జడ్జిలకు బంగ్లాలు, క్వార్టర్లు నిర్మించాల్సి ఉంది. వచ్చే 50 ఏళ్ల జనాభాను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా జిల్లా కేంద్రాన్ని సిద్ధం చేయాల్సి ఉంది. భీమవరాన్ని జిల్లా కేంద్రంగానే కాక కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రంగా కూడా ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో డివిజన్ స్థాయిలో కూడా ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, అధికారుల నివాసానికి అనుగుణంగా బంగ్లాలు, క్వార్టర్లను కూడా నిర్మించాల్సి ఉంది. వీటన్నిటి అవసరాలకు గొల్లవానితిప్ప భూములు సరిపోతాయని అంటున్నారు. భీమవరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి ఇప్పటికే డబుల్ లైన్ తారురోడ్డు ఉంది. రైల్వే సౌకర్యం ఉంది. విజయవాడ – భీమవరం, నిడదవోలు – భీమవరం, నర్సాపురం – భీమవరం ప్రాంతాల మధ్య డబుల్ లైన్, విద్యద్దీకరణ పనులు చాలావరకూ పూర్తయ్యాయి.
అందుబాటులో ఎన్‌హెచ్, సోలార్ విద్యుత్
216ఏ కోస్తా జాతీయ రహదారి ఈ గ్రామానికి అతి సమీపంలో ఉండగా, దీనివల్ల కోల్‌కత్తా – చెన్నై, విజయవాడ, అమరావతికి రోడ్డు రవాణా మార్గం అందుబాటులో ఉంది. ఈ గ్రామం సమీపంలో ఉన్న లోసరి మెయిన్ చానల్ కాంక్రీట్ లైన్‌తో పటిష్టంగా 365 రోజులూ తాగు, సాగునీటి అవసరాలు తీరుతున్నాయి. డెల్టా ప్రాంతంలో ఎక్కడా లేనివిధంగా నాలుగేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఈ విద్యుత్ ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటికీ, బంగ్లాలు, క్వార్టర్లకు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా అందించే అవకాశం ఉంది.
సమీపంలోనే తీరం
గోల్లవానితిప్ప సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమికి దగ్గరలోనే సముద్ర తీరం ఉంది. సముద్ర ఉత్పత్తులు అభివృద్ధికి, భవిష్యత్‌లో పోర్టు నిర్మాణానికి, సముద్ర వనరుల్ని వినియోగించుకునేందుకు ఎంతగానో తోడ్పడుతుందని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు.
ఉండి కేవీకే ప్రాంతంలో..
భీమవరానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో సుమారు 70 ఎకరాల ప్రభుత్వ భూమి జిల్లా కేంద్రం కోసం అందుబాటులో ఉందని మాజీ ఎమ్మెల్యే, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. భీమవరానికి 10 కిలోమీటర్ల దూరంలో కాళ్ల మండలం సీసలి గ్రామంలో 10 ఎకరాల భూమిని దానంగా ఇచ్చేందుకు వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు గాదిరాజు సుబ్బరాజు ముందుకు వచ్చారు. ఏ విధంగా చూసినా భీమవరంలో కొత్తగా జిల్లా కేంద్రం, రెవెన్యూ డివిజనల్ కేంద్రం ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉండగా, సహకారం అందించేందుకు ఈ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు, దాతలు ముందుకు వస్తుండటం శుభపరిణామం.
సరైన నిర్ణయం
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రంగా భీమవరం పట్టణాన్ని ఏర్పాటు చేస్తూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. పట్టణం విద్య, వైద్య, వాణిజ్య రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందింది. సీఎం సరైన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– గ్రంధి శ్రీనివాస్, ఎమ్మెల్యే, భీమవరం
జిల్లాల విభజన పారదర్శకం
జిల్లాల విభజనను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పారదర్శకంగా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రాల్ని కూడా అభివృద్ధి దిశలో ఎంపిక చేశారు. వివాదాలకు తావులేకుండా ప్రజలు సీఎం మాటకు కట్టుబడి అభివృద్ధికి చేయూతనివ్వాలి.
– గోకరాజు రామరాజు,
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి
ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు
భీమవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జిల్లా కేంద్రానికి కావాల్సిన భూమి ఉండి కేవీకే ప్రాంతంలో ఉందని గతంలోనే సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిశీలించాలని కోరాను.
– పాతపాటి సర్రాజు,
క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్
వందలాది ఎకరాల్లో ప్రభుత్వ భూములు
భీమవరం జిల్లా కేంద్రం నిర్మాణానికి అపారమైన ప్రభుత్వ భూములు చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉన్నాయి. భీమవరం తప్ప మరే ప్రాంతంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేసినా ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు. వందలాదిగా ఉన్న ప్రభుత్వ భూములను సద్వినియోగం చేసుకోవచ్చు.
– ఎన్‌ఎల్. నారాయణరాజు, భీమవరం
అన్ని రంగాల్లో అగ్రగామి
అందరికీ అందుబాటులో భీమవరం ఉంది. డెల్టాప్రాంత ప్రజలకు అనువైనది. గొల్లవానితిప్పలో ప్రభుత్వ కార్యా లయాల నిర్మాణానికి భూమి కావాల్సినంత ఉంది. ఆక్వా, ఇతర రంగాల్లోనూ పట్టణం అభివృద్ధి చెందింది. అన్నింటికీ అనువైన కేంద్రం భీమవరం.
– షేక్ ఫకీర్ సాహెబ్,
నూర్‌భాషా సంఘ సభ్యులు, భీమవరం
Comments
Please login to add a commentAdd a comment