
సాక్షి, అమరావతి: పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో తన బెయిల్‌ను రద్దు చేస్తూ చిత్తూరు సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నారాయణ విద్యా సంస్థల అధినేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తింది. సెషన్స్ కోర్టు ఉత్తర్వులపై క్వాష్ పిటిషన్ దాఖలుకు వీల్లేదని, రివిజన్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని తెలిపింది. రిజిస్ట్రీ అభ్యంతరంపై న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు మంగళవారం విచారణ జరిపారు.
నారాయణ తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ.. సీఆర్‌పీసీ సెక్షన్ 482 కింద క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంపై నిషేధం లేదని అన్నారు. సెషన్స్ కోర్టు ఉత్తర్వులపై దాఖలు చేసే క్వాష్ పిటిషన్‌కు విచారణార్హత ఉందంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించారు. దీంతో రిజిస్ట్రీ అభ్యంతరాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు.
నారాయణ పిటిషన్‌కు నంబరు కేటాయించాలని ఆదేశించారు. లూత్రా వాదనలు కొనసాగిస్తూ.. బెయిల్‌ను రద్దు చేస్తూ జిల్లా, సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని అన్నారు. అన్ని ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసిందన్నారు. పైగా, అవి తాత్కాలిక ఉత్తర్వులేనని తెలిపారు.
తాత్కాలిక ఉత్తర్వులపై పోలీసులు రివిజన్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని, దానికి విచారణార్హత లేదని వివరించారు. నారాయణ పబ్లిక్ సర్వెంట్ కాదని, అందువల్ల ఐపీసీ సెక్షన్ 409 కింద విచారణకు వీల్లేదన్నారు. పోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్‌రెడ్డి స్పందిస్తూ.. ఈ కేసులో అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తారని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని కోరారు. దీంతో న్యాయమూర్తి తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment